ETV Bharat / city

DGP: 'రాజకీయ ప్రయోజనాల కోసమే దిశ పోలీసుస్టేషన్ల ముట్టడి'

author img

By

Published : Sep 4, 2021, 4:37 AM IST

రాజకీయ ప్రయోజనాల కోసమే దిశ పోలీసుస్టేషన్ల ముట్టడి అంటూ ప్రతిపక్షాలు అల్లరి చేస్తున్నాయని డీజీపీ గౌతం సవాంగ్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖకు గతేడాదిన్నర వ్యవధిలో 130 జాతీయ పురస్కారాలు లభించాయని ఆయన తెలిపారు. మహిళలపై నేరాలకు సంబంధించి గతంలో దర్యాప్తునకు 200 రోజుల పట్టేదని, ఇప్పుడు ఆ సమయాన్ని 42 రోజులకు తగ్గించగలిగామన్నారు. దిశ బిల్లుల్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ 1,645 కేసుల్లో వారం రోజుల వ్యవధిలో అభియోగపత్రాలు దాఖలు చేశామని డీజీపీ అన్నారు. గుంటూరు రమ్య హత్య కేసులో పోలీసులు, ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేశామని తెలిపారు.

డీజీపీ గౌతం సవాంగ్
డీజీపీ గౌతం సవాంగ్

‘రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు దిశ పోలీసుస్టేషన్లను ముట్టడించి, అల్లరి చేస్తున్నాయి. గుంటూరులో రమ్య హత్య కేసులో గంటల వ్యవధిలోనే నిందితుణ్ని అరెస్టు చేశాం. ఆరు రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేశాం. బాధిత కుటుంబానికి ప్రభుత్వం పరిహారం చెల్లించింది. ప్రస్తుతం ఆ అంశం న్యాయస్థానం పరిధిలో ఉంది. వారే నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా ఉంటే న్యాయస్థానాల్ని, న్యాయవ్యవస్థను అడగండి. అంతే తప్ప ప్రజల్ని తప్పుదారి పట్టించేలా వ్యవహరించటం, పోలీసులపై బురదచల్లటం సరికాదు’ అని డీజీపీ గౌతం సవాంగ్‌ ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

దిశ బిల్లు ఆమోదానికి కేంద్రం చాలా కొర్రీలు వేస్తోందని.. వీలైతే ఆ చట్టం త్వరగా రావాలని పోరాడాలి తప్ప దిశ పోలీసుస్టేషన్లు ముట్టడిస్తామనటం ఏం న్యాయం? అవగాహన లేని పనులు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. అవగాహన కల్పిద్దామన్నా వారికి అర్థం చేసుకునే మనసు ఉండాలి కదా? అని పేర్కొన్నారు. ‘రమ్య హత్య ఘటనను రాజకీయం చేయడానికి జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మేం తీసుకున్న చర్యలు చూసి.. కమిషన్‌ మమ్మల్ని అభినందించింది’ అని వివరించారు. శుక్రవారం మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ విలేకర్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
విలేకరి: దిశ చట్టం అని పిలుస్తున్నారు. బిల్లే ఇంకా ఆమోదం పొందలేదు కదా!
డీజీపీ: బిల్లులు ఆమోదం కోసం కేంద్రానికి పంపించాం. వారు చాలా కొర్రీలు వేస్తున్నారు. ఈ పదం ఎందుకు? ఇంత శిక్షెందుకు? అని అడుగుతున్నారు. వాటికి సమాధానాలు పంపిస్తుంటే మళ్లీ ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి వివరణలు ఇవ్వాల్సి ఉంది. బిల్లు ఇంకా ఆమోదం పొందలేదు.
విలేకరి: కొందరు మంత్రులు దిశ చట్టం ఆమోదం పొందిందంటున్నారు కదా.. ఏది నిజం?
డీజీపీ: దిశ కార్యక్రమాల్లో చట్టం ఒక అంశం మాత్రమే. కేంద్రం, రాష్ట్రపతి ఆమోదం పొందితేనే చట్టంగా మారుతుంది. కేంద్రం కొర్రీలు వేస్తున్నందున బిల్లు చట్టంగా మారడానికి ఇంకా సమయం పడుతుంది.
విలేకరి: 1,645 దిశ కేసుల్లో వారం రోజుల్లోనే అభియోగపత్రాలు దాఖలు చేశామని మీరు చెబుతున్నారు? వాటిలో ఎన్ని కేసుల్లో 21 రోజుల్లో శిక్ష పడింది?
డీజీపీ: 21 రోజుల్లో శిక్ష పడాలంటే దిశ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు కావాలి. వాటికి న్యాయమూర్తులు రావాలి. దీని కోసం కేంద్రానికి, ప్రధాన న్యాయమూర్తికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను కూడా నియమించింది. ప్రతిపక్షాలు వీటిపై అవగాహన లేక అల్లరి చేస్తున్నాయా? రాజకీయం కోసం అల్లరి చేస్తున్నాయా? అనేది తేలాలి. అవగాహన లేకపోతే తెలుసుకోవాలి.
విలేకరి: నెల్లూరులో అధికార పార్టీ ఎమ్మెల్యే మహిళా ఎంపీడీవోపై దాడి చేసిన కేసులో అభియోగపత్రం దాఖలు చేశారా? ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో ముప్పుందన్న మహిళ భద్రతకు భరోసా ఇస్తారా? ఓ మహిళతో అనుచితంగా మాట్లాడానంటూ లీకయిన ఆడియోలో స్వరం తనది కాదని మంత్రి అవంతి చెబుతున్నారు. అదెవరిదో తేల్చారా?
డీజీపీ: ఆయా ఘటనలకు సంబంధించి ఇప్పటికిప్పుడు వివరాలు చెప్పలేను. ఎవరో ఏదో స్వరంలో ఏదో చేశారని.. అది నిజమా? కాదా? అని అడిగితే ఇప్పటికిప్పుడు చెప్పే పరిస్థితుల్లో లేను.
విలేకరి: సీతానగరం పుష్కరఘాట్‌లో అత్యాచారం కేసులో నిందితుణ్ని పట్టుకోవటానికి నెలకు పైగా ఎందుకు పట్టింది? ఈ కేసులో వారంలో అభియోగపత్రం ఎందుకు దాఖలు చేయలేకపోయారు?
డీజీపీ: నిందితుడి ఫొటో, పేర్లు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో చూపించేసి.. అల్లరి చేయటంతో వారు అప్రమత్తమై పరారైపోయారు. వారికి ఇల్లూ, వాకిలీ లేదు. ఎంతో శ్రమపడి ఒక నిందితుడ్ని పట్టుకున్నాం. ఈ కేసులో అభియోగపత్రం గురించి పరిశీలించి చెబుతాం.
విలేకరి: నిందితుల ఆచూకీ తెలుసుకోవడానికి పోలీసులే మీడియాకు ఫొటోలు విడుదల చేస్తుంటారు. మీరిప్పుడు మీడియాలో చూపించటంతోనే నిందితులు పరారయ్యారని చెబుతున్నారు?
డీజీపీ: మీడియా తొందరపడకూడదు. కొన్ని వ్యవస్థాపరమైన సవాళ్లు ఉంటాయి. చట్టం వచ్చినంత మాత్రాన మార్పు వచ్చేస్తుందని లేదు.

ఏపీ పోలీసు శాఖకు 130 జాతీయ పురస్కారాలు

‘ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖకు గతేడాదిన్నర వ్యవధిలో 130 జాతీయ పురస్కారాలు లభించాయి. మహిళలపై నేరాలకు సంబంధించి గతంలో దర్యాప్తునకు 200 రోజుల పట్టేది. దాన్ని 42 రోజులకు తగ్గించగలిగాం’ అని డీజీపీ చెప్పారు.
ఎంటర్‌ప్రైజస్‌ సెర్చ్‌లో చింతమనేని పేరు కొట్టి.. నేరగాళ్లకు సంబంధించి సాంకేతికతను వినియోగిస్తున్నామని డీజీపీ చెప్పారు. ఎవరి పేరైనా ఎంటర్‌ప్రైజస్‌ సెర్చ్‌లో కొడితే ట్రాఫిక్‌ ఉల్లంఘనల నుంచి వారి నేరచరిత్ర మొత్తం ప్రత్యక్షమవుతుందన్నారు. చింతమనేని ప్రభాకర్‌ పేరు బాగా ప్రాచుర్యం కనుక ఆయనపై ఉన్న కేసుల వివరాలు చూద్దామంటూ.. డీజీపీ ఆయన పేరు కొట్టి వివరాలను మీడియాకు చూపించారు.

‘1995 నుంచి ఇప్పటి వరకూ చింతమనేనిపై 84 కేసులున్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులే 17. మహిళలపై దాడులకు సంబంధించి 5, ప్రభుత్వోద్యోగులపై దౌర్జన్యాలపై 6 కేసులున్నాయి. తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి చేసిన కేసు.. తప్పుడు కేసు అంటూ 2019 ఫిబ్రవరిలో ఎన్నికలకు నెల రోజుల ముందు మూసేశారు. ఆయన చరిత్ర ఏమిటి? అలాంటి వ్యక్తిని ఎలా కట్టడి చేయాలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో వర్క్​ ఇన్ హోమ్ టౌన్ సెంటర్లు: మంత్రి గౌతం రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.