ETV Bharat / city

ఉద్యోగులు గుండు కొట్టించుకున్నారు.. చెప్పులతో కొట్టుకున్నారు..!

author img

By

Published : May 1, 2022, 7:37 PM IST

Updated : May 2, 2022, 3:20 AM IST

సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అవలంభించాలని కోరుతూ ఏపీసీపీఎస్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. సీపీఎస్ రద్దుపై సీఎం జగన్‌ మాట తప్పారంటూ.. విజయనగరంలో ఉద్యోగులు గుండు చేయించుకుని, చెప్పులతో కొట్టుకుంటూ నిరసన తెలిపారు.

సీపీఎస్, జీపీఎఎస్ కాదు.. పాత పెన్షన్ విధానమే కావాలి
సీపీఎస్, జీపీఎఎస్ కాదు.. పాత పెన్షన్ విధానమే కావాలి

సీపీఎస్, జీపీఎఎస్ కాదు.. పాత పెన్షన్ విధానమే కావాలి

ముఖ్యమంత్రి విశ్వాస ఘాతుకానికి సీపీఎస్‌ ఉద్యోగులు బలయ్యారని ఆంధ్రప్రదేశ్‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏపీసీపీఎస్‌ఈఏ) నేతలు ధ్వజమెత్తారు. ఉద్యోగుల సమాచారం, బడ్జెట్‌ లెక్కలపై ఏనాడూ శ్వేతపత్రం విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం.. సీపీఎస్‌ ఉద్యోగుల లెక్కలపై మాత్రం కోట్లాది రూపాయల్ని ఖర్చు పెట్టి పత్రికా ప్రకటనలిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. సీపీఎస్‌ రద్దుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివారం ఏపీసీపీఎస్‌ఈఏ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మానవ హారాలు, విశ్వాస ఘాతుక సభలు, భిక్షాటన వంటి వినూత్న కార్యక్రమాలతో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఓటుకు విలువ లేకుండా చేస్తున్న వారికి బుద్ధినివ్వండని జాతి నేతల విగ్రహాల వద్ద వినతి పత్రాలు ఉంచారు. పాత పింఛను విధానాన్ని వెంటనే అమలు చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

* ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బాపట్ల, కర్నూలులో మహాత్మాగాంధీ విగ్రహానికి, గుంటూరు, రాజమహేంద్రవరంలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాలు ఇచ్చారు. నెల్లూరు, నంద్యాలలో దీక్ష చేపట్టారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన చేశారు.అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో నిరాహార దీక్ష చేపట్టారు. విశాఖపట్నంలో చేపట్టిన నిరసన దీక్షల్లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు పాల్గొన్నారు.

జీపీఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: ఏపీటీఎఫ్‌
ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్‌ విధానం, పాత పింఛను పథకానికి ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాదని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, కె.కులశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఫెడరేషన్‌ పిలుపు మేరకు ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టారు.

చెప్పులతో కొట్టుకుని..
సీపీఎస్‌ విషయంలో సీఎం మాట తప్పారని విజయనగరం కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయులు చెప్పులతో కొట్టుకుని, మెడలో చెప్పుల దండలు వేసుకుని గుండ్లు గీయించుకున్నారు. ఏపీసీపీఎస్‌ఈఏ ఆధ్వర్యంలో ‘విశ్వాస ఘాతుకం’ పేరిట ఈ వినూత్న నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.శివకుమార్‌, కె.ధనుంజయ్‌ మాట్లాడుతూ.. రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత తెస్తానని, విశ్వాసఘాతుకానికి పాల్పడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

* నిరసనలో విజయనగరానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు సుబ్బారావు మాట్లాడుతూ.. 90ఏళ్ల తనకు రూ.40వేల పింఛను వస్తోందని.. ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేసిన తన కుమార్తె సీపీఎస్‌ ఉద్యోగి కావడంవల్ల ఆమెకు రూ.900 మాత్రమే వస్తోందని వివరించారు. ఇలాగైతే ఎలా బతుకుతారని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: "సీఎంవో ముట్టడి"కి యూటీఎఫ్ పిలుపు... భగ్నం చేసేందుకు పోలీసుల విశ్వప్రయత్నాలు

Last Updated : May 2, 2022, 3:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.