ETV Bharat / city

ఉప్పొంగుతున్న నదులు, కాలువలు.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

author img

By

Published : Jul 13, 2022, 4:36 AM IST

రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఒడిశా తీరప్రాంతం, పరిసరాల్లో అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముసురు వాతావరణం వీడలేదు. మంగళవారం ఉదయంనుంచి కోస్తాలో చెదురుమదురు జల్లులు పడ్డాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

ఉప్పొంగుతున్న నదులు, కాలువలు
ఉప్పొంగుతున్న నదులు, కాలువలు

అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం వద్ద గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం ఉదయంనుంచి సాయంత్రం వరకు రెండడుగుల నీటిమట్టం పెరిగింది. దేవీపట్నం-తొయ్యేరు మధ్య ఇళ్లన్నీ నీట మునిగాయి. ఎత్తయిన భవనాలపైకి వరద చేరింది. ఎగువ కాఫర్‌డ్యాం వద్ద గోదావరిలో భారీగా వరద చేరడంతో నది పరవళ్లు తొక్కుతోంది. పి.గొందూరు గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. కొండమొదలు పంచాయతీ గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. గ్రామాలను వరద ముంచెత్తడంతో మూగజీవాలు ఎక్కడికెళ్లాయో తెలియక పాడి రైతులు బోరుమంటున్నారు. జిల్లాలోని విలీన మండలాలను వరద వీడలేదు. బాధితులు పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు కూడా వీలు పడటం లేదు.చింతూరు-వరరామచంద్రాపురం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిపై వరద చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచాయి. భద్రాచలం వద్ద నీటిమట్టాన్ని దాటి వరద కూనవరంలోకి ప్రవేశించడంతో ఇళ్లు మునిగాయి.

ముంపు గ్రామమైన సీతారామనగరం నుంచి కుక్కునూరులో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష కేంద్రానికి బయలుదేరిన ముగ్గురు విద్యార్థులు వరద వల్ల చివరకు పరీక్ష కేంద్రానికి చేరుకోలేకపోయారు. కోతులగుట్టలోని పదో తరగతి పరీక్ష కేంద్రానికి విద్యార్థులను అధికారులు పడవలపై తరలించారు. వరరామచంద్రాపురం మండలంలోని ఏడు పంచాయతీల్లో 25 గ్రామాలు మునిగాయి. ఎటపాక మండలంలోని కన్నాయిగూడెం వద్ద ప్రధాన రహదారిపై వరద ఉండటంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచాయి. ధవళేశ్వరం వద్ద మంగళవారం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు బ్యారేజి వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరింది. గోదావరి పరీవాహక ప్రాంతాలు నీట మునిగాయి. సాయంత్రం ఐదింటికి 14,21,487 క్యూసెక్కులను దిగువకు వదిలారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 14.60 అడుగులకు చేరింది. రాత్రికి మరో మూడడుగులు పెరిగే అవకాశముంది.

నిరాశ్రయులైన 3000 కుటుంబాలు: ఏలూరు జిల్లాలోని విలీన మండలాల్లో మంగళవారం సాయంత్రం వరకు గోదావరి వరద పెరుగుతూనే ఉంది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో అధికారికంగానే 3000 కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయి. సమీపంలోని గుట్టలపైకి చేరిన కుటుంబాలు మరికొన్ని ఉన్నాయి. చాలా కుటుంబాలు పోలవరం పునరావాస కాలనీలకు చేరుకున్నాయి. కుకునూరు-భద్రాచలం ప్రధాన రహదారి నీట మునిగింది. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. మండలంలోని వింజరం, ఎల్లప్పగూడెం వద్ద రహదారిపై ఐదడుగులకు పైగా నీరు చేరింది. సీతారామనగరం వెళ్లే రహదారి నీట మునిగింది. ముత్యాలంపాడు రహదారిపై 12 అడుగులకు పైగా నీరు నిలిచింది. కుక్కునూరు-దాచారంల మధ్య వరద సముద్రాన్ని తలపిస్తోంది.

  • భద్రాచలంలో నీటిమట్టం మంగళవారం సాయంత్రం ఆరింటికి 51.80 అడుగులు ఉంది. 24 గంటల్లో తగ్గింది రెండడుగులు మాత్రమే. మరోవైపు బుధవారం రాత్రి నుంచి వరద పెరగనుందనే సంకేతాలు అందుతున్నాయి.
  • పోలవరం స్పిల్‌వే వద్ద మంగళవారం సాయంత్రానికి 34.25 మీటర్లకు నీటిమట్టం పెరిగింది. 48గేట్ల నుంచి 12.37లక్షల క్యూసెక్కులు దిగువకు వెళుతోంది. ఇప్పటివరకు ఇదే అత్యధిక వరద. పోలవరం నుంచి ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలోని కడెమ్మ వంతెన వరదకు మునగడంతో అందులోనుంచే రాకపోకలు సాగిస్తున్నారు.
  • వర్షం పడుతుండగా విజయవాడ భానునగర్‌లో మోటార్‌ స్విచ్ఛాన్‌ చేయడానికి వెళ్లి విద్యుదాఘాతానికి గురైన దంపతులు గజ్జల మాలకొండయ్య (68), సుశీల (60) కన్నుమూశారు.
.

కృష్ణమ్మ, తుంగభద్ర పరుగులు: తెలుగు రాష్ట్రాల వైపు కృష్ణమ్మ పరుగు పెడుతోంది. ఆలమట్టి జలాశయానికి 1,04,853 క్యూసెక్కుల నీరు చేరుతోంది. జలాశయంనుంచి 56,936 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జలాశయాన్ని చేరే వరద పరిమాణం మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపుర జలాశయానికి ఇన్‌ఫ్లో 47,057 క్యూసెక్కులు ఉంది. నారాయణపుర నుంచి మంగళవారం రాత్రి ఏడింటికి 1,04,924 క్యూసెక్కులను జూరాలకు వదులుతున్నారు.

  • తుంగభద్ర పది గేట్లను మంగళవారం మధ్యాహ్నం అడుగు వరకు ఎత్తి సుమారు 14,650 క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తున్నారు. ఎగువనుంచి 70 వేల క్యూసెక్కులు వస్తున్నాయి. జలాశయంలో 96 టీఎంసీలను నిల్వ చేసి మిగిలిన జలాలను వదులుతున్నారు. బుధవారానికి మరో పది గేట్లను ఎత్తి 50 వేల క్యూసెక్కుల వరకు వదిలే అవకాశముంది.
  • శ్రీశైలానికి వరద ప్రవాహం పెరిగింది. జలాశయ నీటిమట్టం 824.50 అడుగులు, నీటినిల్వ 44.3482 క్యూసెక్కులుగా నమోదైంది.

ఉత్తర కోస్తాలో నేడు భారీ వర్షాలు: మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 10 గంటల మధ్య అత్యధికంగా పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురంలో 23.5, కారంపూడి మండలం శంకరాపురంలో 18.5 మి.మీ.వర్షపాతం నమోదైంది. బుధవారం ఉత్తరకోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని, చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలిపారు.

తెలంగాణలో నేడు, రేపు కుండపోత: తెలంగాణలో కుంభవృష్టి వానలు ఆగలేదు. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో సైతం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు 50 ప్రాంతాల్లో ఒక్కోచోట 10 సెంటీమీటర్లకు పైగా వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకూ ముసురుపట్టి వర్షం కురుస్తూనే ఉండటంతో చలి వాతావరణమేర్పడింది.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.