ETV Bharat / city

కొనసాగుతున్న.. స్థానిక సంస్థల పోలింగ్

author img

By

Published : Nov 15, 2021, 6:41 AM IST

Updated : Nov 15, 2021, 3:34 PM IST

రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని స్థానిక సంస్ధలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నిర్వహిస్తున్న ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్ సహా.. తెదేపా అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం మున్సిపాలిటీకి సైతం ఎన్నిక జరగుతుండడంతో.. అందరి దృష్టి నెలకొంది.

local body elections
local body elections

స్థానిక సంస్థల పోలింగ్

రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్​లో అన్ని డివిజన్లలో ఎన్నికలు జరగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు, కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట, కొండపల్లి , గుంటూరు జిల్లాలో దాచేపల్లి, గురజాల, ప్రకాశం జిల్లాలో దర్శి, నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డి పాలెంలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న చిత్తూరు జిల్లాలో కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికలను అధికార ప్రతిపక్ష పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ ఇవాళ పోలింగ్ ప్రశాంతంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లాలో బేతం చర్ల , కడప జిల్లాలో కమలాపురం, కడప జిల్లా రాజంపేట, అనంతపురం జిల్లాలో పెనుకొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగని వార్డుల్లోనూ ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహిస్తోంది. గ్రేటర్‌ విశాఖలో రెండు డివిజన్‌ స్థానాలకు, విజయనగరం, కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ల పరిధిలోని 10 డివిజన్‌ల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ విశాఖలో 31, 61 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, కృష్ణా జల్లా నూజివీడు , గుంటూరు జిల్లా రేపల్లి, మాచర్ల, ప్రకాశం జిల్లా అద్దంకి, కడప జిల్లాలో బద్వేలు, చిత్తూరు జిల్లా నగరి, కర్నూలు జిల్లా నందికొట్కూరు, ఎమ్మిగనూరు, అనంతపురం జిల్లా రాయదుర్గంలో పలు వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

కడప జిల్లాలో...

కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ, రాజంపేట మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. రెండు మున్సిపాలిటీల్లో 50 వార్డుల్లో 50 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. ఉదయం ఏడు గంటలకి పోలింగ్ ప్రారంభం కావడంతో అప్పటికే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రధానంగా కమలాపురం నగర పంచాయతీలో ఇరవై వార్డులు ఉన్నాయి. 20 వార్డుల్లో కూడా తెదేపా, వైకాపా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 11 గంటలకు రెండు మున్సిపాలిటీలకు సంబంధించి 37 శాతం పోలింగ్ నమోదు అయిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. కమలాపురం నగర పంచాయతీలో ఉదయం 11 గంటలకు 42 శాతం పోలింగ్, రాజంపేట మున్సిపాలిటీ లో 32శాతం, బద్వేల్ మున్సిపాలిటీ వార్డులో 37 శాతం పోలింగ్ నమోదైంది. రెండు ప్రధాన పార్టీలు కూడా ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ నగర పాలక సంస్థలో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న నాలుగు డివిజన్ల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. 30 డివిజన్లలో ఎన్నికల్లో మొత్తం 23,332 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. 21 పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలు జరుగుతున్నాయి.

నెల్లూరు జిల్లాలో...

నెల్లూరు కార్పొరేషన్, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు, తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్​ల వద్ద బారులు తీరుతున్నారు. నెల్లూరులో 4.15 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనుండగా, వీరికోసం 384 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 54 డివిజన్లలో 8 ఏకగ్రీవంకాగా 46 డివిజన్​లలో 206 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యంత సున్నితమైన 51 పోలింగ్ కేంద్రాలను గుర్తించిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
నెల్లూరు నగర పాలక సంస్థ, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ చక్రధర బాబు పరిశీలించారు. నగరంలోని 35వ డివిజన్​లో తన ఓటు హక్కును కలెక్టర్ వినియోగించుకున్నారు. అనంతరం కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రకటించారు. నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి జరుగుతున్న ఎన్నికల్లో తొలి రెండు గంటల్లో 5.86 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

కర్నూలు జిల్లాలో...

కర్నూలు జిల్లాలోని బేతంచర్ల నగర పంచాయతీలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 20 వార్డులు ఉండగా... 93 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 40 పోలింగ్ కేంద్రాల్లో...
30,012 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు 43.57 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

గుంటూరు జిల్లాలో...

గుంటూరు జిల్లా రేపల్లె 8వ వార్డులో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 1193 ఓట్లు ఉండగా 9 గంటల వరకు 120 ఓట్లు పోల్ అయ్యాయి. వైకాపా నుంచి బి.చంద్రిక తెదేపా అభ్యర్థిగా దాసరి వెంకట నాగేశ్వరమ్మ, జనసేన పార్టీ తరపున తోట నాగలక్ష్మి, పోటీలో ఉన్నారు.

గుంటూరులోని కొత్తపేట ఏరియాలోని జలగం రామారావు పాఠశాల, గొలుసు కొండలరావు పాఠశాల, ఉమెన్స్ మహిళా కళాశాలలో ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాలను కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలింగ్ కేంద్రాల్లోకి వైకాపా నేతలు, కార్పొరేటర్లు వెళ్లి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. గురుజాల, దాచేపల్లిలో పోలింగ్ బూతులను ఎన్నికల పరిశీలనధికారి లక్ష్మీనరసింహ స్వామి పరిశీలించారు. ఉదయం 9 గంటలకు 40 శాతం ఓటింగ్ నమోదైంది.

కృష్ణాజిల్లాలో...

కృష్ణాజిల్లాలోని ఇబ్రహీంపట్నంలో పోలింగ్ కేంద్రాన్ని విజయవాడ కమిషనర్ బి.శ్రీనివాసులు పరిశీలించారు. ఎటువంటి అవంతరాలూ జరగకుండా 600 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని కమిషనర్‌ తెలిపారు.

జగ్గయ్యపేటలో మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ ఊపందుకుంది. తొలి మూడు గంటల్లోనే 28 శాతం పోలింగ్ జరగ్గా, కొన్ని పొలింగ్ కేంద్రాల్లో 11 గంటలకే 40 శాతం దాటింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. జగ్గయ్యపేటలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బూతుల వద్ద అధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు.

విశాఖ జిల్లాలో...

గ్రేటర్ విశాఖలో 31, 61 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 31 వ వార్డులో మెుత్తం 15,834 మంది ఓటర్లు ఉండగా...61వ వార్డులో 14,087 మంది ఓటర్లు ఉన్నారు.

ఇదీ చదవండి: SZC meeting: భేటీలతో రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం: అమిత్ షా

Last Updated : Nov 15, 2021, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.