COUNTING : కాసేపట్లో ప్రారంభంకానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్

author img

By

Published : Sep 19, 2021, 2:33 AM IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈమేరకు కౌంటింగ్‌ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశించారు. నిబంధనలు కఠినంగా అమలవుతాయని... ఫలితాల అనంతరం విజయోత్సవాలు, ర్యాలీలు పూర్తిగా నిషేధమని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టంచేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. 958 హాళ్లలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు వచ్చే ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సమీక్షించారు. కరోనా నెగెటివ్, రెండు డోసుల వ్యాక్సినేషన్ పత్రం తీసుకొచ్చినవాళ్లకే అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియను సమీక్షించేందుకు తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు.

గుంటూరు జిల్లాలో 571 ఎంపీటీసీ, 45 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇన్నాళ్లూ స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరిచిన బ్యాలెట్లను కాసేపట్లో లెక్కించనున్నారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల్లో 598 టేబుళ్లు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో 31 జెడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్లను 31 కేంద్రాల్లో లెక్కించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పది ప్రదేశాల్లో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగనుంది. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.

తూర్పుగోదావరి జిల్లాలో 61 జడ్పీటీసీ స్థానాలకు, వెయ్యి ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 12 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. మూడు రౌండ్లలో ఫలితాలు వెలువడేలా ఏర్పాట్లు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమవరం, తణుకు కేంద్రాల్లో ఓట్లలెక్కింపు నిర్వహించనున్నారు. జిల్లాలో 45 జెడ్పీటీసీ స్థానాలకు, 781ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. 45కౌంటింగ్ హాళ్లు, 715 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలో 41 జెడ్పీటీసి స్థానాలకు, 367 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా... పోలైన ఓట్లను లెక్కించేందుకు 12 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 109 హాల్స్‌ లో లెక్కింపు జరగనుంది.

చిత్తూరు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పదకొండు కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. 33 జడ్పీ స్థానాలకు, 419 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థులు చనిపోవడంతో పాటు కోర్టు కేసుల నేపథ్యంలో 34 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. కడప జిల్లాలో 12 జెడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 781 ఎంపీటీసీ, 62 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించిన ఓట్ల లెక్కింపును 17 కేంద్రాల్లో నిర్వహించున్నారు. కర్నూలు జిల్లాలో 37 జెడ్పీటీసీ, 495 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 16సంస్థల ప్రాంగణాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

నెల్లూరు జిల్లాలో పది కౌంటింగ్ కేంద్రాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరగనుంది. నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కేంద్రం వద్ద శనివారం రాత్రి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తడ మండలంలోని ఆరు ఎంపీటీసీ స్థానాల లెక్కింపునకు ఏజెంట్లుగా దరఖాస్తు చేసుకున్న తెలుగుదేశం కార్యకర్తలను అనర్హులుగా అధికారులు ప్రకటించటంతో వారు వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేరే అభ్యర్థులు ఏజెంట్‌గా దరఖాస్తు చేసుకున్నారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు వెలువడిన 24 గంటల తర్వాత జిల్లా పరిషత్‌ ఛైర్మన్, మండల పరిషత్‌ ఛైర్మన్ల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేయాలని యోచిస్తోంది. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్‌ వెలువడిన అయిదు రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ నెల 25లోగా జడ్పీ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్లు, మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలు చేయడంతో రెండో వైస్‌ ఛైర్మన్‌ను సైతం ఎన్నుకోనున్నారు. నగరపాలక సంస్థల్లో, పురపాలక సంఘాల్లోనూ రెండో డిప్యూటీ మేయర్, రెండో వైస్‌ ఛైర్మన్ల స్థానాలను కొత్తగా తీసుకొచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.