ETV Bharat / city

పోలీసులతో వైకాపా హింసా రాజకీయాలు చేస్తోంది.. డీజీపీకి చంద్రబాబు లేఖ

author img

By

Published : Sep 4, 2022, 9:43 AM IST

Updated : Sep 19, 2022, 1:58 PM IST

CBN letter to DGP వైకాపాతో కుమ్మక్కైన పోలీసులకు.. కుప్పం నియోజకవరంలో పరిస్థితులు చిన్న విషయంలా కన్పిస్తున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా ఫిర్యాదుల్ని తీసుకుని తెదేపా మద్దతుదారులపై 307 వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు పెట్టారని తెలిపారు. కొంతకాలంగా వైకాపా నేతలు తమకు అనుకూల పోలీసు అధికారుల మద్దతుతో హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

letter to DGP on Kuppam incident
తెదేపా నేతలపై మాత్రమే కేసులా ? చంద్రబాబు

TDP National President Chnadrababu Naidu: వైకాపాతో కుమ్మక్కైన పోలీసులకు.. కుప్పం నియోజకవరంలో పరిస్థితులు చిన్న విషయంలా కన్పిస్తున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై అధికార వైకాపా గూండాలు, పోలీసులే దాడి చేసినా.. అక్కడ శాంతిభద్రతలు బాగానే ఉన్నాయని, జరిగినవి సాధారణ ఘటనలేనని డీజీపీ ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కుప్పం నియోజకవరంలో హింసా రాజకీయాలు, తెదేపా నేతలపై దాడులు, వేధింపులు, అక్రమ కేసులను వివరిస్తూ డీజీపికి లేఖ రాశారు.

తెదేపా మద్దతు దారులపై పోలీసులే అకారణంగా ఫిర్యాదులు చేస్తుంటే న్యాయం ఎక్కడుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలీసుల మధ్యన సివిల్‌ డ్రెస్‌లో ఉన్న ఒక వ్యక్తి తెదేపా మద్దతు దారులపై లాఠీ ఛార్జి చేసి తల పగలగొడితే మీకు చిన్న విషయంగా అనిపిస్తోందా.. అని లేఖ ద్వారా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని నిలదీశారు. తెదేపా వైపు నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని సెప్టెంబరు 2న తిరుపతిలో చేసిన ప్రకటన వాస్తవం కాదన్నారు. తెదేపా నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై స్థానిక పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని మండిపడ్డారు. వైకాపా ఫిర్యాదుల్ని తీసుకుని తెదేపా మద్దతుదారులపై 307 వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. బాధితులిచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయకపోవటం డీజీపీకి తీవ్రమైన సమస్య కాకపోవచ్చు కానీ, అక్కడ గాయపడిన లోకేశ్‌ జీవించే హక్కుకు భంగం కలిగించే తీవ్రమైన సమస్యేనని స్పష్టం చేశారు.

శాంతి భద్రతలను కాపాడటానికి పోలీసులు నిష్పాక్షికంగా పనిచేయడం, చట్ట ప్రకారం తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించడం ముఖ్యమని గుర్తు చేశారు. ఇందుకు అనుగుణంగా పోలీసుశాఖ వ్యవహరించాలని హితవు పలికారు. కుప్పం నియోజకవర్గం నుంచి ఏడుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించానని చంద్రబాబు గుర్తుచేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదన్నారు. కొంతకాలంగా వైకాపా నేతలు తమకు అనుకూల పోలీసు అధికారుల మద్దతుతో హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

గత నెల 24 నుంచి 26 వరకు తాను కుప్పంలో పర్యటించిన సమయంలో.. బయటి వ్యక్తులను రప్పించి మరీ హింసాత్మక ఘటనలకు తెరలేపారని చంద్రబాబు విమర్శించారు. అయితే వారిపై చర్యలు తీసుకోకుండా.. అర్ధరాత్రి సమయంలో తెదేపా నాయకుల్ని అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో తాను పర్యటించే సమయంలో వైకాపా గూండాలను అనుమతించారని చంద్రబాబు లేఖలో మండిపడ్డారు. ఆగస్టు 24న సాయంత్రం 5.30 గంటలకు రామకుప్పం మండలం కొల్లుపల్లిలో వైకాపా గూండాలు గుమికూడి తన కాన్వాయ్‌ రాగానే తెదేపా కార్యకర్తలపై రాళ్లు రువ్వి, కర్రలతో వెంబడించి దాడి చేశారని పేర్కొన్నారు. తర్వాత రోజు పక్కా ప్రణాళికతో వచ్చి.. పోలీసుల పర్యవేక్షణలోనే అన్న క్యాంటీన్, పరిసర ప్రాంతాలను ధ్వంసం చేశారని వివరించారు.

ఆగస్టు 29న సోమవారం అర్ధరాత్రి కుప్పం బస్టాండ్‌ సర్కిల్‌ సమీపంలోని అన్నా క్యాంటీన్‌పై పలువురు వైకాపా గూండాలు దాడి చేసి కూల్చివేశారనీ...., పోలీస్‌స్టేషన్‌కు అత్యంత సమీపంలోనే ఇది జరిగిందని గుర్తు చేశారు. దీనిపై అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటాన్ని తప్పుబట్టారు. రూరల్‌ ఎలక్ట్రిక్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌(రెస్కో) ఛైర్‌పర్సన్‌ జీఎస్‌ సెంథిల్‌ కుమార్‌ అక్టోబరు 2021న నా వాహనంపై బాంబులేస్తానని బహిరంగంగా ప్రకటించారని చంద్రబాబు లేఖలో వివరించారు. అవమానకర వ్యాఖ్యలతో దుర్భాషలాడినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

2021 కుప్పం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో అధికార వైకాపా గూండాలు హింసకు పాల్పడ్డారని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో వైకాపా.. కిడ్నాప్, బెదిరింపులు, భౌతికదాడులు, వేధింపులకు పాల్పడినా పోలీసులు వైకాపా గూండాల పక్షాన నిలిచి.. తెదేపా నేతలు, కార్యకర్తలు, పోటీలో ఉన్న అభ్యర్ధుల రక్షణను వదిలేశారని దుయ్యబట్టారు. వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై ఆగస్టు 6న తెదేపా మద్దతుదారులు ఆందోళన చేస్తుండగా.. ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ వ్యవహరించిన తీరు మరింత దారుణమని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకోవడమే కాకుండా.. దేశం మొత్తం కాల్చివేయాలంటూ గోరంట్ల మాధవ్‌కు మద్దతుగా సీఐ ప్రకటనలు చేశారని వివరించారు

ఇవీ చదవండి

Last Updated : Sep 19, 2022, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.