పోలీసులు వైకాపా కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు : చంద్రబాబు

author img

By

Published : Jun 24, 2022, 12:12 PM IST

Updated : Jun 24, 2022, 12:52 PM IST

cbn

CBN ON EX MAYOR ATTACK: చిత్తూరు మాజీ మేయర్‌ కఠారి హేమలత మీదకు పోలీసు జీపు ఎక్కించడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. ఇది ప్రభుత్వం చేయించిన దౌర్జన్యకాండని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా కార్యకర్తల్లా మారి తప్పులు చేస్తున్న పోలీసులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

CBN ON EX MAYOR ATTACK: చిత్తూరు మాజీ మేయర్‌ కఠారి హేమలత మీదకు పోలీసు జీపు ఎక్కించడానికి ఎంత ధైర్యమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎవరి అండ చూసుకుని ఇలా రాక్షసంగా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ఇది ప్రభుత్వం చేయించిన దౌర్జన్యకాండని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా కార్యకర్తల్లా మారి తప్పులు చేస్తున్న పోలీసులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పార్టీ తరపున న్యాయ పోరాటం చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక గాడి తప్పిన ప్రతి అధికారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జగన్ దయా దాక్షిణ్యాల కోసం కొందరు పోలీసులు దిగజారి పోయారని మండిపడ్డారు. చిత్తూరులో మేయర్ దంపతుల హత్య కేసులో సాక్షులను వేధించి.. అక్రమ కేసులు పెట్టడంలో అర్థం ఏంటని నిలదీశారు. పోలీసులే పూర్ణ ఇంట్లో గంజాయి బస్తా పెట్టి కేసులు రాయడం దుర్మార్గమని విమర్శించారు.

అచ్చెన్నాయుడు: చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలతపై పోలీసుల దుశ్చర్యను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. వైకాపా ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే చంపేందుకు కూడా వెనకాడటం లేదని ధ్వజమెత్తారు. అధికారపార్టీ అరాచకాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. మహిళను పోలీసులు జీపుతో తొక్కించారంటే రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. బాధితులపైనే తిరిగి కేసులు పెట్టి బెదిరించాలనుకోవడం దుర్మార్గమన్నారు. వైకాపా నేతలను ప్రసన్నం చేసుకునేందుకు పోలీసులు ఎంతకైనా దిగజారుతున్నారని మండిపడ్డారు. పోలీసుల భుజాలపై తుపాకీ పెట్టి తెదేపాని బెదిరించాలనుకోవడం సరికాదని హితవుపలికారు. ఘటనపై పోలీసు శాఖ స్పందించాలని డిమాండ్‌ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్లిన వారికి ఇబ్బందులు తప్పవని, చర్యకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు.

లోకేష్: మాజీ మేయర్‌ హేమలత పట్ల పోలీసుల తీరును నారా లోకేశ్‌ ఖండించారు. హత్య కేసులో సాక్షులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేయడమే నేరమా అని ప్రశ్నించారు. పోలీసులే పూర్ణ జేబులో గంజాయి పెట్టి అరెస్టు చేశారని.. పూర్ణ అరెస్టును నిలదీసిన హేమలత పైనుంచి జీపు పోనిస్తారా అని మండిపడ్డారు. మీరు పోలీసులా లేక.. జగన్‌ ప్రైవేట్‌ సైన్యమా అని నిలదీశారు.



ఇవీ చదవండి:

Last Updated :Jun 24, 2022, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.