ETV Bharat / city

గోదావరి జలాలు సముద్రంపాలు.. 2 నెలల్లో 2,193 టీఎంసీలు వృథా

author img

By

Published : Jul 30, 2022, 5:39 AM IST

రెండునెలల కాలంలో 2 వేల టీఎంసీలకు పైగా వరద జలాలు వృథాగా పోయాయి. పెద్ద ఎత్తున గోదావరి జలాలు సముద్రంపాలయ్యాయి. సాధారణంగా ఏడాది నీటి వృథా సగటు 3 వేల500 టీఎంసీలు కాగా.. ఈసారి రెండు నెలల్లోనే సగానికి పైగా నీరు వృథాఅయ్యింది. ఈ జలాలన్నీ ఎప్పటికీ సద్వినియోగం అవుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. పోలవరంతో సహా ఇందుకోసం చేపట్టిన ప్రాజెక్టులన్నీ నీరసంగానే సాగుతున్నాయి.

గోదావరి జలాలు సముద్రంపాలు
గోదావరి జలాలు సముద్రంపాలు

గోదావరి నుంచి గత 2 నెలల్లోనే ఏకంగా 2,193 టీఎంసీల వరద జలాలు సముద్రం పాలయ్యాయి. సాధారణంగా ఒక నీటి సంవత్సరంలో సగటున 3,500 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తాయని అంచనా. ఈ ఏడాది నీటి సంవత్సరం ప్రారంభమై రెండు నెలలవుతోంది. ఏటా జూన్‌ ఒకటి నుంచి మే31 వరకు ఒక నీటి సంవత్సరంగా పరిగణిస్తారు. గోదావరిలో ఏటా వరదలు సహజమైనా.. ఇలా తొలి 2నెలల్లో ఈ స్థాయిలో వరదలొచ్చి భారీగా నీరు సముద్రంలోకి చేరడం అరుదు. 2001నుంచి ఇప్పటివరకు ఒక్క 2013లోనే జులై నెలాఖరువరకు ఏకంగా 2,240 టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలిశాయి. ఆ నీటి సంవత్సరంలో 5,828 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి.గోదావరి వరద జలాలను వినియోగించుకునేందుకు ఎన్నో ప్రాజెక్టులను ప్రతిపాదించారు. నికర జలాలు వాడుకునేందుకు, ఏపీ వాటాగా ఉన్న నీటిని వినియోగించుకునేందుకు అవసరమైన ప్రాజెక్టులే ఇంకా పూర్తి కాలేదు. ఇక వరద జలాల వినియోగానికి ఉద్దేశించినవి ఎప్పటికి సాకారమవుతాయనేది ప్రశ్నార్థకమే.

పోలవరానికే దిక్కులేదు: గోదావరిపై నిర్మిస్తున్న బహుళార్థసాధక ప్రాజెక్టు పోలవరం నిర్మాణం 2004లో ప్రారంభమైంది. 18ఏళ్లు గడిచినా ఇప్పటికీ పూర్తి కాలేదు. పాలనాపరమైన లోపాల వల్ల కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తి చేస్తామో చెప్పలేమనే స్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉండటం గమనార్హం. జలాశయంలో 194 టీఎంసీలను నిల్వ చేయవచ్చు. ఏడాది పొడవునా 322 టీఎంసీలు సద్వినియోగం చేసుకునేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి పోలవరంతో సాధ్యమవుతుంది.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఎప్పటికో ?: గోదావరి వరద జలాలు 63 టీఎంసీల సద్వినియోగానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని 46 మండలాలకు చెందిన 8లక్షల ఎకరాలకు నీటిని అందించడం లక్ష్యం. 30 లక్షల జనాభాకు తాగునీరు కూడా అందుతుంది. ఎప్పుడో 2009లో ప్రాజెక్టుకు పాలనామోదం లభించినా.. నేటికీ పనుల్లో వేగం లేదు.పోలవరం పూర్తిపైనే సందిగ్ధత నెలకొన్న సమయంలో ఎడమ కాలువ పనులు మూడేళ్లుగా పడకేశాయి. ఆ ఎడమ కాలువనుంచి ఉత్తరాంధ్ర సుజలస్రవంతికి నీరు వెళ్లాలి.

చింతలపూడి ఎత్తిపోతల: గోదావరి వరద జలాలు 53.50 టీఎంసీలను సద్వినియోగం చేసుకునేలా చింతలపూడి ఎత్తిపోతల ఎప్పటినుంచో సాగుతున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 2.8 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఈ పథకాన్ని ఉద్దేశించి పాలనామోదం ఇచ్చినా 65శాతం పనులే అయ్యాయి.

గోదావరి పెన్నా అనుసంధానం: పోలవరం నిర్మించాక అక్కడినుంచి నీటిని ఎత్తిపోసి బొల్లాపల్లి జలాశయానికి తీసుకెళ్లాలని ఆలోచన. అక్కడినుంచి పెన్నాకు అనుసంధానించాలని భావించారు. వ్యాప్కోస్‌ డీపీఆర్‌ సిద్ధం చేసింది. 320 టీఎంసీలను సద్వినియోగం చేసుకునేలా రూ.90 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక సిద్ధమైంది. లైడార్‌ సర్వే చేయాలనుకున్నారు. ప్రాజెక్టుకు కేంద్ర సాయం కోరారు. మరో వైపు గోదావరి జలాలను కావేరికి అనుసంధానించే ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్రం రూపొందించింది. కంతనపల్లి నుంచి నాగార్జునసాగర్‌ మీదుగా ఈ నీటిని పెన్నాకు, అక్కడినుంచి కావేరికి తరలించాలనేది ఆలోచన. తెలుగు రాష్ట్రాలు ఈ ప్రాజెక్టుకు సుముఖంగా లేవు. అందరి ఆమోదంతోనే ఇది పట్టాలకెక్కుతుంది.

అడుగు ముందుకుపడని వైఎస్సార్‌ పల్నాడు కరవు నివారణ పథకం: ఈ ప్రాజెక్టును గోదావరి పెన్నా తొలి దశగా పేరు పెట్టి పాత ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 2018లో రూ.6,020 కోట్లతో పాలనామోదం ఇచ్చింది. 73 టీఎంసీల గోదావరి వరద జలాలను సద్వినియోగం చేయాలనేది ప్రణాళిక. ఈ జలాలను ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని కరవు ప్రాంతాలకు తరలించి సాగర్‌ కుడి కాలువ కింద 9,61,231 ఎకరాల స్థిరీకరణతోపాటు కొత్తగా 73,136 ఎకరాల ఆయకట్టు కల్పనకు దీన్ని ఉద్దేశించారు. ఈ ప్రాజెక్టులో కేవలం 10శాతం పనులే అయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం వైఎస్సార్‌ పల్నాడు కరవు నివారణ పథకంగా పేరు మార్చింది. చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పంపుల ద్వారా పోలవరం కుడి కాలువ నుంచి గోదావరి వరద నీటిని ప్రకాశం బ్యారేజికి మళ్లిస్తారు.వైకుంఠపురం వద్ద నుంచి ప్రకాశం బ్యారేజిపై ఎత్తిపోతల ద్వారా ఈ నీటిని మళ్లిస్తారు. నాలుగేళ్లుగా ఈ పనుల్లో వేగం లేదు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.