ETV Bharat / city

రాజధాని అమరావతిని కదిలించే శక్తి ఎవరికీ లేదు: భాజపా నేత సత్యకుమార్

author img

By

Published : Mar 27, 2022, 8:59 PM IST

రాజధాని అమరావతిని కదిలించే శక్తి ఎవరికీ లేదు
రాజధాని అమరావతిని కదిలించే శక్తి ఎవరికీ లేదు

ముఖ్యమంత్రి జగన్​కు.. అభివృద్ధి వికేంద్రీకరణకు, పరిపాలన వికేంద్రీకరణకు మధ్య తేడా తెలియదని భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ ఎద్దేవా చేశారు. అమరావతి నుంచి రాజధానిని కదిలించే శక్తి ఎవరికీ లేదని.. రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

అమరావతి నుంచి రాజధానిని కదిలించే శక్తి ఎవరికీ లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌ అన్నారు. రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. లైవ్ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అమరావతి రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం 18 మంత్రిత్వశాఖలకు చెందిన 40 విభాగాల ఏర్పాటు కోసం భూములు కొనుగోలు చేసిందని సత్య కుమార్ స్పష్టం చేశారు. తమ కార్యక్రమాలను సాధ్యమైనంత త్వరగా అమరావతి నుంచి ప్రారంభించేలా భాజపా ప్రతినిధుల బృందంతో కలిసి దిల్లీలో ఆయా శాఖల మంత్రులను కలిసి తనవంతుగా తగిన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.

జగన్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో అధ్వాన్నమైన పరిపాలన అందించారని సత్య కుమార్ మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని.. పుట్టబోయే బిడ్డమీద కూడా అప్పు భారం ఉందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు, పరిపాలన వికేంద్రీకరణకు మధ్య తేడా ముఖ్యమంత్రి జగన్​కు తెలియదన్నారు. తన వ్యక్తిగత కక్ష కోసం రాజధాని మార్పు చేస్తాననటం సరైంది కాదని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేటాయించిన రూ.7 వేల కోట్ల నిధులను సీఎం జగన్ మింగేశారని ఆరోపించారు. భాజపా ఉత్తరప్రదేశ్‌ సహ ఇంఛార్జిగా ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయంలో సత్యకుమార్‌ చురుకైన పాత్ర పోషించారని కార్యక్రమంలో పాల్గొన్న భాజపా నేతలు, ఇతర ప్రముఖులు ప్రశంసించారు.

ఇదీ చదవండి: తెదేపా ఆరోపణలు ఖండిస్తున్నాం.. రూ.48 వేల కోట్ల లెక్కలు ఇవీ : బుగ్గన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.