ETV Bharat / city

స్వర్ణ ప్యాలెస్‌ ఘటనలో వెలుగులోకి ఆసక్తికర విషయాలు

author img

By

Published : Aug 11, 2020, 5:32 AM IST

స్వర్ణప్యాలెస్‌ ఘటనపై అగ్నిమాపక శాఖ అధికారుల తనిఖీల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు పాటించకపోవడమే మృతుల సంఖ్య పెరగడానికి కారణమని గుర్తించారు. అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉన్నా యాజమాన్యం పట్టించుకోలేదని గుర్తించారు.

swarna palace incident
swarna palace incident

విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌ హోటల్‌లో అగ్నికీలలు, దట్టమైన పొగ పూర్తిగా వ్యాపించడానికి 30 నుంచి 45 నిమిషాల ముందే ప్రమాదం మొదలై ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. అయితే ఆ సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండడం, పొగను గుర్తించి అప్రమత్తం చేసే వ్యవస్థ సక్రమంగా లేకపోవడం పెను ప్రమాదానికి దారితీసిందని తేల్చారు. ఈ రెండింటిలో ఏది ఉన్నా మంటను ప్రారంభంలోనే గుర్తించి, దాన్ని కట్టడి చేసి ఆర్పివేసేందుకు ఆస్కారం ఉండేదని నిర్ధారణకు వచ్చారు. రెండు రోజులుగా ఘటనా స్థలంలో వివిధ కోణాల్లో అధ్యయనం చేస్తున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఈ మేరకు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

అగ్నిమాపక శాఖ అధికారుల కథనం ప్రకారం... స్వర్ణప్యాలెస్‌ హోటల్‌లో ఎక్కువ భాగం కలపతో చేసిన అలంకరణ ఉంది. మంటలు వ్యాప్తికి ఇదే ప్రధాన కారణమైంది. ఫాల్‌ సీలింగ్‌ వరకూ మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగ అధికంగా వెలువడింది. రిసెప్షన్‌ పక్కనే కంప్యూటర్లు, బ్యాటరీలు ఉన్నాయి. ప్రమాద ప్రారంభ స్థలం అదే అయ్యుండొచ్చు. అక్కడ వైరింగ్‌ అంతా పూర్తిగా కరిగిపోయింది. ప్రమాద తీవ్రత కూడా ఆ ప్రాంతంలోనే అధికంగా ఉంది. ఇది మెట్లు మార్గానికి పక్కనే ఉండటంతో మొదటి అంతస్తులోకి దట్టమైన పొగ వ్యాపించింది. దాన్ని పీల్చడం వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు.

స్వర్ణప్యాలెస్‌ భవనం 19 మీటర్ల ఎత్తులో ఉందని అధికారులు తేల్చారు. నిబంధనల ప్రకారం ఈ హోటల్‌కు అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్​వోసీ) తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉన్నా యాజమాన్యం పట్టించుకోలేదని గుర్తించారు.

కనీసం అగ్నిమాపక భద్రతకు అవరమైన పరికరాల్ని కూడా అందుబాటులో ఉంచుకోలేదు. ఉన్నవి కూడా అలంకారప్రాయమే. పైపులు ఉన్నా వాటికి నీటి కనెక్షన్‌ ఇవ్వలేదు. ప్రమాదం జరిగితే వెంటనే స్పందించే వ్యవస్థలేవీ అక్కడ లేవు. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు- అగ్నిమాపక శాఖకు చెందిన ఓ అధికారి

ఇదీ చదవండి

నిర్లక్ష్యమే నిప్పైంది...10 మంది ఉసురు తీసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.