ETV Bharat / city

ఆర్‌ఎస్‌ఎస్‌పై సినిమా తీస్తా

author img

By

Published : Aug 17, 2022, 12:19 PM IST

ఆర్‌ఎస్‌ఎస్‌ పై కొందరిలో ఉన్న భావనను తొలగించేందుకు త్వరలోనే ఓ సినిమా తీయనున్నట్టు తెలిపారు రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్. సినిమాతోపాటు ఓ వెబ్ సిరీస్ సైతం తెరకెక్కించనున్నట్టు వెల్లడించారు.

Hinduism is the search for truth
Hinduism is the search for truth

సత్యాన్ని నిరంతరం అన్వేషించడమే హిందూత్వమని ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రచయిత రాంమాధవ్‌ అన్నారు. ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా హిందూత్వం ఉందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. హిందుత్వంపై పరిపూర్ణ అవగాహన కల్పించేలా తాను ‘ది హిందుత్వ పారడైమ్‌’ పుస్తకాన్ని రచించినట్లు ఆయన తెలిపారు. ఆ పుస్తక పరిచయంతోపాటు త్వరలో విడుదల చేయనున్న మరో రచన ‘పార్టిషన్డ్‌ ఫ్రీడమ్‌’ కవర్‌ పేజీ ఆవిష్కరణ మంగళవారం విజయవాడలో జరిగింది. సాహితీ సుధ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాంమాధవ్‌ మాట్లాడుతూ.. ‘పార్టిషన్డ్‌ ఫ్రీడమ్‌’ పుస్తకంలో తాను దేశవిభజన గురించి రాసినట్లు తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం దేశంలో సమూల మార్పులను గాంధీజీ ఆకాంక్షించారని, గ్రామసీమల్లో పేదరికం సమూలంగా అంతం కావాలని అభిలషించారని, సంపూర్ణ విద్యాభివృద్ధిని చూడాలని కలలు కన్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితులు రావాలంటే.. తొలుత కాంగ్రెస్‌ను రద్దుచేయాలని గాంధీజీ ఆనాడే చెప్పారని, అప్పుడా పనిచేయని కాంగ్రెస్‌.. ఇప్పుడు దేశంలో తమపార్టీని పూర్తిగా రద్దుచేసే దిశగా అడుగులు వేస్తోందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుబట్టారు. ప్రజాస్వామ్య దేశంగా ఉండటమంటే సామాన్య వ్యక్తి అభిప్రాయానికీ విలువ ఇవ్వాలన్న రాంమాధవ్.. అధికారం ఉంది కదా అని విశాఖపట్నంలో ఒక రాజధాని, కర్నూలులో మరో రాజధాని ఇలా ఇష్టారీతిన పెట్టుకోవడం సరికాదన్నారు.

ముఖ్య అతిథి, రాజ్యసభ సభ్యుడు, సినీ రచయిత వి.విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ... ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి దేశప్రజల్లో ఉన్న తప్పుడు భావనను తొలగించి, పరిపూర్ణంగా ప్రజలకు తెలియజేసేందుకు తాను త్వరలోనే ఓ సినిమా, వెబ్‌ సిరీస్‌ తీస్తున్నట్లు తెలిపారు. పార్టిషన్డ్‌ ఫ్రీడమ్‌ పుస్తకం కవర్‌ పేజీని విజయేంద్రప్రసాద్‌ ఆవిష్కరించారు. ప్రముఖ నవలా రచయిత దుగ్గరాజు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ది హిందుత్వ పారడైమ్‌ పుస్తక విశేషాలను నెడ్‌ఫీ (గువాహటి) ఛైర్మన్‌ పీవీఎస్‌ఎల్‌ఎన్‌ మూర్తి వివరించారు. కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు హాజరయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.