ETV Bharat / city

CM Jagan Review: విశ్వవిద్యాలయాల ప్రగతికి మూడేళ్ల కార్యాచరణ

author img

By

Published : Oct 25, 2021, 3:22 PM IST

Updated : Oct 26, 2021, 4:21 AM IST

ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన విద్యతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని..ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంగ్లం తప్పనిసరి పాఠ్యాంశం కావాలని.., ఆంగ్లం వల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల ఉండాలన్న సీఎం జగన్.. ఎయిడెడ్‌ విద్యాసంస్థల అప్పగింతలో బలవంతం లేదన్నారు.

ఉద్యోగ కల్పన దిశగా విద్యాప్రమాణాలు మెరుగుపరచాలి
ఉద్యోగ కల్పన దిశగా విద్యాప్రమాణాలు మెరుగుపరచాలి

ప్రతి శాసనసభ నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ‘మూడేళ్లలో విశ్వవిద్యాలయాలన్నీ బాగుపడాలి. అధ్యాపకుల నియామకానికి అంగీకారం తెలిపాం. మంచి అర్హత కలిగిన వారిని నియమించాలి. నియామకాల్లో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. పారదర్శకత ఉండాలి. పక్షపాతం ఉండరాదు...’ అని ఆయన పేర్కొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉన్నత విద్యపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... ‘ప్రతి వారం ఒక్కో వైస్‌ఛాన్సలర్‌తో ఉన్నత విద్యామండలి సమావేశం కావాలి. అనంతరం నేరుగా నా దృష్టికి సమస్యలు తీసుకురావాలి. వాటన్నింటి పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలి. ఇలా వచ్చే మూడేళ్ల కాలానికి కార్యాచరణ ఉండాలి. అన్నీ నాక్‌ రేటింగ్‌ సాధించాలి’ అని పేర్కొన్నారు.

విశ్వవిద్యాలయాల్లో మంచి బ్యాండ్‌విడ్త్‌తో ఇంటర్‌నెట్‌ సదుపాయం పూర్తి స్థాయిలో ఉండాలని, కళాశాలలు కూడా ఖచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేకుంటే వాటి ప్రతిష్ట దెబ్బతింటుందని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. ప్రమాణాలు లేనట్లు గుర్తించిన కళాశాలలకు తగిన సమయమిచ్చి అవి మెరుగుపడేలా చూడాలని, అప్పటికీ తగినట్లు లేకపోతే అనుమతులు ఇవ్వరాదని ఆదేశించారు. ‘గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్‌బీకేలు, విలేజి క్లినిక్కులు వంటి వ్యవస్థలు సమర్థంగా పనిచేయడానికి అవసరమైన విధానాలపై, రిజిస్ట్రేషన్‌, టౌన్‌ప్లానింగ్‌ విభాగాల్లో పారదర్శకత, పౌరులకు మెరుగైన సేవలు అందించడంపై విశ్వవిద్యాలయాలు అధ్యయనం జరగాలి. అత్యుత్తమ అధ్యాపకుల క్లాసులను రికార్డు చేయాలి. సబ్జెక్టుల వారీగా ఆన్‌లైన్‌లో పెట్టాలి. ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలి. నిపుణులైన వారితో కోర్సులు రూపొందించాలి. సర్టిఫైడ్‌ కోర్సులు సిలబస్‌లో భాగమవ్వాలి. శిక్షణను అనుసంధానించాలి. మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలతో నిరంతరం శిక్షణ కొనసాగించాలి. జిల్లా కలెక్టర్‌తో సమన్వయం చేసుకుని నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు కళాశాలలను అనుసంధానించాలి. ఆన్‌లైన్‌లో కూడా నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించాలి. నాలుగేళ్లపాటు ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో పాఠ్యపుస్తకాలు ఉండాలి...’ అని ముఖ్యమంత్రి సూచించారు.

ఒక్కో విశ్వవిద్యాలయం ఒక్కో రంగంపై పరిశోధనలు చేసేలా పరిశ్రమలతో అనుసంధానం కావాలన్నారు. బేసిక్‌ ఇంగ్లిష్‌ తప్పనిసరి సబ్జెక్టుగా ఉండాలన్నారు. దీనివల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చాక విద్యారంగంలో తేడా ఏమిటన్నది కనిపించాలన్నారు. స్థూల ప్రవేశాల నిష్పత్తి 2025 నాటికి 70శాతానికి చేరుకోవాలని చెప్పారు.

సమస్యలున్నా ఫీజు రీఎంబర్స్‌మెంట్‌:

ఎన్నో సమస్యలున్నా ఫీజు రీఎంబర్స్‌మెంట్‌లో లోటు చేయడం లేదని, మూడునెలలకు ఒకసారి చెల్లిస్తున్నామని సీఎం జగన్‌ వెల్లడించారు. ‘ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ అందకపోవడంతో సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదన్న మాట యాజమాన్యాల నుంచి రాకుండా చూసుకుంటున్నాం. తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తుండటంతో కళాశాలల్లో పరిస్థితులపై వారు నేరుగా ప్రశ్నిస్తున్నారు. విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రభుత్వ కళాశాలల్లో కూడా ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ చెల్లిస్తాం. అవి ఆర్థికంగా స్వయంసమృద్ధి చెందుతాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలలు కూడా స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని...’సీఎం జగన్‌ వివరించారు.

‘ఎయిడెడ్‌’ అప్పగింతలో బలవంతం లేదు:

ఎయిడెడ్‌ విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. పూర్తిగా స్వచ్ఛందమేనన్నారు. ‘మౌలిక సదుపాయాల్లేక చాలా సంస్థల్లో విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వాటిని ప్రభుత్వానికి అప్పగిస్తే దాతల పేర్లు కొనసాగిస్తూ మెరుగైన రీతిలో నడుపుతాం. వారే నడుపుతామన్నా అభ్యంతరం లేదు...’ అని పేర్కొన్నారు. ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ వర్క్‌బుక్‌, పాఠ్యపుస్తకంతో పాటు ఏపీఎస్‌సీహెచ్‌ఈ పాడ్‌కాస్ట్‌ని సీఎం జగన్‌ ఆవిష్కరించారు. జగనన్న వసతి దీవెన ద్వారా లబ్ది పొందుతున్న వారిలో ఆప్షన్‌గా ఎంచుకున్న 1,10,779 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. మంత్రి సురేష్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, వివిధ విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్సలర్లు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: TDP leaders: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరాం: చంద్రబాబు

Last Updated : Oct 26, 2021, 4:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.