ETV Bharat / city

Tax Problems: పన్నుల భారంతో సామాన్యులు సతమతం.. వందల మందికి నోటీసులు..!

author img

By

Published : Mar 22, 2022, 6:32 PM IST

Tax Problems: రాష్ట్ర ప్రభుత్వం పన్నుల పేరిట అంతులేని భారం మోపుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇంటి పన్ను, చెత్త పన్ను అంటూ ఇప్పటికే వాత పెడుతుండగా.. మూలిగే నక్కపై తాడిపండు పడినట్లు ఇప్పుడు భూమార్పిడి కింద నాలా పన్నులు కట్టాలంటూ నోటీసులు జారీ చేయడం దారుణమంటున్నారు. ఎప్పుడో కొనుగోలు చేసిన భూములకు ఇప్పడు పన్నులేంటని ప్రశ్నిస్తున్నారు.

people face Tax Problems in Andhra Pradesh
పన్నుల భారంతో సామాన్యులు సతమతం

పన్నుల భారంతో సామాన్యులు సతమతం

Tax Problems: వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎడాపెడా పన్నులు వేస్తూ ప్రజలకు ఊపిరాడకుండా చేస్తోంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇప్పటికే పలు రకాల పన్నుల శాతాన్ని పెంచేసింది. ఇప్పుడు కొత్తగా నాలా పన్నుల పేరుతో లక్షల రూపాయలు కట్టాలంటూ ఇళ్లకు నోటీసులు పంపిస్తోంది. 2006 తర్వాత భూమార్పిడి జరిగి ఇళ్లు నిర్మించుకున్న వారు.. నాలా పన్ను కట్టాలని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో 30 వేల మందికి చెందిన 25 వేల ఎకరాలను భూమార్పిడి చేసినట్లు ఇప్పటికే గుర్తించిన రెవెన్యూ అధికారులు.. పన్నులు కట్టాలని నోటీసులు జారీ చేశారు. ఇందులో 5 శాతం నాలా పన్ను కాగా, మరో 5 శాతం జరిమానా విధిస్తున్నారు.

నాలా పన్ను చెల్లించాలంటూ కృష్ణా జిల్లా రామవరప్పాడు పంచాయతీ, హనుమాన్ నగర్‌లో వందల మందికి పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో అత్యధికులు పేద ప్రజలే. పదేళ్ల ముందు కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడు నాలా పన్ను చెల్లించమనడం ఏంటని నోటీసులు తీసుకున్న వారు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారంటూ అదనపు రుసుము చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారని వాపోతున్నారు. రోజుకూలీ చేసుకుని జీవనం సాగించే తాము.. లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలో తెలియడం లేదంటున్నారు. అప్పట్లో భూమి కొన్న ధర కంటే.. ఇప్పుడు ప్రభుత్వం విధించిన పన్నే ఎక్కువగా ఉందని ఆవేదన చెందుతున్నారు.

చట్ట ప్రకారం పన్ను చెల్లించాల్సిందేనని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. నోటీసులు అందుకున్నవారు 15 రోజుల్లోపు పన్ను చెల్లించకపోతే.. ఉన్నతాధికారుల ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ప్రభుత్వం విధించిన పన్నులు కట్టాలంటే.. ఇళ్లు అమ్ముకోవాల్సిందేనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


ఇదీ చదవండి:

Idupulapaya IIIT: ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో అధికారుల చర్చలు సఫలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.