ETV Bharat / city

Gannavaram Airport: అందుబాటులోకి కొత్త రన్‌వే.. 15 నుంచి ప్రారంభం!

author img

By

Published : Jul 7, 2021, 10:53 PM IST

Gannavaram Airpor
Gannavaram Airpor

విజయవాడ గన్నవరం విమాశ్రయం నుంచి మరికొన్ని రోజుల్లో బోయింగ్ 747 లాంటి అంతర్జాతీయ విమానాలు గగన తలానికి ఎగరబోతున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ విమానాల సర్వీసులు నడిపేందుకు.. రన్‌వేను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. గన్నవరం నుంచి మస్కట్‌కు విమాన సర్వీసును నడిపేందుకు ఎయిరిండియా సంస్థ సన్నాహాలు చేస్తోంది. విజయవాడ సహా పరిసర ప్రాంతాల నుంచి విదేశాలకు లక్షల్లోనే ప్రయాణాలు సాగిస్తుంటారు. గతంలో ఆగిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ నెల 15న పున:ప్రారంభం కానున్నట్లు జిల్లా కలెక్టర్ నివాస్‌ తెలిపారు.

గన్నవరం విమానాశ్రయంలో అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు విస్తరించిన రన్ వే ను ఈనెల 15వ తేదీన ప్రారంభిస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ వెల్లడించారు. ఈ విషయంపై విమానాశ్రయ అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. 837 ఎకరాల్లో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ పనులు చేపట్టామని తెలిపారు. బోయింగ్ 737 లాంటి విమానాలు కూడా వచ్చేందుకు గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

మరోవైపు.. రన్ వే విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన.. భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు గుర్తించిన కాలనీల్లో లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించాలని సూచించారు. కాలనీల్లో రోడ్లు విద్యుత్ త్రాగు నీరు డ్రైనేజీ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

4 జిల్లాలకు అందుబాటులో...

కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం నాలుగు జిల్లాలకు గన్నవరం విమానాశ్రయం అందుబాటులో ఉంటుంది. ఈ నాలుగు జిల్లాల నుంచి ఏటా లక్షల మంది విదేశాలకు వెళుతుంటారు. దీంతో అంతర్జాతీయ సర్వీసులు నడపాలని గత ప్రభుత్వం ఇక్కడి నుంచి సింగపూర్‌కు సర్వీసులను నడిపింది. అయితే పలు కారణాల వల్ల ఆ సర్వీసులు కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. అప్పుడు ఈ సర్వీసులకు ప్రతిరోజు 80 నుంచి 90 శాతం ఆక్యుపెన్సీ ఉండేది. తాజాగా వందే భారత్‌ మిషన్‌లో భాగంగా వస్తున్న విదేశీ సర్వీసులకు భారీగా డిమాండ్ ఉండనున్నట్లు విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు.

కలెక్టర్​ను కలిసిన భూనిర్వాసితులు

విమానాశ్రయం అధికారులతో రన్ వే విస్తరణ పనులు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై అధికారులతో చర్చించిన క్రమంలో.. భూ నిర్వాసితులు అక్కడున్న కలెక్టర్ ను కలిశారు. రెండేళ్లుగా పరిహారం కోసం వేచి చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అధికారులకు సహకరించి విస్తరణకు భూమలు ఇచ్చామని, అయితే పరిహారం అందించే విషయంలో తమకు అన్యాయం జరుగుతోందన్నారు. తమ సమస్య ఉన్నప్పటి నుంచి పలువురు కలెక్టర్లు మారారని, ఇక్కడి వచ్చినప్పుడు హామీ ఇస్తున్నారే తప్ప సమస్య పరిష్కారం చూపటం లేదన్నారు. వెంటనే తమకు రావాల్సిన ప్లాట్లు, తాగునీటి సదుపాయం సహా ఇతర మౌలిక వసతులు కల్పించాలని నివాస్ ను డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

Union Cabinet: మోదీ ప్రభుత్వంలో​ మంత్రులు వీరే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.