ETV Bharat / city

గోదావరి మహోగ్రరూపం... 75 అడుగులు దాటితే 50 ఏళ్ల రికార్డు బ్రేక్

author img

By

Published : Jul 15, 2022, 4:51 PM IST

Updated : Jul 15, 2022, 9:49 PM IST

Godavari River: గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భారీ వర్షాలతో ప్రవాహ ఉద్ధృతి మరింత పెరిగి భద్రాచలం జలదిగ్బంధమైంది. తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎస్​కు సూచించారు. ఇదిలా ఉండగా సహాయక చర్యలు అందించేందుకు ఇండియన్‌ ఆర్మీ రంగంలోకి దిగింది. 78 మందితో కూడిన ఇన్‌ఫాంట్రీ దళం, 10 మంది వైద్యులు, 23 మంది ఇంజినీర్లు సహా మొత్తం 101 మందితో కూడిన బృందం భద్రాచలం బయలుదేరింది.

bhadrachalam
bhadrachalam

Godavari River: గోదావరి నది మహోగ్రరూపానికి భద్రాచలం జలదిగ్బంధమైంది. ఊహించని రీతిలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రవాహం.. తీరప్రాంతాలను అల్లకల్లోలం చేస్తుంది. మునుపెన్నడూ లేనివిధంగా ప్రమాదకర స్థాయిని దాటడంతో.. భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల తీవ్ర హెచ్చరికల జారీతో ముంపు బాధితులంతా పునరావాసాలకు చేరుతుండగా.. ఇళ్ల వద్ద ఉన్న వారు బిక్కుబిక్కుమంటూ గాలం గడుపుతున్నారు.

భద్రాచలంలో గంటగంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. ప్రస్తుతం 70.9 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ఎగువ నుంచి గోదావరిలోకి 23.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహిస్తుండటంతో ఇప్పటికే లోతట్టు కాలనీవాసులను పునరావాస కాలనీలకు తరలించారు. భద్రాచలంలోని కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ, శాంతినగర్‌ పిస్తా కాంప్లెంక్స్‌ ఏరియా, సుభాష్‌ నగర్‌ ప్రాంతాల్లో దాదాపు వెయ్యి మందిని 9 పునరావాస కేంద్రాలకు చేర్చారు.

1986లో అత్యధికంగా 75.6 అడుగుల నీటిమట్టం నమోదు కాగా.. 1990లో 70.80.. 2006లో 66.90 అడుగులు నమోదైంది. ముందు జాగ్రత్తగా గోదావరి వారధిపై రాకపోకలు నిలిపివేశారు. దీంతో తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్, ‌ఒడిశా, ఆంధ్ర ప్రాంతాలకు భద్రాచలం నుంచి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం, బూర్గంపాడు మండలాల మధ్య వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో 144 సెక్షన్ విధించారు.

రంగంలోకి ఇండియన్​ ఆర్మీ..: ఈ నేపథ్యంలోనే సహాయక చర్యలు అందించేందుకు ఇండియన్‌ ఆర్మీ రంగంలోకి దిగింది. 78 మందితో కూడిన ఇన్‌ఫాంట్రీ దళం, 10 మంది వైద్యులు, 23 మంది ఇంజినీర్లు సహా మొత్తం 101 మందితో కూడిన బృందం భద్రాచలం బయలుదేరింది.

భద్రాద్రి వరదలపై సీఎం సమీక్ష: భద్రాచలం వరద సహాయచర్యల వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. భద్రాచలానికి అదనపు రక్షణ సామగ్రి తరలించాలని సీఎస్‌కు తెలిపారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ అందుబాటులో ఉంచాలని సూచించారు. భద్రాచలంలోని తాజా పరిస్థితులపై కేసీఆర్​ మంత్రి పువ్వాడ ద్వారా ఆరా తీశారు.

వరద సహాయక చర్యలపై మంత్రి పువ్వాడ, కలెక్టర్‌ పర్యవేక్షణ: భద్రాచలం వరద గుప్పిట్లో చిక్కుకుందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు . లోతట్టు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. చాలా కాలనీలు జలమయమయ్యాయి. బాధితుల్ని పునరావాస ప్రాంతాలకు తరలించాం. 80 అడుగుల నీటిమట్టం దాటినా భారీ నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టామని తెలిపారు.

గోదావరి ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం శతవిధాలా ప్రయత్నిస్తోంది. కొన్ని కుటుంబాల వారు ఇంటిని వీడేందుకు మొండికేస్తుండడంతో కలెక్టర్‌ అనుదీప్‌ స్వయంగా రంగంలోకి దిగి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ చేపట్టారు. వరద ఉద్ధృతిని తక్కువ అంచనావేసి దయచేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని మైక్‌లో ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు.

ముందుజాగ్రత్తగా విద్యుత్‌ సరఫరా నిలిపివేత: వరద ప్రభావంతో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరు, పినపాక మండలాల్లో వందకు పైగా గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వరదనీటిలో ట్రాన్స్‌ఫార్మర్‌లు మునిగిపోవడంతో ముందుజాగ్రత్తగా సరఫరా ఆపేశారు. భద్రాచలం, బూర్గంపాడు మండలాల మధ్యనున్న వారధిపై రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి భద్రాచలంలో చిక్కుకున్న గిరిజనుల కోసం ఐటీడీఏ అధికారులు ప్రత్యేక పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు.

భద్రాద్రి జిల్లావ్యాప్తంగా మిషన్‌ భగీరథ నీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. మిషన్ భగీరథ ఇంటెక్‌వెల్, సబ్‌స్టేషన్ వద్దకు వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీటిసరఫరాను ఆపేశారు.

రామయ్య ఆలయ పరిసరాల్లోకి వరదనీరు: భద్రాచలం నుంచి వెళ్లే అన్ని మార్గాలనూ గోదావరి చుట్టుముట్టింది. భద్రాద్రి రామయ్య సన్నిధిలోని అన్నదాన సత్రానికి వరద పోటెత్తడంతో అన్నదానం నిలిపివేశారు. భద్రాచలం పట్టణానికి రక్షణగా ఉన్న కరకట్ట లాకర్లకు లీకులు ఏర్పడటంతోపాటు, వర్షపు నీరు భారీగా చేరడంతో ఆలయ పరిసరాల్లో నీరు చెరువును తలపిస్తోంది.

1976లో తొలిసారి భద్రాచలం వద్ద 63.9 అడుగుల నీటిమట్టం జూన్ 22న నమోదైంది. ఆ తర్వాత 36 ఏళ్లలో 70 అడుగులు దాటడం ఇదే ప్రథమం. భద్రాచలం వద్ద గంటగంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం శుక్రవారం 70.10 అడుగుల వద్ద కొనసాగుతుంది. 75 అడుగులు దాటితే.. 50 ఏళ్ల రికార్డు బ్రేక్ అవుతుంది. ఇప్పటివరకు ఆరుసార్లు 60 అడుగులు, రెండుసార్లు 70 అడుగులు క్రాస్ అయింది. ఎగువ నుంచి గోదావరిలోకి 23.82 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

భద్రాద్రిలో 70 అడుగులకు గోదావరి నీటిమట్టం.
  • భద్రాచలం వద్ద ప్రస్తుత నీటిమట్టం 70.10 అడుగులు
  • భద్రాచలంలో 36 ఏళ్ల తర్వాత మళ్లీ 70 అడుగులు దాటుతున్న గోదావరి నీటిమట్టం..
  • 75 అడుగులు దాటితే 50 ఏళ్ల రికార్డు బ్రేక్
  • ఆరుసార్లు 60 అడుగులు క్రాస్ అయిన గోదావరి నీటి మట్టం
  • రెండు సార్లు 70అడుగులు క్రాస్

భద్రాచలం

వద్ద గోదావరి

నీటిమట్టం

సంవత్సరంఅడుగులు
197663.9
198363.5
198675.6
199070.8
200666.9
201361.6
202061.5

ఇవీ చూడండి:

Last Updated : Jul 15, 2022, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.