ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

author img

By

Published : Aug 22, 2022, 3:15 PM IST

Updated : Aug 23, 2022, 6:43 AM IST

రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు ()

గనుల అక్రమ తవ్వకాల్ని అడ్డుకోవాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారించిన హైకోర్టు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గనులశాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ ఆదేశాలతో పలువురు గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని, దేవాలయాన్ని కూల్చివేశారని పేర్కొంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యే వంశీ, వ్యాపారులు అన్నె లక్ష్మణరావు, ఓలుపల్లి మోహన రంగారావు, కె.శేషుకుమార్‌తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, గనులశాఖ అధికారులకు, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, కృష్ణా జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, శ్రీ బ్రహ్మయ్య లింగేశ్వరస్వామి దేవాలయ కార్యనిర్వహణ అధికారికి నోటీసులు జారీచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులులతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలోని శ్రీ బ్రహ్మయ్య లింగేశ్వరస్వామి దేవాలయం (బ్రహ్మ లింగయ్య చెరువు) పరిసరాల్లో గనుల (గ్రావెల్‌) అక్రమ తవ్వకాలు, చిన్నతరహా ఖనిజాల వెలికితీతను అడ్డుకోవాలని, గతంలో ఆ దేవాలయం ఉన్నచోటే విగ్రహాలను పునఃప్రతిష్ఠించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ మాజీ సైనికుడు ముప్పనేని రవికుమార్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎంఆర్‌కె చక్రవర్తి వాదనలు వినిపించారు. కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది. మధ్యంతర ఉత్తర్వులివ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యర్థించగా ప్రస్తుత దశలో ఇవ్వలేమని తెలిపింది.

ఇవీ చూడండి

Last Updated :Aug 23, 2022, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.