ETV Bharat / city

పరిషత్‌ ఎన్నికలు రద్దు... తాజాగా మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఎస్‌ఈసీకి ఆదేశం

author img

By

Published : May 21, 2021, 10:42 AM IST

Updated : May 22, 2021, 3:51 AM IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు

10:40 May 21

పరిషత్‌ ఎన్నికలు రద్దు... తాజాగా మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఎస్‌ఈసీకి ఆదేశం

     రాష్ట్రంలో ఏప్రిల్‌ 8న జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఏప్రిల్‌ 1న ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు ఆ నోటిఫికేషన్‌ విరుద్ధంగా ఉందని తేల్చిచెప్పింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఏప్రిల్‌ 1న ఇచ్చిన ఎన్నికల ప్రకటన చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ఎన్నికలు నిర్వహించేందుకు తాజాగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఎస్‌ఈసీని ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి ఈ తీర్పు ఇచ్చారు. 

  సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు తిరిగి ఎన్నికల కోడ్‌ (ప్రవర్తన నియమావళి) విధించాలని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అగౌరవపరుస్తూ ఎన్నికల కమిషనర్‌ హడావుడిగా నిర్ణయం తీసుకుందని ఆక్షేపించింది. జనసేన పార్టీకి చెందిన అభ్యర్థులకు ఎన్నికల ప్రక్రియలో సమాన అవకాశాలు లేకుండా నోటిఫికేషన్‌ చేసిందని తేల్చిచెప్పింది. ఎన్నికల నిర్వహణకు తీసుకున్న ఆకస్మిక నిర్ణయం జనసేన అభ్యర్థులకు నష్టం కలిగించిందని పేర్కొంది. ఎన్నికల నిర్వహణకు రూ.160 కోట్లు ఖర్చు అయిందని ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న ఎన్నికల కమిషనర్‌ చేసిన అభ్యర్థనను అనుమతిస్తే.. చట్టవిరుద్ధమైన చర్యను సక్రమం చేయడమే అవుతుందని తెలిపింది. ఆ అభ్యర్థనను అనుమతించలేమంది. తెదేపా నేత వర్ల రామయ్య, జనసేన పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో సంయుక్తంగా హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. వర్ల రామయ్య పిటిషన్ను కొట్టేస్తూ.. జనసేన తరఫున శ్రీనివాసరావు దాఖలు చేసిన వ్యాజ్యంలో అభ్యర్థనను పాక్షికంగా అనుమతించింది. గత ఏడాది నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికారపార్టీ నేతల బెదిరింపులు, నామినేషన్ల ఉపసంహరణలు, హింసా ఘటనల కారణంగా మొదటి నుంచీ ఎన్నికలు నిర్వహించాలని జనసేన, భాజపా చేసిన అభ్యర్థనలను తోసిపుచ్చింది. మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలంటూ భాజపా నేత పాతూరి నాగభూషణం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి శుక్రవారం ఈమేరకు కీలక తీర్పు ఇచ్చారు.

    తెదేపా నాయకుడు వర్ల రామయ్య రిట్‌ రూపంలో వ్యాజ్యం దాఖలు చేసే అర్హత ఉందని స్పష్టంచేశారు. ఎస్‌ఈసీ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిందని పేర్కొన్నారు తప్ప.. ఆయనకు చెందిన రాజ్యాంగ, చట్టబద్ధ హక్కులు ఏవిధంగా అతిక్రమణకు గురయ్యాయో పేర్కొనలేదన్నారు. ఈ నేపథ్యంలో వర్ల రామయ్య వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. సుప్రీం ఉత్తర్వులను సక్రమంగా అర్థం చేసుకోకుండా నోటిఫికేషన్‌ జారీ చేసినందుకు ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని తీరును న్యాయమూర్తి తీవ్రంగా తప్పుపట్టారు.

నేపథ్యమిదీ..    

  పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎస్‌ఈసీ ఈ ఏడాది ఏప్రిల్‌ 1న నోటిఫికేషన్‌ ఇచ్చిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సింగిల్‌ జడ్జి వద్ద వ్యాజ్యం దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ యూ.దుర్గాప్రసాదరావు ఏప్రిల్‌ 8న జరగనున్న ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ 6వ తేదీన మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎస్‌ఈసీ దాఖలు చేసిన అప్పీల్‌పై ఏప్రిల్‌ 7వ తేదీన ధర్మాసనం విచారణ జరిపింది. షెడ్యూల్‌ ప్రకారం 8న ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చి.. ఓట్ల లెక్కింపు పక్రియ నిలుపుదల చేసింది. వ్యాజ్యంపై లోతైన విచారణ జరిపే వ్యవహారాన్ని సింగిల్‌ జడ్జికి అప్పగించింది. మరోవైపు గతేడాదిలో నామినేషన్ల దాఖలు అడ్డగింత, బలవంతపు ఉపసంహరణల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాలని కోరుతూ జనసేన పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు, భాజపా నేత పాతూరి నాగభూషణం వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. ఈ నేపథ్యంలో  కొత్త ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నిరోజు హడావుడిగా నోటిఫికేషన్‌ జారీచేశారని కోర్టుకు విన్నవించింది. ఈ మూడు వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి ఈనెల 4న తుది విచారణ జరిపి తీర్పును రిజర్వు చేశారు. శుక్రవారం నిర్ణయాన్ని వెల్లడించారు.  

తీర్పులో ఏముందంటే..

- ప్రజాహిత వ్యాజ్యం రూపంలో ధర్మాసనం ముందు పిల్‌ దాఖలు చేసుకోవాలి తప్ప.. రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసే అర్హత తెదేపా నేత వర్ల రామయ్యకు లేదని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది చేసిన వాదనలను తోసిపుచ్చుతున్నాం. ఓటరుగా ఎన్నికల నోటిఫికేషన్ను సవాలు చేసే అర్హత రామయ్యకు ఉంది.

- పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ను తిరిగి విధించాలని(రి-ఇంపోజ్‌) సుప్రీంకోర్టు గతేడాది మార్చి 18న ఇచ్చిన ఉత్తర్వులను ఎస్‌ఈసీ ఉల్లంఘించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళికి ఉన్న చారిత్రాత్మాక ప్రాధాన్యతాంశాన్ని పరిగణనలోకి తీసుకొని నాలుగు వారాల ముందుగా కోడ్‌ విధించాలని సుప్రీం ఆదేశాలిచ్చింది.  

- జనసేన పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఈ.వేణుగోపాల్‌ వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వులను పరిశీలించకుండా ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని ఏప్రిల్‌ 1న నోటిఫికేషన్‌ ఇచ్చారని తెలిపారు. హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వడం వల్ల ఎన్నికలకు సిద్ధపడటానికి రాజకీయ పార్టీలకు తగిన సమయం లేకుండా పోయిందన్నారు. ముఖ్యంగా జనసేన నుంచి ఎన్నికల్లో పోటీచేసే వారికి తగిన అవకాశం ఇవ్వలేదన్నారు.

- ఎన్నికల కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్‌ను ఎన్నికల కమిషనర్‌ పరిశీలించలేదు. అందుకు కారణాలు ఆమెకే తెలుసు. పదవీ విరమణ పొందిన వెంçËనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అదే ప్రభుత్వంలో ఆరునెలలు సర్వీసు పొడిగింపు పొందారు. తర్వాత ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి.. ఆదే రోజు ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభిస్తూ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఆమె ఎలా అర్థం చేసుకున్నారో ఎన్నికల కమిషన్‌ కౌంటర్‌లో ఎలాంటి వివరణా ఇవ్వలేదు. తీర్పు మొత్తాన్ని చదివి ఓ నిర్ణయానికి రావాలి తప్ప అందులో కొంత బాగాన్ని చదివి నచ్చిన విధంగా అర్థ వివరణ చేయడానికి వీల్లేదు.

- కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం గతేడాది మార్చి 15న ఇచ్చిన నోటిఫికేషన్‌కు ముందు నామినేషన్‌ వేయకుండా అడ్డగింపులు, బలవంతపు ఉపసంహరణలు, తీవ్ర హింసా ఘటనలు చోటు చేసుకున్నాయని జనసేన పిటిషనర్‌ ఆరోపించారు. అప్పటి కమిషనర్‌ కేంద్రానికి రాసిన లేఖను కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో నిలిచిపోయిన దగ్గర్నుంచి ఎన్నికలు నిర్వహించడం తగదన్నారు. మొదటి నుంచి నిర్వహించాలని కోరారు.

- మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలన్న జనసేన అభ్యర్థనను హైకోర్టు సింగిల్‌ జడ్జి మరో వ్యాజ్యంలో ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను మొదటి నుంచి ప్రారంభించాలని ఆదేశించŸలేము.  

- వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలతో పోలింగ్‌ ప్రక్రియ పూర్తి అయిందని, బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచామని, ఎన్నికలకు రూ.160 కోట్లు అయిందని ఎన్నికల కమిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు.

- ఎన్నికలను నిలుపుదల చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఎన్నికల కమిషన్‌ హడావుడిగా ధర్మాసనం వద్ద అప్పీల్‌ చేసి ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కొంత కాలం వేచి ఉన్నట్లయితే.. ఎన్నికల నిర్వహణ, బ్యాలెట్‌ బాక్సుల భద్రత విషయంలో కొంత ఖర్చును  తగ్గించుకోగలిగేది.

- ఎన్నికల కమిషనర్‌ తొందరపాటు చర్యతో రాష్ట్ర ప్రభుత్వం భారీ సొమ్మును ఖర్చుచేయాల్సి వచ్చింది. ఎన్నికల కోసం భారీగా సొమ్ము ఖర్చు అయిందన్న కారణంతో పిటిషనర్ల హక్కులను కాలరాయలేం. ఈ నేపథ్యంలో వ్యాజ్యాన్ని కొట్టేయాలన్న ఎన్నికల కమిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం.

- ఎన్నికల కమిషనర్‌ నోటిఫికేషన్‌తో.. జనసేన పార్టీ అభ్యర్థులకు ఎన్నికల ప్రక్రియలో సమాన అవకాశాలు దక్కలేదు. చట్టవిరుద్ధ నోటిఫికేషన్‌  ఆధారంగా ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో ఆ వ్యాజ్యాన్ని కొట్టేయలేం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషనర్‌ వ్యవహరించకపోవడంతో జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థుల హక్కులు ఉల్లంఘన జరిగినట్లు నిరూపణ అయ్యింది. ఎన్నికల నోటిఫికేషన్‌ ద్వారా జనసేన పార్టీ అభ్యర్థులకు ఎన్నికల ప్రక్రియలో సమాన అవకాశాలు హరించాయి. నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేదిగా ఆ నోటిఫికేషన్‌ ఉంది.

- జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి అధికరణ 243-ఓ సంపూర్ణ అడ్డంకి కాదు.

- ఈ వివరాలను పరిగణనలోకి తీసుకొని  మఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నాం. ఏప్రిల్‌ 1న ఎన్నికల కమిషనర్‌ జారీచేసిన నోటిఫికేషన్‌ చట్ట విరుద్ధమైనదిగా ప్రకటిస్తున్నాం’ అని తీర్పులో పేర్కొన్నారు.

ఇదీచదవండి

రెవెన్యూ బకాయిలు రూ.10,997.30 కోట్లు.. లెక్క తేల్చిన కాగ్

Last Updated :May 22, 2021, 3:51 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.