ETV Bharat / city

'గడప గడప'లో అవే నిరసనలు.. నేతలకు తప్పని ప్రశ్నలు

author img

By

Published : May 19, 2022, 4:54 PM IST

Updated : May 19, 2022, 7:42 PM IST

YSRCP gadapa gadapaku program: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్న నేతలకు అడుగడుగునా నిరసనలు ఎదురవుతున్నాయి. ప్రజలు సమస్యలతో స్వాగతం పలుకుతూ... ప్రశ్నలతో నిలదీస్తున్నారు. కోనసీమ జిల్లాలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. ఎమ్మెల్యేను.. పథకాల రద్దుపై ఎస్సీలు నిలదీశారు. అయితే స్థానిక సమస్యలుంటేనే చెప్పండంటూ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ముందుకు సాగారు. శ్రీకాకుళం జిల్లా ఆనందపురంలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్​కు స్థానికులు సమస్యలు, నిరసనలతో స్వాగతం పలికారు.

YCP gadapa gadapaku program
గడప గడపకు మన ప్రభుత్వం

YSRCP gadapa gadapaku program: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో మరో వైకాపా ఎమ్మెల్యేకు ప్రజల నుంచి ప్రశ్నలే ఎదురయ్యాయి. సమస్యలు ఎందుకు పరిష్కరించలేదంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం చిరుతపూడిలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పర్యటించారు. ఓ మహిళ పేదలందరికీ ఇళ్లు హామీపై ప్రశ్నించగా.. ఎమ్మెల్యే సమాధానమిచ్చి లేవబోయారు. ఆలోపే ఓ యువకుడు సమస్యలను పేపర్​పై రాసుకొచ్చి ప్రశ్నించేలోపే.. అవన్నీ తనకు తెలియదంటూ అక్కడినుంచి వేగంగా కదిలారు. ఎస్సీలకు అంబేడ్కర్ కల్పించిన ఫలాలను వైకాపా ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందంటూ యువకుడు ఎమ్మెల్యేను వెంబడించాడు. చదివి వినిపిస్తా అని అంటే.. అంత ఓపిక లేదని ఎమ్మెల్యే అన్నారు. నీ రాజ్యాంగం అటుంచి సమస్య చెప్పు అని యువకుడిని పోలీసులు గద్దించారు.

గడప గడపకు మన ప్రభుత్వం

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం ఆనందపురంలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్​కు స్థానికులు సమస్యలు, నిరసనలతో స్వాగతం పలికారు. పలువురు లబ్ధిదారులు.. గృహ నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు రాలేదని ఎమ్మెల్యేను నిలదీశారు. పెన్షన్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుట్టుమిషన్లకు సంబంధించిన నగదు కూడా ఇంతవరకు ఇవ్వలేదని, అమ్మఒడి, తదితర పథకాలు సక్రమంగా అందడం లేదని మహిళలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో సమస్యను వినకుండా ఎమ్మెల్యే కిరణ్ కుమార్ ముందుకు కదిలారు.

బాపట్లలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఉపసభాపతి కోన రఘుపతి పాల్గొన్నారు. ఇంటింటికి ప్రభుత్వం అందజేస్తున్న పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ప్యాడిసన్​పేట వాసులు సమస్యలను కోన రఘుపతికి విన్నవించుకున్నారు. తమ వార్దులో డ్రైన్, అంతర్గత రోడ్లు సరిగా లేవని, ఓటీఎస్ పథకం కింద రూ.15 వేలు కట్టినా ఇంకా రిజిస్ట్రేషన్ పత్రాలు తమకు ఇవ్వలేదని వాపోయారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని కోన రఘుపతి హామీ ఇచ్చారు.

'గడప గడపకు మన ప్రభుత్వం' అనే కార్యక్రమంలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్​రెడ్డి రెండోరోజు సింహాద్రిపురం మండలం సుంకేసుల జంగంరెడ్డి పల్లె, దేవతాపురం గ్రామాల్లో పర్యటించారు. ఎంపీ వైఎస్ అవినాష్​రెడ్డి ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు వివరిస్తూనే.. ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల వద్ద నుంచి పింఛన్లు, ఇళ్ల మంజూరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్య తదితర సమస్యలను ఎంపీ ఏకరువు పెట్టారు. ఇందుకు ఎంపీ స్పందించి అధికారులకు ఫోన్లు చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. కొందరు ఇల్లు కట్టించుకున్నా బిల్లులు మంజూరు కాలేదని ఎంపీకి విన్నవించుకోగా.. త్వరగా బిల్లు మంజూరు చేయాలని హౌసింగ్ అధికారులకు సూచించారు. జంగం రెడ్డిపల్లెలో ఓ రైతు తమ పంటలకు ఈ-క్రాప్ చేయలేకపోవడంతో ఇన్సూరెన్స్ రాలేదని ఎంపీకి తెలుపగా.. ఈ సమస్యను స్వయంగా నోట్ చేసుకున్నారు.

సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం ఉడములకుర్తిలో సమస్యలపై ఎమ్మెల్యే సిద్దారెడ్డిని స్థానికులు నిలదీశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సిద్దారెడ్డి ఉడములకుర్తి లో పర్యటించారు. ఈ సందర్భంగా తాగునీటి సమస్య, రహదారుల పరిస్థితిపై తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప్రజలతో మాట్లాడకుండానే అక్కడి నుంచి జారుకున్నారు. ఓట్లు అడగడం పై ఉన్న శ్రద్ధ సమస్యలు పరిష్కరించడం పై చూపరా అంటూ మహిళలు ప్రశ్నించారు. ఇవేవీ పట్టించుకోకుండా ఎమ్మెల్యే వెళ్లిపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : May 19, 2022, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.