ETV Bharat / city

DASARA AT INDRAKEELADRI: ఇంద్రకీలాద్రిపై దసరా..రేపటినుంచి అమ్మవారి అలంకారాలు

author img

By

Published : Oct 6, 2021, 5:19 PM IST

Updated : Oct 6, 2021, 5:51 PM IST

DASARA AT INDRAKEELADRI
DASARA AT INDRAKEELADRI

దేశంలోని శక్షిక్షేత్రాల్లో విజయవాడ ఇంద్రకీలాద్రి విశిష్టమైంది. కృష్ణానది తీరంలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ, మల్లేశ్వరస్వామి స్వయంగా అవతరించారు. ఇంద్రకీలాద్రిపై ప్రతి శిలను పవిత్రంగా.. ప్రతివృక్షాన్ని కల్పవృక్షంగా భక్తులు భావిస్తారు. వేదమంత్రాలతో.. స్తోత్రాలతో భక్తులు జై భవానీ.. హరహర మహాదేవ శంభోశంకర అంటూ.. దుర్గామల్లేశ్వరులను నిత్యం ప్రార్ధిస్తూ.. ఆరాధిస్తూ.. పూజిస్తూ ఉన్నందునే ఇంద్రకీలాద్రి క్షేత్రం అపర కైలాసంగా వెలుగొందుతోంది. ఈనెల ఏడో తేదీ నుంచి దసరా ఉత్సవాల నిర్వహణకు ఇంద్రకీలాద్రి ముస్తాబైంది.

ఇంద్రకీలాద్రిపై దసరా సందడి..రేపటినుంచి అవతారాలు

బెజవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రంపై ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు శరన్నవరాత్రులు అమ్మవారికి ఎంతో వైభవంగా జరుగుతాయి. విజయదశమి పర్వదినాన హంసవాహనంపై దుర్గామల్లేశ్వర స్వామివార్లు కృష్ణానదిలో జలవిహారం చేస్తారు. 11న మాత్రమే రెండు రూపాల్లో అమ్మవారిని అలంకరిస్తారు. రోజుకో రూపంలో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి (7-10-2021)

శరన్నవరాత్రి మహోత్సవాల్లో తొలిరోజు కనకదుర్గమ్మ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తారు. పూర్వం మాధవ వర్మ అనే మహారాజు ధర్మనిరతికి మెచ్చి అమ్మవారు విజయవాటికాపురిలో కనకవర్షం కురిపించిందని... అప్పటినుంచి అమ్మవారిని కనకదుర్గగా కొలిచి.. దసరా ఉత్సవాల్లో స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరిస్తున్నారు.

ఆశ్వయుజ శుద్ధ విదియ (8-10-2021)

రెండో రోజు కనకదుర్గమ్మ బాలా త్రిపురసుందరిగా దర్శనమిస్తారు. మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో ఉండే మొదటి దేవత బాలాత్రిపుర సుందరీదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహం పొందగలం. దసరా ఉత్సవాల్లో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం బాలా త్రిపుర సుందరీదేవి.

ఆశ్వయుజ శుద్ధ తదియ (9-10-2021)

మూడో రోజు అమ్మవారు గాయత్రిదేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా, విద్రుమ, హేమనీల, దవళ వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రిదేవి. గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రాదాలు నివేదిక చేస్తారు. గాయత్రి మాతను వేదమాతగా కొలుస్తూ.. గాయత్రిని దర్శించడం వల్ల సకల మంత్ర సిద్ధి తేజస్సు, జ్ఞానం లభిస్తాయని ప్రజల నమ్మకం.

ఆశ్వయుజ శుద్ధ చవితి (10-09-2021)

నాలుగో రోజున కనకదుర్గమ్మ శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా దర్శనమిస్తారు. ఈ అమ్మవారు శ్రీచక్ర అధిష్టానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా తనను కొలిచే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తారు. శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగా, అమ్మవారు త్రిపుర సుందరీదేవిగా భక్తులతో పూజలందుకుంటారు.

ఆశ్వయుజ శుద్ధ పంచమి (11-09-2021)

ఐదో రోజున ఉదయం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అన్నపూర్ణాదేవి అన్నం ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవనాధారం. అన్నం లేనిదే జీవులను మనుగడలేదు. అన్నపూర్ణాదేవి ఎడమచేతిలోని బంగారుపాత్రలో... అమృతాన్నం, వజ్రాలు పొదిగిన గరిటతో... తన భర్త ఈశ్వరునికే బిక్ష అందించే అంశం అద్భుతం.

ఆశ్వయుజ శుద్ధ షష్టి (11-09-2021)

ఐదో రోజు మధ్యాహ్నం నుంచి అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమిస్తారు. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మి. జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్ట రాక్షస సంహారాన్ని చేయడం అద్భుత ఘట్టం. మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమితమైన పరాక్రమం చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోక స్థితికారిణిగా, ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమష్టిరూపమైన అమృత స్వరూపిణిగా దుర్గమ్మ మహాలక్ష్మి దేవిగా భక్తులను అనుగ్రహిస్తారు.

ఆశ్వయుజ శుద్ధ సప్తమి (12-10-2021)

ఆరో రోజు అమ్మవారు సరస్వతిదేవి అలంకారంలో దర్శనమిస్తారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తి స్వరూపాలలో దుష్ట సంహారం చేసిన దుర్గాదేవికి శరన్నవరాత్ర ఉత్సవాలలో మూలానక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతి అవతారంలో అలంకరిస్తారు. సరస్వతిదేవిని సేవించడం వల్ల విద్యార్థులకు వాగ్దేవి అనుగ్రహం వల్ల సర్వ విద్యల్లో విజయం పొందుతారు. మూలానక్షత్రం నాటి నుంచి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా భావించి దుర్గమ్మను ఆరాధిస్తారు.

మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

ఆశ్వయుజ శుద్ధ అష్టమి (13-10-2021)

ఏడో రోజు అష్టమి తిధి నాడు కనకదుర్గమ్మ వారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లోకకంఠకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి అమ్మవారు దుర్గగా వెలుగొందింది. లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవిగా కీలాద్రిపై స్వయంగా అమ్మవారు ఆవిర్భవించారు. దుర్గే దుర్గతినాశని అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగజేస్తుంది.

ఆశ్వయుజ శుద్ధ నవమి (14-10-2021)

ఎనిమిదో రోజున అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురుడిని సంహరించి దుర్గాదేవి దేవతల, బుుషులు, మానవుల కష్టాలను తొలగిస్తుందని భక్తులు నమ్ముతారు.

ఆశ్వయుజ శుద్ధ దశమి (15-10-2021)

తొమ్మిదో రోజున కనకదుర్గాదేవి చిరునవ్వులతో రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. చెరకుగడను వామహస్తంతతో ధరించి.. దక్షిణ హస్తంతో అభయాన్ని ప్రసాదింపజేసే రూపంతో షోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా చక్రరాజ అధిష్టానదేవతగా వెలుగొందే రాజరాజేశ్వరి దేవిని దర్శించి, అర్చించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింపజే అపరాజితాదేవిగా, చల్లని తల్లిగా దుర్గమ్మ రాజరాజేశ్వరిదేవి అలంకారంలో దర్శనం ఇస్తుంది. అమ్మను సేవించడం వల్ల సకల శుభాలు, విజయాలు లభిస్తాయి.

ప్రత్యేక పూజల వివరాలు..

ప్రత్యేక కుంకుమార్చనలు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు, పది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మూలానక్షత్రం రోజు మినహా ఇతర రోజుల్లో ఒక పూజకు మూడు వేల రూపాయలు రుసుముగా నిర్ణయించారు. మూలానక్షత్రం రోజున ఈ రుసుము ఒక పూజకు ఐదు వేల రూపాయలుగా నిర్ణయించారు. శ్రీచక్ర నవావరణార్చన ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు నిర్వహిస్తారు. ఈ పూజకు మూడు వేల రూపాయలుగా రుసుము నిర్ణయించారు. అలాగే శతచండీహోమం ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు జరగనుంది. ఈ పూజకు నాలుగు వేల రూపాయలు రుసుముగా నిర్ణయించారు. ప్రత్యక్షంగా భక్తులు ఈ పూజల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. పరోక్షంగా కూడా నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించి పూజలు చేయించుకోవచ్చు. దసరా తొమ్మిది రోజులు ఏ పరోక్ష పూజకైనా 20 వేల రూపాయలుగా రుసుము నిర్ణయించారు. ఈ ప్రత్యేక పూజల టిక్కెట్లను www.aptemples.ap.gov.in వైబ్‌సైట్‌ ద్వారా రుసుము చెల్లించి ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చు.

ఇంద్రకీలాద్రి క్షేత్ర వైభవం..

ప్రాచీనకాలంలో పరాశక్తి మహిమను తెలుసుకున్న కీలుడనే యక్షుడు అమ్మవారి గురించి ఘోరంగా తపస్సు చేయగా.. అతని భక్తికి మెచ్చి అమ్మవారు వరాన్ని కోరుకోమనగా.. పరామనంద భరితుడైన ఆ కీలుడు అమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి.. కీర్తించి తన హృదయంలో శాశ్వతంగా కొలువై ఉండాలని ప్రార్ధించాడు. అనంతరం కీలునితో అమ్మవారు నీవు అద్రి అంటే కొండ రూపంలో ఉండమని.. త్వరలో ఈ అద్రిపై స్వయంభువుగా ఆవిర్భవిస్తానని చెప్పగా.. కీలుడు ఆనందభరితుడై అద్రిగా మారగా.. కొంతకాలానికి దుర్మార్గుడైన దుర్గమాసురుడు అనే రాక్షసున్ని వధించిన ఆదిపరాశక్తి కీలాద్రికి వచ్చి దుర్గాదేవిగా నిలిచింది. అమ్మ పాదస్పర్శకు కీలుడు తరించాడు. మాధవవర్మ అనే మహారాజు ధర్మనిరతికి మెచ్చిన దుర్గాదేవి కనకవర్షం కురిపించి.. శ్రీ కనకదుర్గాదేవిగా కీర్తించబడుతోంది. అమ్మవారి దర్శనానికి ఇంద్రుడు మొదటగా రావడం వల్ల ఈ పర్వతం ఆనాటి నుంచి ఇంద్రకీలాద్రిగా ప్రాచుర్యం పొందింది.

మల్లేశ్వరస్వామి ఆవిర్భావం..

కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై భక్తుల కోసం అవతరించిన తర్వాత పరమశివుని అవతరింపజేయడం కోసం బ్రహ్మాదిదేవతలు ప్రార్థించగా వారి కోరిక మేరకు ఇంద్రకీలాద్రిపై ఆవిర్భవించాడు. దేవతలంతా మల్లికా పుష్పాలతో అర్చించిన మీద మల్లేశ్వరునిగా ఖ్యాతి చెందారు.

కనకదుర్గమ్మ వైశిష్ట్యం..

త్రేతాయుగతంలో అగస్త్య మహర్షి ఈ దుర్గాపర్వత మహత్యాన్ని శ్రీరామచంద్రులకు వివరించారు. అమ్మవారిని దర్శించుకున్న సమయంలో క్షేత్రపాలకునిగా ఆంజనేయస్వామిని నియమించినట్లు జనశృతి. ఇంద్రకీలాద్రి పర్వతం నాలుగు దిశల వైపు క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి ఉంటారు. ద్వాపరయుగంలో అర్జునుడు వనవాసం సమయంలో కృష్ణభగవానుని ఆజ్ఞ మేరకు దుర్గా అమ్మవారిని కొలిచి అమ్మ అనుగ్రహం పొంది.. ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరుని కోసం తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందాడు. అర్జునుడికి భుజబలాన్ని, మనోధైర్యాన్ని వాక్‌ వైఖరిని పరీక్షించాలని సతీసమేతంగా పరమేశ్వరుడు కిరాతుని రూపం ధరించి అర్జునితో వాదించి, మల్లయుద్ధం చేసి అతని శక్తికి సంతోషంగా నిజరూపంతో సాక్షాత్కరించి ప్రీతితో పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. అసురసంహారం చేసిన అనంతరం దుర్గాదేవి ఉగ్రరూపంతో ఉండడం గ్రహించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు దుర్గమ్మను భక్తులపాలిట కల్పవల్లిగా.. శాంత స్వరూపిణిగా ఉంచాలని అమ్మవారి పాదాల చెంత శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి వైదికపరమైన స్త్రోత్రాలతో కుంకుమతో పూజలు నిర్దేశించగా.. ఆనాటి నుంచి అమ్మవారికి అదే విధానంగా నేటికి పూజలు జరుగుతున్నాయి.

ఇదీ చదవండి:

VIJAYAWADA INDRAKEELADRI: ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు...కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు అనుమతి

Last Updated :Oct 6, 2021, 5:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.