ETV Bharat / city

Bangladeshis arrested చోరీలకు పాల్పడుతున్న బంగ్లాదేశీయులు అరెస్ట్​, ఎక్కడంటే

author img

By

Published : Aug 27, 2022, 4:30 PM IST

Bangladeshis arrested బంగ్లాదేశ్‌లో ట్రక్కు డ్రైవర్లు, టీ దుకాణదారులుగా జీవిస్తూ భారత్‌లో చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు ముఠా సభ్యులను గన్నవరం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో ఎస్పీ జాషువా నిందితుల వివరాలను వెల్లడించారు.

Bangladeshis arrested
బంగ్లాదేశీయులు అరెస్ట్

Bangladeshis arrested భారత్‌లో చోరీలకు పాల్పడుతున్న బంగ్లాదేశ్​కు చెందిన ఏడుగురు ముఠా సభ్యులను గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్‌లోని ఖుల్నా రాష్ట్రం భాగర్‌ జిల్లాకు చెందిన షేక్‌ నదీమ్‌ఖాన్‌, ఎమ్‌డీ జహంగీర్‌, రండా సైమన్‌, అమర్‌గాసియా బాద్‌షా, శరణ్‌సింగ్‌ సుమన్‌, రండా కోకోన్‌ముల్లా, రఫీక్‌ ట్రక్కు డ్రైవర్లుగా, టీ దుకాణదారులుగా జీవనం సాగిస్తుంటారు. వీరికి సుమారు 30-35 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుంది. వీరందరూ ముఠాగా ఏర్పడి వివిధ మార్గాల్లో భారత్‌లోకి ప్రవేశించి బ్యాంకు ఏటీఎంల్లో చోరీలకు పాల్పడుతున్నారు. వీరికి కోల్‌కతాకు చెందిన రాజు అనే వ్యక్తి తోడయ్యారు. రండా సైమన్‌ నేతృత్వంలో ఈ ముఠా ఏటీఎంలో చోరీలకు పాల్పడటం, ఆ డబ్బుతో బంగారం కొనుగోలు చేసి తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లి పోతుంటారు. ఇప్పటివరకు దిల్లీ, ఒడిశాలోని భువనేశ్వర్‌, బెంగళూరులోని మదనాయనహళ్లి, గోవాలో చోరీలు చేశారు. గత ఏప్రిల్‌ నెలలో భువనేశ్వర్‌లో ఏటీఎంలో దొంగతనం చేసి రూ.9 లక్షలతో పరారవడంతో ఒడిశా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బెంగళూరు జిల్లా మదనాయనహళ్లిలో మరో రూ.12 లక్షలు చోరీకి పాల్పడ్డారన్న సమాచారంతో గాలింపు చేపట్టిన ఒడిశా పోలీసులు మదనాయనహళ్లిలో నిందితులు రండా కోకోన్‌ముల్లా, కోల్‌కతాకు చెందిన రాజును అదుపులో తీసుకున్నారు. మిగిలిన ఆరుగురు తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లారు. వారిలో రాఫిక్‌ అక్కడే నిలిచిపోగా సహీన్‌ అనే కొత్త వ్యక్తిని చేర్చుకున్నారు. ఈ నెల 10న ఏడుగురు విజయవాడ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. నగర పరిసరాల్లో రెక్కీ నిర్వహించిన ముఠా స్వాతంత్య్ర దినోత్సవ నేపథ్యంలో పోలీసుల గస్తీ ఎక్కువగా ఉండటంతో 14న గోవా బయలుదేరి వెళ్లారు. అక్కడ మరో రూ.15 లక్షలు ఏటీఎంలలో చోరీ చేసి, 19న విజయవాడ చేరుకొని అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసి 21న గన్నవరం చేరుకున్నారు.

ఇదిలా ఉండగా గన్నవరం దుర్గా ట్రేడర్స్‌ యజమాని తన ట్రక్కు చోరీకి గురైనట్లు 21న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసుల్లో బీట్‌ కానిస్టేబుల్‌ మణీంద్రకుమార్‌ సినిమా హాళ్ల కూడలి సమీపంలో ఓ ట్రక్కు ఉండటాన్ని గమనించారు. అప్పటికే అక్కడికి దగ్గరలోని ఎస్‌బీఐ ఏటీఎంలో ముఠా సభ్యులు చోరీకి పాల్పడేందుకు యత్నిస్తుండటం చూశారు. అక్కడికి వెళుతుండగా బయట నిల్చొన్న వ్యక్తి అప్రమత్తం చేయడంతో అందరూ కలిసి పొట్లూరి హోటల్‌ మీదుగా శ్రీనగర్‌ కాలనీ వైపునకు పరుగులు తీశారు. వెంబడించిన మణీంద్ర ముఠాలోని మహ్మద్‌ నదీమ్‌ఖాన్‌ అనే వ్యక్తిని పట్టుకున్నారు. అతను మణీంద్ర చేతిని కొరకడంతో పాటు చితకబాదినా వదల్లేదు. అనంతరం సమాచారం అందుకున్న స్టేషన్‌ సిబ్బంది నిందితుడిని అదుపులో తీసుకున్నారు. మిగిలిన ఐదుగురిలో గస్తీ పోలీసులు మహమ్మద్‌ జహంగీర్‌ అనే మరో నిందితుడిని కొత్తపేట వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.1.03 లక్షల నగదు, హెచ్‌ఎంటీ గడియారం, రూ.3.20 లక్షల విలువచేసే ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులకు అభినందనలు: గన్నవరం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారని ఎస్పీ జాషువా ప్రశంసించారు. ప్రాణాలకు తెగించి పోరాడిన మణీంద్రకుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. డీఎస్పీ విజయపాల్‌ బృందం సేవలను ఎస్పీ కొనియాడారు. హోంగార్డు నాగరాజు, కానిస్టేబుళ్లు వీరయ్య, సురేష్‌, ఎస్సైలు శ్రీనివాస్‌, రమేష్‌, సీఐ శివాజీకి రివార్డులు అందజేశారు.

అనుమానం రాకుండా పథకం.. ముఠా ఎక్కడికి వెళ్లినా తొలుత ఓ ఆటో, ట్రక్కుని చోరీ చేస్తారు. స్థానికంగానే ఏటీఎమ్‌ను బద్ధలు కొట్టేందుకు ఇనుప సామగ్రి కొనుగోలు చేస్తారు. ఏటీఎంలోకి ప్రవేశించిన తర్వాత తొలుత సెన్సార్‌ వైర్లు, సీసీ కెమెరా, ఇతర వైర్లను కట్‌ చేస్తారు. తర్వాత చోరీకి పాల్పడిన సొమ్ముతో వెంట తెచ్చుకున్న ట్రక్కు, ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లిపోయి పంచుకుంటారు. ఇప్పటివరకు ఇదే తరహాలోనే ముఠా చోరీలు చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.