ETV Bharat / city

EMPLOYEES PROTEST: 'ఎవరిని మోసం చేసేందుకు హామీ ఇచ్చారు'

author img

By

Published : Dec 11, 2021, 7:35 AM IST

Updated : Dec 11, 2021, 7:46 AM IST

EMPLOYEES PROTEST IN VIJAYAWADA: సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు విజయవాడలో ‘సింహగర్జన’ పేరిట సభ నిర్వహించారు. అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన సీఎంకు.. ఆ వారం ఎప్పుడొస్తుందని ప్రశ్నించారు.  ఎవరిని మోసం చేసేందుకు సీఎం జగన్ హామీ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 71 డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

విజయవాడలో ‘సింహగర్జన’ పేరిట సభ
విజయవాడలో ‘సింహగర్జన’ పేరిట సభ

simha garjana meeting: సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పింఛన్‌ విధానాన్ని తీసుకురావాలని వివిధ సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన సీఎంకు... ఆ వారం ఎప్పుడొస్తుందని ప్రశ్నించారు. విజయవాడలో శుక్రవారం ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ (ఏపీసీపీఎస్‌ఈఏ) ఆధ్వర్యంలో ‘సింహగర్జన’ పేరిట ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు.

అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో జగన్‌ హామీ ఇచ్చారు. మూడేళ్లు గడిచినా చేయలేదు. సీఎంకు వారం ఎప్పుడవుతుందా అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ ప్రకటన చేసినా... సీపీఎస్‌ రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తాం. మాకు ప్రత్యామ్నాయ విధానాలు వద్దు. సమస్యల పరిష్కారంపై సీఎం చిత్తశుద్ధితో ఎందుకు ముందుకు రావడం లేదో అర్థం కావడం లేదు. సీపీఎస్‌పై కొందరు ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్నారు. ఇలా చెబుతున్న ఎమ్మెల్యేలకు పింఛన్లు ఎందుకు? మీ పింఛన్లను రద్దు చేసుకుంటారా? ఆలస్యం చేయకుండా పీఆర్సీ ఇస్తామన్నారు. ఒప్పంద ఉద్యోగాలు రెగ్యులర్‌ చేస్తామన్నారు. ఈ హామీలపై ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి వచ్చింది’’ -బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఐకాస అమరావతి ఛైర్మన్‌

సీపీఎస్‌ రద్దుకు ప్రభుత్వంపై ఒత్తిడి: వెంకట్రామిరెడ్డి
సీపీఎస్‌ రద్దుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ‘‘సీపీఎస్‌ రద్దుకు సంఘాలు చేసే ఉద్యమానికి మద్దతు ఇస్తాను. మీరంతా కుటుంబాలతో వచ్చి రోడ్డుపై కూర్చుంటే కుటుంబంతో వచ్చి నేనూ రోడ్డుపై కూర్చుంటా. పాదయాత్రలతో ఉపయోగం లేదు’’ అని అన్నారు.

దీర్ఘకాలిక పోరాటాలు చేయాలి: సూర్యనారాయణ
సీపీఎస్‌ రద్దుకు దీర్ఘకాలిక పోరాటాలు చేయాల్సిన అవసరముందని ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్‌ ఛైర్మన్‌ సూర్యనారాయణ సూచించారు. ఉద్యోగులు చిత్తశుద్ధితో ఆందోళన చేసినప్పుడే రద్దు సాధ్యమవుతుందని, సంఘాలన్నీ ఐక్యమై ఉద్యమించాలన్నారు.

సీపీఎస్‌ ఎందుకు రద్దుచేయలేదు: ఏపీ సీపీఎస్‌ఈఏ అప్పలరాజు
ఎవరిని మోసం చేయడానికి సీపీఎస్‌ రద్దు చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారని ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అప్పలరాజు ప్రశ్నించారు. ‘‘సీపీఎస్‌పై మూడు కమిటీలు ఎందుకు వేశారు? రద్దు చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలవుతుందని ఇప్పుడు చెబుతున్నారు. వారంలో రద్దు చేస్తామన్నారు.. ఇప్పటి వరకు ఎన్ని వారాలైంది? ప్రభుత్వం వచ్చాక ఎవరూ ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. రోడ్డుపైకి రావాల్సి వచ్చింది. సీపీఎస్‌ రద్దయ్యే వరకు ఉద్యమం ఆగదు’’ అని స్పష్టంచేశారు.

* విలువలు, విశ్వసనీయత, మాట తప్పను.. మడమ తిప్పనన్న సీఎం జగన్‌ ఉద్యోగులను రోడ్డుపాలు చేశారని సీపీఎస్‌ఈఏ ప్రధాన కార్యదర్శి పార్థసారథి విమర్శించారు. ‘‘తమ మేనిఫెస్టో బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత అన్నారు. అందులోని ముఖ్య అంశమైన సీపీఎస్‌ను వారంలో రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. సీపీఎస్‌ను రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికారం ఉందని ఠక్కర్‌ కమిటీ నివేదికలో చెప్పింది’’ అని గుర్తుచేశారు.

* పాలకపార్టీలను ఎప్పుడు నమ్మకూడదని ఉపాధ్యాయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్‌ అన్నారు.

71 డిమాండ్లను పరిష్కరించాల్సిందే
పీఆర్సీ, డీఏలు ఇచ్చినా పోరాటం విరమించేది లేదని, 71 డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమాలు కొనసాగుతాయని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి చేపట్టిన నిరసనలో భాగంగా... ఎన్జీవో పశ్చిమ కృష్ణా, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని పంచాయతీరాజ్‌ కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిర్వహించిన ఆందోళనలో ఆయన ఈమేరకు ప్రసంగించారు.

ఇవీచదవండి.

Last Updated : Dec 11, 2021, 7:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.