ETV Bharat / city

37 మంది తెదేపా కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు..4 వేలకు పైగా అక్రమ కేసులు: చంద్రబాబు

author img

By

Published : Jun 10, 2022, 3:45 PM IST

Updated : Jun 10, 2022, 7:52 PM IST

చంద్రబాబు
చంద్రబాబు

Babu Comments: వైకాపా పాలనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాంతియుతంగా ఉండే రాష్ట్రాన్ని మూడేళ్లలో వల్లకాడు చేశారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు సంబంధీకులను చంపేస్తారని ముందునుంచి చెబుతూనే ఉన్నామని..,తాము చెప్పినట్లే జరగుతోందని అన్నారు.

వాళ్లను చంపేస్తారని చెబుతూనే ఉన్నాం

Chandra Babu on YSRCP: శాంతియుతంగా ఉండే రాష్ట్రాన్ని మూడేళ్లలో వల్లకాడు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు వైకాపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైకాపా నేతల అవినీతి, దాష్టీకాలకు ఈ మూడేళ్లలో అనేకమంది చనిపోయారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ చర్యలతో ఎంతోమంది చనిపోయారంటూ తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన 'క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఏపీ' ఫొటో, వీడియో ప్రదర్శనను చంద్రబాబు ప్రారంభించారు. ప్రజా చైతన్యం కోసమే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వాన్ని కట్టడి చేయకుంటే రాష్ట్రం అంధకారమవుతుందన్నారు. కొత్త డీజీపీ వచ్చాక పరిస్థితి ఇంకా దారుణంగా తయారైందని దుయ్యబట్టారు. ఫిర్యాదు చేయకుండా బాధితులను బెదిరిస్తున్నారన్నారు. గట్టిగా ప్రశ్నించిన తెదేపా నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

"60మంది నేతలు, 4 వేలకు పైగా కార్యకర్తలపై అక్రమ కేసులు. నలుగురు మాజీమంత్రులు, ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. మూడేళ్లలో 24 మంది బీసీ నేతలను హతమార్చారు. 2,552 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 422 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. 37 మంది తెదేపా కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు. మాచర్లలోనే 5 హత్యలు జరిగాయి. కొన్ని కుటుంబాలు ఆత్మకూరు, మాచర్లను వదిలి వెళ్లాయి. జల్లయ్య మృతదేహం చూసేందుకు కూడా వెళ్లనివ్వరా ?. పోలీసులు కూడా జైలుకు పోయే పరిస్థితి వస్తుంది. వైకాపా పాలనలో మహిళలపై ఆగడాలు పెరిగాయి. పల్నాడులో వరుస హత్యలు పోలీసులకు పట్టవా. నేరస్థులకు వంత పాడుతున్నందుకు పోలీసులు సిగ్గుపడాలి. తప్పు చేసిన పోలీసులకు శిక్ష తప్పదు, జైలుకెళ్లే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ నిర్వాకం వల్లే పదోతరగతి విద్యార్థుల ఆత్మహత్యలు." - చంద్రబాబు, తెదేపా అధినేత

ముందునుంచి చెబుతూనే ఉన్నాం: వివేకా హత్య కేసులో సానుభూతి పొందాలని చూశారని చంద్రబాబు ఆక్షేపించారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరిని చంపేస్తామని బెదిరిస్తున్నారన్నారు. కడప నుంచి వెళ్లకుంటే బాంబులు వేస్తామని సీబీఐ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. వీళ్లు కరడుగట్టిన నేరస్థులని.. గతంలోనూ ఎన్నో నేరాలు చేశారన్నారు. వివేకా హత్య కేసు.. సీబీఐ విశ్వసనీయతకు పెనుసవాలని అన్నారు. సీబీఐకే సమర్థత లేకపోతే ఈ దేశాన్ని ఎవరు కాపాడతారు ? అని చంద్రబాబు ప్రశ్నించారు.

"వివేకా హత్య కేసు సంబంధీకులు ఒక్కొక్కరు చనిపోతున్నారు. శ్రీనివాస్‌రెడ్డి, గంగిరెడ్డి, గంగాధరరెడ్డి వరుస మరణాల సంగతేంటి ?. వివేకా హత్య కేసు సంబంధీకులను చంపేస్తారని చెబుతూనే ఉన్నాం. వివేకా హత్య కేసులో మేం చెప్పినట్లే జరుగుతోంది. కరడుగట్టిన నేరగాళ్లు వీళ్లు.. పరిటాల విషయంలో ఇలాగే చేశారు. జగన్ అవినీతిపై సీబీఐ ఛార్జ్‌షీట్ వేసినా ఏం చేయలేకపోయింది. నేరగాళ్ల నుంచి సీబీఐ లాంటి సంస్థలు కాపాడకపోతే ఎలా ?. అనంతబాబు చేసిన హత్య నుంచి దృష్టి మళ్లించేందుకే కోనసీమ అల్లర్లు. కోనసీమలో ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెడుతున్నారు." - చంద్రబాబు, తెదేపా అధినేత

అవే చివరి ఎన్నికలు: జగన్ 175 గెలవడం మాట అటుంచితే.. వచ్చే ఎన్నికలే వైకాపాకి చివరి ఎన్నికలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఉండే అర్హత కూడా జగన్​కు లేదని అన్నారు. రాజ్యాంగ ఉల్లంఘన చేసిన కారణంగానే రాజకీయాల్లో ఉండే అర్హతను జగన్ కోల్పోయారన్నారు. పథకాలకు 300 యూనిట్లు నిబంధన, మూడు రాజధానులు అని ముందే చెప్పి ఉంటే ప్రజలు అప్పుడే తాట తీసేవారన్నారు. వ్యవసాయాన్ని నాశనం చేశారు కాబట్టే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారని చెప్పారు. జగన్​ది ఐరన్ లెగ్ అన్న చంద్రబాబు.., వ్యవస్థలను ధ్వంసం చేశారు కాబట్టే అరిష్టం పట్టిందన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన పిల్లలకు భరోసానిస్తూ..మీటింగ్ పెడితే దొంగల్లా దూరారని, దాన్ని ఏ2 సమర్థిస్తాడా ? అంటూ మండిపడ్డారు. ఏ2 విజయసాయి రెడ్డికి ఎవ్వరూ భయపడరని..,'వస్తానంటే రమ్మనండి.. చూద్దాం' అని సవాల్‌ చేశారు. వ్యవస్థలను నాశనం చేసి రౌడీయిజం చేయాలనుకుంటారా ? అంటూ దుయ్యబట్టారు.

వారే బలవుతారు: మంగళగిరిలో అన్న క్యాంటీన్ పడగొట్టడంపై చంద్రబాబు ధ్వజమెత్తారు. స్వచ్ఛంధంగా భోజనం పెట్టే వారిని అరెస్ట్ చేస్తారా ? అంటూ మండిపడ్డారు. ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్​మెంట్, అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అంటూ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎవరో ఒకర్ని తీసుకువచ్చి చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్న పేర్లు చెప్పమని ఒత్తిడి చేస్తారా? అని నిలదీశారు. పోలీసులు రాజకీయాలు చేయటం మొదలు పెడితే వారే బలవుతారన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం వ్యవహరించే వారిని ఎదిరించే శక్తి తెదేపాకు ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి

Last Updated :Jun 10, 2022, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.