ETV Bharat / city

రాష్ట్ర డిస్కంలను రెడ్‌ కేటగిరీలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం

author img

By

Published : Aug 15, 2022, 5:02 AM IST

రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు- డిస్కంలను... కేంద్ర ప్రభుత్వం రెడ్‌ కేటగిరీలో చేర్చింది. వివిధ ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకున్న విద్యుత్‌కు చెల్లించాల్సిన 11వేల 149 కోట్లు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంచడమే ఈ చర్యకు కారణమైంది.

రాష్ట్ర డిస్కంలను రెడ్‌ కేటగిరీలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్ర డిస్కంలను రెడ్‌ కేటగిరీలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం

రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలను (డిస్కంలు) కేంద్రం రెడ్‌ కేటగిరీలో చేర్చింది. వివిధ ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకున్న విద్యుత్‌కు చెల్లించాల్సిన రూ.11,149 కోట్లు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంచడమే దీనికి కారణం. ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకున్న విద్యుత్‌కు జరిపే చెల్లింపుల ఆధారంగా ఆయా రాష్ట్రాల డిస్కంల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నిర్వహిస్తున్న ‘ప్రాప్తి’ (పేమెంట్‌ ర్యాటిఫికేషన్‌ అండ్‌ ఎనాలసిస్‌ ఇన్‌ పవర్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ఫర్‌ బ్రింగింగ్‌ ట్రాన్స్‌పరెన్సీ ఇన్‌ ఇన్వాయిసింగ్‌ ఆఫ్‌ జనరేటర్స్‌) సంస్థ అంచనా వేస్తుంది. వాటి బకాయిల వ్యవధి ఆధారంగా రంగులతో సూచిస్తుంది.

వాయిదాల్లో చెల్లించే ప్రణాళిక: వివిధ ఉత్పత్తి సంస్థలకు 2022 జులై నాటికి ఉన్న రూ. 11,149 కోట్ల బకాయిలను వాయిదాల్లో చెల్లించాలని డిస్కంలు నిర్ణయించాయి. దేశంలో అత్యధిక బకాయిలు ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత మన రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకున్న విద్యుత్‌కు అయ్యే మొత్తాన్ని 45 రోజుల్లోగా డిస్కంలు చెల్లించాలి. అలా చెల్లించక పోవడంతో వాటికి బకాయిలు పెరిగిపోయాయి. వీటిలో 180 రోజులకు మించి ఉన్న బకాయిలు సుమారు 3,500 కోట్ల వరకు ఉన్నాయి. దీర్ఘకాలం బకాయిలు పెండింగ్‌లో ఉండటం డిస్కంల రేటింగ్‌పై ప్రభావం చూపుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని లేట్‌ పేమెంట్‌ స్కీం (ఎల్‌పీఎస్‌) కింద బకాయిల భారాన్ని వదిలించుకోవాలని డిస్కంలు భావిస్తున్నాయి.

ఒకేసారి ఆర్థిక భారం కష్టం: 2022 జులై నాటికి వివిధ ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకున్న విద్యుత్‌కు రూ. 18,149 కోట్లను డిస్కంలు చెల్లించాల్సి ఉంది. ఇందులో పునరుత్పాదక ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన రూ. 7,000 కోట్లను ఎల్‌పీఎస్‌ కింద ఇచ్చేలా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాయి. మిగిలిన మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం డిస్కంలకు సాధ్యమయ్యే పరిస్థితి లేదు. బయటి నుంచి అప్పులు తేవడానికి డిస్కంల పరపతి సరిపోవడం లేదు. దీంతో కొత్తగా అప్పులు పుట్టే అవకాశం కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అప్పుల భారాన్ని తగ్గించుకోడానికి వాయిదాల్లో చెల్లించేలా ఉత్పత్తి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక అధికారి తెలిపారు.

.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.