ETV Bharat / city

పారిశ్రామిక ప్రమాదాలపై ఉదాసీనత.. కమిటీల ఆర్భాటం తప్ప, నివేదికల ఊసేది !

author img

By

Published : Aug 4, 2022, 7:24 AM IST

Industrial Accidents: పారిశ్రామిక ప్రమాదాలపై రాష్ట్ర ప్రభుత్వం పాఠాలు నేర్వడంలేదు. ప్రమాదం జరిగినప్పుడు విచారణ కమిటీల ఆర్భాటం తప్ప.. అనేక సందర్భాల్లో అసలు ఆ నివేదికల్నిబహిర్గతం చేయలేదు. మిగతాచోట్ల ప్రమాదాలకు ఆస్కారమివ్వకుండా తీసుకోవాల్సిన చర్యలు,.. సిఫార్సులను ఆచరణలో పెట్టడంలేదు. ఈ ఉదాసీన వైఖరే ఇబ్బందికరంగా మారుతోంది.

పారిశ్రామిక ప్రమాదాలపై ఉదాసీనత
పారిశ్రామిక ప్రమాదాలపై ఉదాసీనత

Industrial Accidents: అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్‌ వస్త్రపరిశ్రమలో జూన్‌ 3న విషవాయువులు లీకై 469 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదంపై అనకాపల్లి జేసీ కల్పనాకుమారి ఆధ్వర్యంలో ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. ఇప్పటివరకూ ప్రమాదానికి కారణాలేంటో బయటపెట్టలేదు. అదే పరిశ్రమలో మంగళవారం మరోమారు విషవాయువులు వెలువడ్డాయి. వాటిని పీల్చి దాదాపు 100 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. తొలి ప్రమాదం జరిగినప్పుడే కఠినచర్యలు తీసుకుంటే.. తాజా ప్రమాదానికి ఆస్కారం ఉండేది కాదన్నది నిర్వివాదం. ప్రభుత్వ పెద్దలకు రాజకీయంగా గిట్టని, ప్రత్యర్థులకు చెందిన పరిశ్రమలపైకి దూసుకుపోయే.. కాలుష్య నియంత్రణా మండలి ఇతరుల పారిశ్రామిక ప్రమాదాల నియంత్రణలో నామమాత్రంగానైనా స్పందించడంల లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదే పదే ప్రమాదాలకు కారణమవుతున్న పరిశ్రమలను గుర్తించటం.. విస్తృతంగా తనిఖీలు చేసి లోపాలు సరిచేయించటం వంటివి మొక్కుబడిగా మారుతున్నాయి. పరిశ్రమలపై ఫిర్యాదులున్నా పట్టించుకోవట్లేదు.

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ కర్మాగారం కన్సంట్‌ ఫర్‌ ఆపరేషన్‌ నిబంధనలు అమలు చేయట్లేదని,. అక్కడి నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలతో తమ ప్రాణాలు పోతున్నాయని ప్రజలు పీసీబీకి ఫిర్యాదుచేసినా చర్యలు తీసుకోలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారీ ప్రమాదం జరిగి ఆరుగురు కార్మికులు మరణించారు. ప్రభుత్వం తీరికగా అప్పుడు మూసివేతకు క్లోజర్‌ ఆర్డర్‌ ఇచ్చింది. విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటన తర్వాత రెడ్‌ కేటగిరీ పరిశ్రమల్లో భద్రతపై ప్రభుత్వం సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించింది. భద్రత విధానాలు, హానికర రసాయనాలు వినియోగించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అమలవుతున్నాయో.. లేదో పరిశీలించామని పేర్కొంది. తగిన చర్యలు కొరవడటంతో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. పర్యావరణ అనుమతి పొందిన పరిశ్రమలు, కంపెనీలు అందులోని నిబంధనలు పాటిస్తున్నాయా ? లేదా ? అనే వాటిపై పర్యవేక్షణ ఉండట్లేదు.

ప్రమాదాల దర్యాప్తు కోసం ఏర్పాటు చేస్తున్న విచారణ కమిటీల దర్యాప్తులోనూ శాస్త్రీయత కొరవడుతోంది. ప్రమాదాలు జరిగితే ప్రాథమిక దశలో నియంత్రణపై ఉద్యోగులకు అవగాహన ఉండట్లేదు. ఏటా భద్రత, పర్యావరణ ఆడిట్‌లు తప్పనిసరిగా నిర్వహించి గుర్తించిన లోపాల్ని సరిచేయాలని ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాదంపై ఏర్పాటైన కమిటీ సూచించింది. కానీ అది జరగడం లేదు. కొన్ని పరిశ్రమలు ఖర్చుకు వెరసి సేఫ్టీ అధికారుల్ని పెట్టుకోవట్లేదు. దీంతో చిన్న చిన్న లోపాల్ని గుర్తించలేక, అవి పెద్ద ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ప్రమాదంలో.. ప్రాణనష్టం సంభవిస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉండట్లేదు. దీంతో ఏం జరిగినా తమకేం కాదులే అనే ధోరణి కనిపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేస్తున్నా వాటిపైనా తదుపరి చర్యలు ఉండట్లేదు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.