ETV Bharat / city

Contract Employees: పీఆర్సీ సిఫార్సుతోనైనా సర్కారు కదులుతుందా..!

author img

By

Published : Mar 7, 2022, 7:43 AM IST

Contract Employees: సీఎం జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాట ప్రకారం.. ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తారని ఎదురుచూసిన కాంట్రాక్టు ఉద్యోగులు నిరాశకు గురవుతున్నారు. తాజాగా బయటపెట్టిన అశుతోష్‌ మిశ్ర వేతన సవరణ నివేదిక.. ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు చల్లనిమాట చెప్పింది. అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని సిఫార్సు చేసింది.

Contract Employees feels bad for not making their jobs regularised
కాంట్రాక్టు ఉద్యోగుల్లో నిరాశ

Contract Employees: ముఖ్యమంత్రి జగన్‌ తమకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తారని ఎదురుచూసిన కాంట్రాక్టు ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు. తాజాగా బయటపెట్టిన అశుతోష్‌ మిశ్ర వేతన సవరణ నివేదిక ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు చల్లనిమాట చెప్పింది. అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని సిఫార్సు చేసింది. పాదయాత్ర హామీ నెరవేరుతుందని మూడేళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ఉద్యోగులకు పీఆర్సీ సిఫార్సుతోనైనా సర్కారు కదులుతుందేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో పీఆర్సీ సిఫార్సులు ఇవీ..

* సామర్థ్యం ఆధారంగా అర్హత సాధించి కాంట్రాక్టు ఉద్యోగం పొందినవారిని ఖాళీ ఉన్న శాశ్వత పోస్టుల్లో నియమించాలి. నిర్దిష్ట భర్తీ విధానం పాటించి కాంట్రాక్టు ఉద్యోగాలు పొందితే వారిని శాశ్వత పోస్టుల్లోకి తీసుకోవాలి. భవిష్యత్తులో ఈ ఉద్యోగాల భర్తీలో పోటీపడే ఇతర అభ్యర్థులతో సమానంగా వారూ అర్హత సాధించాలనే నిబంధనతో ఆ పోస్టుల్లో నియమించాలి.

* ఈ విధానం ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగాలు పొందనివారి అర్హతల ఆధారంగా సంతృప్తి చెందితే భవిష్యత్తులో చేపట్టే పోస్టుల భర్తీలో వారికి అవకాశం ఇవ్వాలి.

* ఇకముందు శాశ్వత పోస్టులను కాంట్రాక్టు ఉద్యోగులతో నింపకూడదు.

మాట ఇచ్చారు.. తీర్చేదెప్పుడు?

* కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశంపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయింది. 2019 జులై 10న దీనిపై ఉత్తర్వులు ఇచ్చారు. ఇంకా నివేదిక సమర్పించలేదు.

* 2019 నవంబరులో మరో కమిటీ ఏర్పాటైంది. మంత్రివర్గ సంఘానికి తగిన సలహాలు అందించేందుకు ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. సీఎస్‌ ఛైర్మన్‌గా, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కన్వీనర్‌గా మరో అయిదుగురు సీనియర్‌ ఐఏఎస్‌లతో ఈ కమిటీ ఏర్పాటైంది. ఇద్దరు సీఎస్‌లు పదవీవిరమణ చేసినా ఆ కమిటీ నివేదిక అందలేదు.

* దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల్లో అర్హులను క్రమబద్ధీకరిస్తామనే మాటను ప్రభుత్వం ఇంకా నిలబెట్టుకోనట్లవుతోంది.

* ఇప్పుడు అశుతోష్‌ మిశ్ర వేతన సవరణ కమిషన్‌ కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి స్పష్టమైన సిఫార్సులు చేసింది. సర్కారు ఈ నివేదికనైనా అమలు చేస్తుందా అన్నది చూడాలి.

వేల మంది ఎదురుచూపులు

అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని క్రమబద్ధీకరిస్తాం’ అని వైకాపా తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి అర్హులను క్రమబద్ధీకరిస్తామని తెలిపింది. మూడేళ్లుగా అడుగు ముందుకు పడలేదు. ప్రస్తుతం అశుతోష్‌ మిశ్ర నివేదికలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఒక భరోసా లభించింది.

‘పరీక్షలు రాసి, డీఎస్సీ ద్వారా ఎంపికయ్యాం. ఉమాదేవి వర్సెస్‌ కర్ణాటక ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని చెప్పింది. పరీక్ష రాసి ఎంపికై పదేళ్లపాటు కాంట్రాక్టు ఉద్యోగిగా సర్వీసు ఉన్న వారిని క్రమబద్ధీకరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది’ అంటూ తమను శాశ్వత ఉద్యోగాల్లో నియమించాలని కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

టిడ్కో ఇళ్లకు రుణాలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్న బ్యాంకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.