ETV Bharat / city

కరోనాకు 'సీజనల్' తోడై బెంబేలెత్తుతున్న జనం

author img

By

Published : Aug 20, 2020, 5:50 AM IST

ఓ పక్క కరోనా... మరోపక్క సీజనల్‌ జ్వరాలు... కలగలిసి జనాన్ని మరింత కలవరానికి గురి చేస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల వల్ల వాతావరణం చల్లబడి, దోమలు వృద్ధి చెంది... మలేరియా, డెంగీ జ్వరాలు పీడిస్తున్నాయి. కలుషిత నీటితో వాంతులు, విరేచనాలతో పాటు కామెర్లలాంటి వ్యాధులూ సోకే ప్రమాదం లేకపోలేదు. ఎన్నడూ లేని విధంగా కరోనా విజృభిస్తుండటం, దాని ప్రధాన లక్షణం జ్వరమే కావడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఒళ్లు వెచ్చబడగానే ఆ జ్వరం కరోనా వల్ల వచ్చిందా... సాధారణమా?.. మలేరియానా? డెంగీనా?... అర్థం కాక జనం అల్లాడుతున్నారు.

కరోనాకు 'సీజనల్' తోడై బెంబేలెత్తుతున్న జనం
కరోనాకు 'సీజనల్' తోడై బెంబేలెత్తుతున్న జనం

కరోనాతో తలెత్తే జ్వరం ప్రత్యేకమైనది. ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లలో హఠాత్తుగా తీవ్ర జ్వరం వస్తే... కరోనా విషయంలో చాలావరకు స్వల్ప స్థాయిలోనే (99-100 డిగ్రీల ఫారెన్‌హీట్‌) ఉండిపోతుంది. జ్వరం వచ్చినట్లు కొందరికి తెలియడమే లేదు. న్యుమోనియా, కణజాలాల్లో వాపు మొదలైతే తప్ప జ్వరం తీవ్రం కావటంలేదు. తీవ్రత ఆధారంగా అది కరోనానా? కాదా? అన్నది తేల్చుకోవడం కష్టమని, జ్వరంతోపాటు శ్వాస పీల్చుకోవడంలో సమస్య ఉంటే... వెంటనే జాగ్రత్త పడాలని రాష్ట్ర కొవిడ్‌-19 నోడల్‌ అధికారి, ఫిజీషియన్‌ డాక్టర్‌ రాంబాబు పేర్కొన్నారు. మలేరియా జ్వరాలు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. డెంగీ, చికున్‌గున్యా జ్వరాలు విశాఖ జిల్లాలో అత్యధికం. గత ఏప్రిల్‌ నుంచి మొదలైన సీజనల్‌ జ్వరాలు ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున క్రమేణా పెరుగుతున్నాయి.

  • యాంటీజెన్‌ పరీక్షలు చేస్తున్నాం

జ్వర లక్షణాల్ని బట్టి పీహెచ్‌సీ, ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేస్తున్నాం. అది ఏ జ్వరమో గుర్తించాక రోగులకు వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. 14 సెంటినల్‌ సర్వైలైన్స్‌ కేంద్రాల్లో డెంగీ నిర్ధరణ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. గిరిజన ప్రాంతాల్లో వచ్చే మలేరియా జ్వరాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం.

- డాక్టర్‌ అరుణ,సంచాలకులు, రాష్ట్ర ప్రజారోగ్య శాఖ

  • వైద్యుల దగ్గరకు వెళితే...

కొన్నిచోట్ల జ్వరం వచ్చిందని అందుబాటులో ఉన్న ప్రైవేట్‌ వైద్యులకు దగ్గరకు వెళితే.. వారు కనీసం నాడి చూడటంలేదు. కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుని ఫలితంతో రావాలని, అప్పుడే ఇతర పరీక్షలు నిర్వహిస్తామంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ... కరోనా నిర్ధారణ పరీక్షలు ఎక్కడ చేయించుకోవాలో తెలియని వారున్నారు. కొందరైతే మందుల దుకాణాల వారు ఇచ్చే మాత్రలతో సరి పెట్టుకుంటున్నారు. ఈ పరిణామం ఒక్కోసారి ప్రాణాంతకంగా మారొచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జ్వరాలకు సంబంధించిన చికిత్సలను మరింత పక్కాగా అందుబాటులోకి తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • లక్షణాలపై అప్రమత్తం

చలి జ్వరం లక్షణంగా మలేరియా వస్తుంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు రావడం, ప్లేట్‌లెట్స్‌ తగ్గడం డెంగీ సూచికలు. మోకాలు, మోచేయి, తుంటి, కీళ్ల నొప్పులతో జ్వరం రావడం చికున్‌గన్యా లక్షణాలు. కొందరికి ఫ్లూ జ్వరం ఉన్నట్లుండి వస్తుంది. ఒళ్లు నొప్పులు, తుమ్ములు, ముక్కుకారటం, గొంతునొప్పి, చెవి నొప్పి, దగ్గు, గొంతు గరగర, కళ్ల నుంచి నీరు రావటం దీని ప్రధాన లక్షణాలు. డెంగీ, మలేరియా, చికున్‌గన్యా ఇతర జ్వరాలకు కారకాలైన దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఇళ్లలో పగిలిన కప్పులు, పాత టైర్లు, ఎయిర్‌ కూలర్లు, పూల కుండీలు, కొబ్బరి చిప్పలు, నీటి డ్రమ్ములు, నీటి ట్యాంకులు, పంపులున్న చోట్ల అవి పుట్టుకొస్తున్నాయి. దోమలు పెరగకుండా చూసుకోవాల్సి ఉంది.

ఇదీ చదవండి: కీలక నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.