ETV Bharat / city

జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచకూడదని ప్రభుత్వం నిర్ణయం

author img

By

Published : Aug 17, 2021, 5:59 AM IST

ప్రభుత్వ ఉత్తర్వులు ఇకపై ఆన్‌లైన్‌లో కనిపించవు . జీవో నెంబర్లు జనరేట్‌ విధానాన్ని ఇకపై అనుసరించొద్దని.. అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాలనలో పాదర్శకత కోసం 2008 నుంచి జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచుతుండగా.. ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం కావటంతో ఈ సంప్రదాయానికి సర్కార్ మంగళం పాడింది.

జీవోలు
జీవోలు

ప్రభుత్వ ఉత్తర్వులను ఇకపై ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2008 నుంచి జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచే విధానానికి స్వస్తి పలకటంతో.. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు కనబడవు. ప్రభుత్వం జీవోల్ని ఉంచే గవర్నమెంట్‌ ఆర్డర్స్‌ ఇష్యూ రిజిస్టర్‌లో(జీవోఐఆర్‌) జీవో నంబర్లు జనరేట్‌ చేసే విధానాన్ని ఇకపై అనుసరించొద్దని అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇకపై జీవోలకు నంబర్లు కేటాయించి ప్రదర్శించటమనేది ఏపీ సచివాలయం ఆఫీస్‌ మాన్యువల్‌, ప్రభుత్వ బిజినెస్‌ రూల్స్‌కు అనుగుణంగా జరగాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీ నుంచి బ్లాంక్‌ జీవోలు ఇవ్వటం మొదలు పెట్టింది. జీవో నెంబర్‌ ఇచ్చినా.. అందులో ఎలాంటి సమాచారం లేకుండా ఖాళీగా ఉంచుతున్నారు. ముఖ్యంగా సాధారణ పరిపాలనశాఖ ఈ 16 రోజుల్లో 82 జీవోలు జారీ చేస్తే.. వాటిలో 49 బ్లాంక్‌గా ఉంచింది. మరో నాలుగు జీవోలను కాన్ఫిడెన్సియల్‌గా పేర్కొని.. వాటినీ రహస్యంగా ఉంచింది. న్యాయశాఖ రెండు, అటవీశాఖ ఒక ఖాళీ జీవోలను ప్రదర్శించాయి. గవర్నర్‌ కార్యదర్శిగా ఉన్న ముఖేశ్‌ కుమార్‌ మీనా సహా కొందరు ఐఏఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారుల్ని బదిలీ చేస్తూ, కొందరికి కొన్ని శాఖలకు ఇన్‌ఛార్జులుగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం జీవో నెం 1334 జారీ చేసింది. దాన్నీ బ్లాంక్‌గానే పెట్టారు. చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ సేల్స్‌ ట్యాక్స్‌గా పనిచేస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పీయూష్‌ కుమార్‌నీ బదిలీ చేసింది. ఈ నిర్ణయాలు ప్రజలకు తెలిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమిటో వాటిని ఎందుకు రహస్యంగా ఉంచాలనుకుందో అంతు చిక్కటం లేదు. బ్లాంక్‌ జీవోల అంశాన్ని ఇటీవల తెలుగుదేశం నేతలు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే జీవోలకు నెంబర్లు కేటాయించే పద్ధతికి ప్రభుత్వం స్వస్తి పలకం చర్చనీయాంశమైంది.

సమాచారహక్కు చట్టంలోని సెక్షన్‌-4ను ఉల్లంఘించినట్లే..

తాజా నిర్ణయంతో ఇకపై జీవోల గురించి తెలుకోవాలంటే.. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఆర్టీఐ దరఖాస్తులకు సమాచారం చెప్పేందుకు ప్రతి శాఖా కొంతమంది ఉద్యోగులను ప్రత్యేకంగా కేటాయించాల్సి వస్తుందని వెల్లడించారు. ఈ ఆధునిక కాలంలో సమాచారాన్ని ప్రజలకు తెలియకుండా గోప్యంగా ఉంచటం సరికాదని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. తాజా నిర్ణయంతో సమాచారహక్కు చట్టంలోని సెక్షన్‌-4ను ఉల్లంఘించినట్లేనని తెలిపారు.

గతంలో జీవోల నంబర్ల నమోదుకు సచివాలయంలోని ప్రతి విభాగంలో ప్రత్యేక రిజిస్టర్‌ ఉండేది. ప్రభుత్వం జీవో ఇచ్చాక రెండు, మూడు రోజులకే సంబంధీకులకు అది అందేది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, బదిలీల వంటి విషయాలకు సంబంధించిన జీవోల్లోని సమాచారం పత్రికల ద్వారా ప్రజలకు తెలిసేది. ఆన్‌లైన్‌ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక ప్రభుత్వం 2008 నుంచీ ప్రతి జీవోనూ ‘జీఓఐఆర్‌’ వెబ్‌సైట్‌లో ఉంచుతోంది. విషయం ముందే తెలిస్తే కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుంటారని భావించి.... ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు వంటి అంశాల్ని గోప్యంగా ఉంచేది. మావోయిస్టులు, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై ఉత్తర్వుల్లోనూ ఇదే గోప్యత పాటించేవారు. అలాంటివి ఎప్పుడైనా ఒకటో రెండో మాత్రమే ఉండేవి. ఈ పన్నెండేళ్లలో ‘జీఓఐఆర్‌’పై ఎలాంటి ఫిర్యాదులూ లేవు. ప్రభుత్వ నిర్ణయాలు, వివిధ ప్రాజెక్టులు, పథకాలకు చేసే కేటాయింపులు, మార్గదర్శకాలు, విధివిధానాలన్నీ జీవో జారీ చేసిన వెంటనే ప్రజలకు తెలిసేవి. అయితే ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమవడం, వాటిపై కోర్టుల్లో సర్కారుకు చుక్కెదురవుతున్న ఉదంతాలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సమాచారమే తెలియకుండా చేస్తే ఈ సమస్య ఉండదని ప్రభుత్వం భావిస్తోందని వివిధ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.