ETV Bharat / city

HC: నామినేషన్ల తిరస్కరణపై హైకోర్టు ఆగ్రహం

author img

By

Published : Nov 11, 2021, 4:39 AM IST

సరైన కారణం లేకుండా రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు తిరస్కరించటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్న చిన్న కారణాలతో తిరస్కరించటం ఏమిటని ప్రశ్నించింది. ప్రతివాదులుగా ఆర్వోలను చేరిస్తే నోటీసులు ఇచ్చి వివరణ కోరతామని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ మొదలైనందున జోక్యం చేసుకోకూడదంటూ.... పిటిషనర్ల అనుబంధ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది .

నామినేషన్ల తిరస్కరణపై హైకోర్టు ఆగ్రహం
నామినేషన్ల తిరస్కరణపై హైకోర్టు ఆగ్రహం

తగిన కారణాలు లేకుండా మున్సిపల్‌ ఎన్నికల్లో పలువురి నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు (ఆర్‌వో) తిరస్కరించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నామినేషన్‌ పత్రాల్లో కొన్నిచోట్ల ఖాళీలు ఉన్నాయని, పత్రాలను సక్రమంగా పూర్తిచేయలేదని.. తదితర చిన్న కారణాలతో తిరస్కరించడం ఏమిటని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగులనే విషయాన్ని ఆర్‌వోలు మర్చిపోయారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆర్‌వోల తీరును ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదికి సూచించింది. ఆర్‌వోలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేరిస్తే నోటీసులు ఇచ్చి వివరణ కోరతామని పేర్కొంది. తమ నామినేషన్లను పరిగణనలోకి తీసుకొని ఎన్నికల్లో పాల్గొనేందుకు వీలుకల్పించేలా ఆదేశించాలని పిటిషనర్లు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక.. న్యాయసమీక్షకు వీల్లేదని, ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చినట్లు గుర్తుచేసింది. ప్రధాన వ్యాజ్యాల్లో కౌంటర్లు వేయాలని ఆదేశిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.

నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏడో డివిజన్‌కు తెదేపా తరఫున బరిలో దిగిన జి.మహేంద్రబాబు నామినేషన్‌ను ఆర్‌వో తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 17వ వార్డుకు బరిలో ఉన్న షేక్‌ జాఫర్‌ అలీ తన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేశారు. ఇలా పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కేఎం కృష్ణారెడ్డి, ఎన్‌.అశ్వనీకుమార్‌, కంభంపాటి రమేశ్‌బాబు తదితరులు వాదనలు వినిపించారు. ఆర్‌వోలు అవకతవకలకు పాల్పడుతూ నామినేషన్లు తిరస్కరించారన్నారు. వారు దురుద్దేశంతో వ్యవహరించారన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. దురుద్దేశంతో వ్యవహరించిన ఆర్‌వోలను ప్రతివాదులుగా చేరిస్తే నోటీసులు ఇచ్చి వివరణ కోరతామన్నారు. ఎస్‌ఈసీ తరఫున వివేక్‌చంద్రశేఖర్‌, ప్రభుత్వ న్యాయవాది శివాజీ.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యాక న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్‌ వేసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకొని హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ వివరాలను కోర్టుకు సమర్పించారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పిటిషనర్లు దాఖలుచేసిన అనుబంధ పిటిషన్లను కొట్టేశారు.

ఇదీ చదవండి:

high court: కుప్పం ఘటన కేసులో తెదేపా నేతలకు హైకోర్టులో ఊరట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.