ETV Bharat / city

CM Jagan: 'వ్యవసాయ రంగం ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి'

author img

By

Published : Jul 26, 2021, 7:53 PM IST

వ్యవసాయ ఉపకరణాలు తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చేలా...రైతు భరోసా కేంద్రాల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యలో...వ్యవసాయ పరికరాల నిర్వహణ, వినియోగంపై కోర్సులు ప్రవేశపెట్టాలని సూచించారు. వ్యవసాయ రంగం ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు.

cm jagan review on agriculture and infra funds
వ్యవసాయ రంగం ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి

పశుసంవర్ధక, వ్యవసాయ, అనుబంధ రంగాల బలోపేతంపై సీఎం జగన్‌..తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. రైతు భరోసా కేంద్రాల వద్ద మల్టీ పర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి...డ్రై స్టోరేజీ, డ్రైయింగ్‌ ప్లాట్‌ఫాంలు, గోడౌన్లు, హార్టికల్చర్‌ మౌలిక సదుపాయాలు, ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్లు, అసేయింగ్‌ ఎక్విప్​మెంట్ల వంటి..15 రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఆర్బీకేల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నియోజకవర్గాల స్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణ జరగాలన్నారు.

తొలిదశలో 3,250 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయగా..రెండో దశ కింద సెప్టెంబరు నాటికి మరో 3,250 ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మూడో దశలో డిసెంబరు నాటికి 4,250 కమ్యూనిటీ సెంటర్లు, 535 హార్వెస్టర్లు, 85 హబ్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. మొత్తంగా 10,750 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటైతే...వ్యవసాయ ఉపకరణాలు తక్కువ ఖర్చుకే రైతులకు అందుబాటులోకి వస్తాయని, కూలీల కొరత సమస్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఏ యంత్ర పరికరం ఎంత అద్దెకు లభ్యమవుతుందో..ఆర్బీకేల్లో ప్రదర్శించాలన్నారు. వ్యవసాయ పరికరాల నిర్వహణ, వినియోగంపై నైపుణ్యాలు పెంచేందుకు..ఐటీఐ, పాలిటెక్నికల్‌ ఎడ్యుకేషన్‌లో కోర్సులు ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. తద్వారా గ్రామస్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణపై నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉంటాయన్నారు.

రాష్ట్రంలో 33 చోట్ల సీడ్‌ కం మిల్లెట్‌ ప్రాససింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్..,ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక యూనిట్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. కొన్నిచోట్ల అవసరాన్నిబట్టి ఒకటికి మించి నెలకొల్పాలన్నారు. మత్స్యశాఖపైనా సమీక్షించిన సీఎం..2022 సెప్టెంబరు నెలాఖరుకు చేపలు, రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్లు ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో దేశీయ ఆవుల ఫాంలు, ఆర్గానిక్‌ డెయిరీలు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు.

సాగురంగం మౌలిక వసతుల కల్పన రెండోదశ పనులకు సిద్ధం కావాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. వ్యవసాయ రంగం ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. ఎప్పటికప్పుడు పనుల ప్రగతి పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి

JAGAN CASE: మరోసారి గడువు కోరిన సీబీఐ.. 'జగన్‌ బెయిల్‌ రద్దు' పిటిషన్‌పై విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.