ETV Bharat / city

పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహాయం అందించాలని ప్రధానిని కోరిన సీఎం జగన్

author img

By

Published : Aug 22, 2022, 8:37 PM IST

Updated : Aug 23, 2022, 6:28 AM IST

పోలవరం ప్రాజెక్టుకు సవరించిన 55 వేల 548 కోట్ల అంచనాలకు ఆమోదం తెలపాలని సీఎం జగన్‌ ప్రధాని నరేంద్రమోదీని కోరారు. దిల్లీలో ప్రధానితో భేటీ అయిన సీఎం.. పోలవరం పనుల బకాయిలను 15 రోజుల్లో విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిర్వాసితుల ప్యాకేజీ, విభజన హామీలు, ప్రత్యేక హోదా, జాతీయ ఆహార భద్రతా చట్టం, తెలంగాణ డిస్కం బకాయిల గురించి వినతి పత్రం అందజేశారు.

ప్రధానిని కోరిన సీఎం జగన్
ప్రధానిని కోరిన సీఎం జగన్

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి తాత్కాలిక ప్రాతిపదికన రూ.10 వేల కోట్లను ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విన్నవించారు. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి దాదాపు 40 నిమిషాలపాటు దిల్లీలోని లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లో ప్రధానితో సమావేశమైన ముఖ్యమంత్రి 8 అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అవన్నీ ముఖ్యమంత్రి దిల్లీ వచ్చిన ప్రతిసారీ చెబుతున్న అంశాలే కావడం గమనార్హం.

‘పోలవరాన్ని వేగంగా పూర్తి చేయడానికి తాత్కాలిక ప్రాతిపదికన రూ.10 వేల కోట్లను అందించాలి. రాష్ట్రం సొంతంగా ఖర్చు చేసిన రూ.2900 కోట్లను తక్షణమే చెల్లించాలి.

* సాంకేతిక సలహా కమిటీ నిర్ధారించిన రూ.55,548.87 కోట్ల ప్రాజెక్టు వ్యయానికి ఆమోదం తెలపాలి. పనుల్లో తీవ్ర జాప్యానికి కారణమవుతున్న విభాగాలవారీ తిరిగి చెల్లింపుల విధానానికి స్వస్తి చెప్పాలి. అన్ని జాతీయ ప్రాజెక్టుల్లో మాదిరిగానే మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని, చేసిన పనులకు 15 రోజుల్లోగా తిరిగి చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకోవాలి.

రెవెన్యూ లోటు రూ.32,625 కోట్లు

రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.32,625.25 కోట్లను మంజూరు చేయాలి. 2014-15 కాలానికి సంబంధించిన బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పింఛన్ల రూపంలో రాష్ట్రానికి లోటు ఏర్పడినందున దాన్ని భర్తీ చేయాలి.

2.68 కోట్ల మందికి రేషన్‌

రాష్ట్రంలో 2.68 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ అందుతోంది. వీరిలో 61% మంది గ్రామాలకు, 39% మంది పట్టణాలకు చెందినవారున్నారు. చట్టం నిర్దేశించిన ప్రకారం గ్రామాల్లో 75% మందికి, పట్టణాల్లో 50% మందికి పీడీఎస్‌ ప్రయోజనాలు అందాల్సింది ఉంది. ఏపీతో పోల్చుకుంటే ఆర్థికంగా మెరుగైన స్థాయిలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లలో ఏపీకంటే కనీసం 10% మంది లబ్ధిదారులు అధికంగా ఉన్నారు. కొవిడ్‌ సమయంలో ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద కేంద్రం ఇస్తున్న దానికంటే అదనంగా 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ ఇచ్చింది. దీనివల్ల సుమారు రూ.5,527.63 కోట్ల అదనపు భారాన్ని రాష్ట్రం మోయాల్సి వచ్చింది. అందువల్ల జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారుల గుర్తింపు విషయాన్ని వెంటనే పునఃపరిశీలించాలి. నెలవారీగా రాష్ట్రానికి కేటాయిస్తున్న బియ్యం కోటాలో 3లక్షల టన్నులు వినియోగంకాకుండా ఉంటున్నాయి. ఇందులో కేవలం 77 వేల టన్నులు ఏపీకి కేటాయిస్తే సరిపోతుంది.

తెలంగాణ విద్యుత్తు బకాయిలపై ఫిర్యాదు: తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రూ.6,756 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. ఎనిమిదేళ్లుగా సమస్య అపరిష్కృతంగానే ఉంది. ఈ డబ్బు ఇప్పిస్తే కష్టాల్లో ఉన్న ఏపీ విద్యుత్‌ కంపెనీలు ఒడ్డున పడతాయి.

అపరిష్కృతంగా విభజన హామీలు: రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయింది. ప్రత్యేక హోదా సహా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలి.

వైద్య కళాశాలలు ఇవ్వండి: మా రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా అనుమతిచ్చిన మూడింటి పనులు జరుగుతున్నాయి. ఇంకా 12 కాలేజీలకు అనుమతులు ఇవ్వాలి.

‘బీచ్‌శాండ్‌’తో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు: మా రాష్ట్రానికి 14 బీచ్‌శాండ్‌ ఏరియాల కేటాయింపు అంశం పెండింగులో ఉంది. ఏపీఎండీసీ వీటిని కేటాయిస్తే ఈ రంగంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేందుకు అవకాశముంది.

కడప స్టీల్‌కు ఇనుప గనులు: కడపలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌ కోసం ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలి. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు గనుల కేటాయింపు చాలా కీలకం’ అని ప్రధాని దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లినట్లు సీఎంవో పేర్కొంది.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో జగన్‌ సమావేశం

.
.

ఒక్కరోజు పర్యటన నిమిత్తం దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ఉన్నారు. రాష్ట్రపతికి వెంకటేశ్వరస్వామి చిత్రపటం, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.

ఇవీ చూడండి

Last Updated : Aug 23, 2022, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.