ETV Bharat / city

రాష్ట్రంలో పలుచోట్ల స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌

author img

By

Published : Apr 28, 2021, 7:44 AM IST

కరోనా విస్తృత వ్యాప్తి దృష్ట్యా.. రాష్ట్రంలోని కొన్ని నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించారు. వైరస్‌ కట్టడికి.. తమవంతుగా పరిమిత సమయంలోనే దుకాణాలు తెరుస్తున్నారు. ఆలయాల దర్శన సమయాన్ని కుదించారు.

రాష్ట్రంలో పలు చోట్ల స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌
రాష్ట్రంలో పలు చోట్ల స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌

రాష్ట్రంలో పలు చోట్ల స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. రోజుకు పది వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు పలుచోట్ల స్వచ్ఛంద లాక్‌డౌన్‌ విధించుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో కరోనా వేగంగా వ్యాప్తిస్తోంది. తిరుపతి నగరంలో వైరస్‌ కట్టడికి.. తమవంతుగా నగర వ్యాపార, వాణిజ్య సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలను తెరవాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. ఈ ప్రకటనతో తిరుపతిలోని ప్రధాన వ్యాపార కూడళ్లైన.. గాంధీ రోడ్, 4 కాళ్లమండపం, బైరాగిపట్టెడ, కృష్ణాపురం ఠాణా, తిలక్ రోడ్ వంటి ప్రాంతాల్లో దుకాణాలన్నీ మధ్యాహ్నం నుంచే మూసివేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శననాకి వచ్చే భక్తుల దృష్ట్యా హోటళ్లకు మాత్రం మధ్యాహ్నం 3 గంటల వరకూ సమయం ఇచ్చారు.

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దర్శన వేళలు మార్పు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి వీలు కల్పించారు.

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ.. అధికార యంత్రాంగం మరిన్ని చర్యలు చేపట్టింది. ప్రార్థనా మందిరాల్లో భక్తుల నియంత్రణ, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల సమయం కుదింపు చేపట్టారు. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామ, అంతర్వేది, అయినవిల్లి, కోటిపల్లి, వాడపల్లితోపాటు.. అన్ని ఆలయాల్లో దర్శనాల వేళల్ని కుదించారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు పరిమత సంఖ్యలో అనుమతిస్తారు. రంజాన్ మాసం సందర్భంగా మసీదుల్లో సమాజ్‌కు 18 నుంచి 45 ఏళ్లలోపు వయసున్న వారిని పరిమిత సంఖ్యలో అనుమతిస్తారు.

కాకినాడ, రాజమహేంద్రవరం సహా జిల్లాలోని వ్యాపార కార్యకలాపాల సమయాలను అధికారులు కుదించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతించారు. హోటళ్లు, రెస్టారెంట్లు కూడా సాయంత్రం ఆరు గంటలకు మూసేయాలని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎక్కడికక్కడ స్వచ్ఛంద లాక్‌డౌన్‌ విధిస్తున్నారు.

ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలకు 'ఈటీవీ బాలభారత్'​ అంకితం: రామోజీరావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.