ETV Bharat / city

TTD Go Maha Sammelanam: గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు కొనేందుకు తితిదే సిద్ధం

author img

By

Published : Oct 31, 2021, 7:34 PM IST

TTD Go Maha Sammelanam
జాతీయ గో మహా సమ్మేళనం

ఈనెల 30, 31 తేదీల్లో తిరుపతిలో జాతీయ గో మహా సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిరోజైన శనివారంనాడు గోవు గొప్పతనం, ప్రకృతి వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యత తెలిపేలా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రకృతి వ్యవసాయవేత్తలతో పాటు గోశాలల నిర్వాహకులు పాల్గొన్నారు.

జాతీయ గో మహా సమ్మేళనం

ఈనెల 30, 31 తేదీల్లో తిరుపతిలో జాతీయ గో మహా సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిరోజైన శనివారం నాడు గోవు గొప్పతనం, ప్రకృతి వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యత తెలిపేలా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రకృతి వ్యవసాయవేత్తలతో పాటు గోశాలల నిర్వాహకులు పాల్గొన్నారు. తెలుగురాష్ట్రాల్లోని వేయి మంది రైతులతో ఈ కార్యక్రమాన్ని తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నిర్వహించారు. 24 పంచగవ్య ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ రైతులను ఆకట్టుకున్నాయి.

దేశం ఆర్థికంగా, ధార్మికంగా, ఆరోగ్యపరంగా పటిష్టమవడానికి గోసంరక్షణే ఏకైక మార్గమ‌ని పలువురు నిపుణులు ఆభిప్రాయపడ్డారు. గోవులను పూజించడం, సంరక్షించడం మనందరి కర్తవ్యమ‌ని తెలిపారు.. ర‌సాయ‌న ఎరువుల‌తో పండించిన ఆహార ప‌దార్థాలతో అనారోగ్య స‌మ‌స్యలు అధికంగా వ‌స్తున్నాయ‌న్నారు. ప్రకృతి వ్యవ‌సాయంతో పండించిన పంట‌ల ద్వారానే ఆరోగ్యక‌ర‌మైన స‌మాజం త‌యార‌వుతుంద‌ని తెలిపారు.

గో ఆధారిత వ్యవసాయ ప్రాధాన్యతలపై అవగాహనే లక్ష్యంగా...

తిరుపతి మహతి కళాక్షేత్రంలో జరుగుతున్న జాతీయ గో మహా సమ్మేళనానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేయి మంది రైతులు హాజరయ్యారు. తొలిరోజు గో ప్రాధాన్యత, ప్రకృతి వ్యవసాయంతో ఉన్న లాభాలను వివరించారు. గో ఆధారిత వ్యవసాయంలో కలిగే ప్రయోజనాలు, రసాయన ఎరువుల వాడకంలో కలిగే అనర్థాలను వివరించారు. ‌ గో ఆధారిత ప్రకృతి వ్యవ‌సాయం చేసే రైతులకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అండ‌గా ఉంటుంద‌ని ముఖ్య అతిథిగా హాజరైన తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. పండించిన ఉత్పత్తుల‌ను గిట్టుబాటు ధ‌ర క‌ల్పించి కొనుగోలు చేస్తామ‌న్నారు. నేల‌త‌ల్లిని కాపాడుతూ ప్రపంచానికి ఆరోగ్యక‌ర‌మైన ఆహారం అందించే దిశ‌గా రైతుల‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి.

" గో ఆధారిత ప్రకృతి వ్యవ‌సాయం చేసే రైతులకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అండ‌గా ఉంటుంది. ప్రపంచానికి ఆరోగ్యక‌ర‌మైన ఆహారం అందించే దిశ‌గా రైతుల‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. " - వైవి సుబ్బారెడ్డి, తితిదే ఛైర్మన్‌.

గో మూత్రం, గో మ‌యంతో వ్యవ‌సాయం చేయ‌డం వ‌ల‌న భూసారం పెరిగి అధిక దిగుబ‌డి వ‌స్తాయని తితిదే ఈఓ జవహర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ర‌సాయ‌న ఎరువులు, మందులు వాడ‌టం వ‌ల‌న భూసారం త‌గ్గి బీడు భూములుగా మారే ప్రమాదం ఉందని సమ్మేళనంలో పాల్గొన్న వక్తలు వివరించారు. ప్రముఖ ప్రకృతి వ్యవ‌సాయ శాస్త్రవేత్త సుభాష్ పాలెక‌ర్ ప్రతి పాదించిన ప్రకృతి వ్యవసాయం ద్వారా అధిక లాభాలు గడించవచ్చని పేర్కొన్నారు. తితిదే గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని, ఇందుకు సంబంధించి రైతు సాధికార సమితితో తితిదే ఒప్పందం కుదుర్చుకొందని ఈఓ తెలిపారు. గోశాల నిర్వాహకులతో సమావేశం నిర్వహిస్తామని జవహర్ రెడ్డి అన్నారు.

" గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు తితిదే సిద్ధంగా ఉంది.. ఇందుకు సంబంధించి రైతు సాధికార సమితితో తితిదే ఒప్పందం కుదుర్చుకొంది. " -జవహర్ రెడ్డి, తితిదే ఈఓ

సేంద్రియ వ్యవ‌సాయ ప‌ద్ధతులు, వాన‌పాములు, జీవామృతం, పంచ‌గ‌వ్యాల‌తో వ్యవ‌సాయం చేయ‌డం వ‌ల‌న క‌లిగే ప్రయోజ‌నాల‌ను ప్రకృతి వ్యవసాయ నిపుణులు వివ‌రించారు. మహతి కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గో ఆధారిత పంచగవ్య ఉత్పత్తుల స్టాల్స్ రైతుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి.

ఇదీ చదవండి : YV SubbaReddy: కుర్చీ లేకపోతే చంద్రబాబు ఉండలేకపోతున్నారు: వైవీ సుబ్బారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.