ETV Bharat / city

Lokesh: లోకేశ్​ జూమ్​ మీటింగ్​లో వైకాపా ఎమ్మెల్యేలు వంశీ, కొడాలి నాని

author img

By

Published : Jun 9, 2022, 1:47 PM IST

Updated : Jun 10, 2022, 8:27 AM IST

nara lokesh fires on ysrcp over disturbing zoom meeting with ssc students and parents
జూమ్​లో దొంగ ఐడీలతో సమావేశాన్ని డిస్టర్బ్‌ చేస్తారా..?: నారా లోకేశ్

Lokesh:పదో తరగతి ఫెయిలైన విద్యార్థులతో నారా లోకేశ్‌ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లోకి కొడాలి నాని, వల్లభనేని వంశీ చొరబడటం వివాదానికి దారి తీసింది. వైకాపా నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్‌.. చాతనైతే బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని సవాలు చేశారు. లోకేశ్‌ పిల్లలను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నందున ఆపేందుకే జూమ్‌ మీటింగ్‌లోకి వచ్చామని కొడాలి నాని తెలిపారు.

లోకేశ్​ జూమ్​ మీటింగ్​లో వైకాపా ఎమ్మెల్యేలు వంశీ, కొడాలి నాని

Lokesh: పదోతరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో తెదేపా ప్రధానకార్యదర్శి లోకేశ్‌ నిర్వహించిన జూమ్‌ కాన్ఫరెన్స్‌లోకి మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా పలువురు వైకాపా నాయకులు పదోతరగతి విద్యార్థుల ఐడీలతో చొరబడ్డారు. సమావేశానికి అవరోధం కలిగించేందుకు ప్రయత్నించడంతో కొంత గందరగోళం ఏర్పడింది. వారిలో నాని, వంశీలతో పాటు.. వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్‌ఛార్జి, చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, విజయవాడ నగరపాలక సంస్థ ఎనిమిదో వార్డుకు వైకాపా తరఫున కార్పొరేటర్‌గా పోటీచేసిన కొత్తపల్లి రజని తదితరులున్నారు. మాట్లాడేందుకు అవకాశమివ్వాలని మొదట విద్యార్థులతో చేతులు ఎత్తించి.. వారిని లైన్‌లోకి తీసుకున్నాక, వైకాపా నాయకులు మాట్లాడే ప్రయత్నం చేశారు. వైకాపా నాయకుల తీరుపై లోకేశ్‌ ధ్వజమెత్తారు.

కొడాలి నాని, వంశీ మాట్లాడుతున్నప్పుడు.. మ్యూట్‌లో ఉండటంతో వారేం చెబుతున్నారో వినపడలేదు. రమ్యశ్రీ అనే విద్యార్థిని లైవ్‌లోకి వచ్చి, తన పిన్ని మాట్లాడతారని చెప్పారు. అప్పుడు కొత్తపల్లి రజని మాట్లాడుతూ.. అప్పట్లో పదోతరగతి పరీక్షలు పెట్టవద్దని లోకేశ్‌ డిమాండ్‌ చేయడమే సమస్యకు మూలకారణం అన్నట్టుగా చెప్పారు. అప్పట్లో కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదమనే పరీక్షల వాయిదాకు డిమాండు చేశామని లోకేశ్‌ బదులిచ్చారు. కొవిడ్‌ తగ్గాక మిగతా రాష్ట్రాల్లో మంచి ఫలితాలు వచ్చాయని, ఏపీలో ప్రశ్నపత్రాలు మార్చడం వల్లే ఎక్కువ మంది పరీక్ష తప్పారని ఆయన అన్నారు.

తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్‌లను ఉద్దేశించి దేవేందర్‌రెడ్డి అభ్యంతరకర పదజాలంతో మాట్లాడుతుంటే, లోకేశ్‌ తీవ్రంగా మండిపడ్డారు. ‘మీపేరు దేవేందర్‌రెడ్డి అనీ, వైకాపా సామాజిక మాధ్యమ విభాగం సమన్వయకర్తనీ నాకు తెలుసు. ప్రభుత్వ పోస్టులో ఉంటూ ప్రజాధనం ఎంత తినేస్తున్నారో కూడా తెలుసు. మీరు దద్దమ్మలు, చేతగానివాళ్లు కాబట్టే.. విద్యార్థుల పేరుతో వచ్చి అవరోధం కలిగిస్తున్నారు. జూమ్‌లో ఎందుకు.. నేరుగానే వస్తాను అప్పుడు మాట్లాడండి. మీరు గానీ, వంశీ గానీ, నాని గానీ.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతారు?’ అని లోకేశ్‌ మండిపడ్డారు.

నాని, వంశీ జూమ్‌ మీటింగ్‌లోకి వచ్చిన స్క్రీన్‌షాట్‌ని ఆయన చూపించారు. ‘రాజకీయాలు మాట్లాడమన్నా మాట్లాడదాం. ప్రత్యేక హోదా ఏమైంది? మీ ముఖ్యమంత్రి ఏం సాధించారు? పదోతరగతిలో ఉత్తీర్ణత తగ్గడం వల్లే నేను మాట్లాడుతున్నాను. ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే, మీకు బాధగా లేదా? మేం ఒక పవిత్ర కార్యక్రమం చేపడితే, విద్యార్థుల ముసుగులో రావడానికి సిగ్గులేదా?’ అని లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ప్రజలు ఛీ కొడుతున్నారని జూమ్‌లోకి వచ్చారు.. వైకాపా నాయకులు గడప గడపకు వెళుతుంటే ప్రజలు ఛీ కొడుతున్నారని, అందుకే పిల్లల్ని అడ్డుపెట్టుకుని జూమ్‌ ససమావేశంలోకి వచ్చి అవరోధం కలిగించాలని చూశారని లోకేశ్‌ అన్నారు. ‘శాసనసభ్యులుగా, సలహాదారులుగా ఉండి.. నెలకు రూ.3 లక్షల చొప్పున దోచేస్తున్నవారు వచ్చి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. మీ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి ఎలాగూ మాట్లాడలేరు కాబట్టే.. మాపై దాడి చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. అనంతరం ఆయన ‘పదోతరగతి ఫెయిలైనవారిని పంపడం కాదు జగన్‌రెడ్డీ, మీరే రండి.. పదో తరగతిలో ఉత్తీర్ణత ఎందుకు తగ్గిందో సాక్షి ఛానల్‌లోనే చర్చించుకుందాం’ అని ట్వీట్‌ చేశారు.

అమ్మఒడి లబ్ధిదారుల్ని తగ్గించే కుట్ర: విద్యార్థులు, తల్లిదండ్రులతో లోకేశ్‌.. అమ్మ ఒడి పథకం లబ్ధిదారులను తగ్గించే కుట్రతోనే రాష్ట్రప్రభుత్వం పదోతరగతిలో ఎక్కువమందిని ఫెయిల్‌ చేసిందని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ధ్వజమెత్తారు. అమ్మఒడితో పాటు, ఇంటర్‌, పాలిటెక్నిక్‌లలో చేరే విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్నీ తగ్గించుకునేందుకే పదోతరగతి విద్యార్థుల్ని ఫెయిల్‌ చేశారని ఆయన మండిపడ్డారు. పదోతరగతిలో తప్పిన, ఊహించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో లోకేశ్‌ గురువారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

‘కనీస అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎంత ప్రమాదమో చూస్తున్నాం. జగన్‌రెడ్డి మూర్ఖత్వంతో విద్యావ్యవస్థను నాశనం చేశారు. 2018లో తెదేపా ప్రభుత్వ హయాంలో 94.48% ఉత్తీర్ణులైతే, ఇప్పుడు జగన్‌రెడ్డి పాలనలో అది 67.26%కు పడిపోయింది. రెండు లక్షల మంది ఫెయిలవడమేంటని అందరూ బాధపడుతుంటే జగన్‌రెడ్డి రూ.వేలకోట్ల అమ్మఒడి డబ్బులు మిగిలాయని సంబరాలు చేసుకుంటున్నారు’ అని లోకేశ్‌ ధ్వజమెత్తారు.

ఉత్తీర్ణత అంత ఘోరంగా పడిపోవడానికి కారణమేంటో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి తక్షణం సమీక్షించాలని, పొరపాటు ఎక్కడ జరిగిందో శ్వేతపత్రం విడుదల చేయాలని, రీ వెరిఫికేషన్‌, సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

డాక్టర్‌ అవ్వాలనుకుంది.. ఫెయిలై ఆత్మహత్య చేసుకుంది: ‘మేం చాలా బీదవాళ్లం. నా కుమార్తె వెన్నెల బాగా చదువుతుంది. డాక్టర్‌ అవ్వాలని ఆశపడేది. పదోతరగతి పరీక్షల్లో ఎందుకు తప్పిందో అర్థం కావట్లేదు. నాలుగు మార్కులు తక్కువ వచ్చాయి. అది భరించలేక ఆత్మహత్య చేసుకుంది’ అని వెన్నెల తండ్రి కె.హనుమంతరావు ఆవేదన వ్యక్తంచేశారు. ‘ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. గతంలో పేపర్‌ 1, 2 ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వం అన్నీ మార్చేసింది’ అని శిరీష్‌ తండ్రి సుధాకర్‌ పేర్కొన్నారు.

‘1980లో అంజయ్య ప్రభుత్వం 10 గ్రేస్‌ మార్కులు ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా అలాగే ఇవ్వాలి’ అని పదో తరగతి విద్యార్థి తండ్రి అబ్బిరెడ్డి కోరారు. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు వచ్చాయని, సైన్స్‌లో మాత్రం ఒకే ఒక్క మార్కుతో ఫెయిలయ్యానని, ఎందుకలా జరిగిందో అర్థం కావట్లేదని రాయపూడికి చెందిన సోనీ ఆవేదన వ్యక్తంచేశారు. సోషల్‌ పరీక్షలో 24 పేజీలు రాస్తే, ఆరు మార్కులే వేశారని శ్రీజ అనే మరో విద్యార్థిని వాపోయారు.

ఇవీ చూడండి:

Last Updated :Jun 10, 2022, 8:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.