ETV Bharat / city

రాష్ట్రంలో ఎడతెరపి లేని వర్షాలు.. నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు.. ఉద్ధృతంగా వాగులు, వంకలు

author img

By

Published : Oct 13, 2022, 10:19 AM IST

Updated : Oct 13, 2022, 1:28 PM IST

Rains
రాష్ట్రంలో భారీ వర్షాలు

తిరోగమన రుతు పవనాల కారణంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నదులు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు, చెట్లు నేలకూలాయి.

రాష్ట్రంలో ఎడతెరపి లేని వర్షాలు..

అనంతపురంలో రాత్రి నుంచి ఎడతెరపి లేని వర్షం పడుతూనే ఉంది. నడిమివంక వాగుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. నడిమివంక పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత సుమారు వెయ్యిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బుక్కరాయసముద్రం వద్ద పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పండమేరు వాగు ఉద్ధృతికి అనంతపురం - తాడిపత్రి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహంలో వాహనాలు వెళ్లకుండా పోలీసులు నియంత్రించారు.

రాయదుర్గంలోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాయదుర్గంలో వరద ప్రవాహానికి కార్లు, ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. రాయదుర్గంలో రామస్వామినగర్‌, మధు టాకీస్‌ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. రాయదుర్గంలో ఇళ్లలోకి పెద్ద చేపలు కొట్టుకొచ్చాయి. కణేకల్ రోడ్డులో భారీ వృక్షం నేల వాలింది. గుత్తి, ఉరవకొండలో రాత్రి నుంచి ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది.

బొమ్మనహాల్ మండలంలో వేదవతి హగరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వేదవతి హగరి నది ఉద్ధృతికి కాలనీలు, పంటపొలాలు జలమయమయ్యాయి. ముంపు బాధితుల కోసం అనంతపురంలో 5 చోట్ల పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. బాధితులకు ఆర్డీటీ, ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్ సంస్థలు ఆహారాన్ని అందిస్తున్నాయి. పెద్దపప్పూరు మండలంలో వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాగల్లు జలాశయం 5 గేట్లు ఎత్తి 13 వేల క్యూసెక్కులు పెన్నానదికి విడుదల చేస్తున్నారు. చిత్రావతి జలాశయం 3 గేట్ల ద్వారా 3600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

అనంతపురం గ్రామీణం కాటిగానికాలవ గ్రామాన్ని వరద ముంచెత్తింది. కాటిగానికాలవ గ్రామంలోని చెరువుకు వరద పోటెత్తింది. దీంతో స్థానికుల భయాందోళన చెందుతున్నారు. గ్రామంలోని వరద నీటిని బయటకు తోడేందుకు యంత్రాలతో అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాటిగానికాలవ వరద ప్రవాహం అనంతపురంలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కురిసిన వర్షానికి కొట్నూరు చెరువు మరువ పారుతోంది. జిల్లాలో కురిసే వర్షాలతోపాటు... ఎగువ కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకి రోడ్లపై నుంచి నీరు ప్రవహిస్తోంది. హిందూపురం - అనంతపురం ప్రధాన రహదారిపై నుంచి వరద ప్రవహిస్తుడటంతో వాహదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలువురు నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోతుండగా స్థానికులు రక్షించారు. వాహన రాకపోకలను నిలిపేసి స్థానికులకు రక్షణ కల్పించాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.

కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాగుల ఉద్ధృతితో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. గోనెగండ్ల, దేవనకొండ మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆస్పరి, హాలహర్వి మండలాల్లో వాగులు పొంగుతున్నాయి. కర్నూలు జిల్లా గాజులదిన్నె ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. గాజులదిన్నె జలాశయం ఇన్‌ఫ్లో 20 వేల క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్‌ఫ్లో 16 వేల క్యూసెక్కులుగా ఉంది. గాజులదిన్నె ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. గోనెగండ్ల, కోడుమూరు మండలాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కల్లూరు, కర్నూలు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కర్నూలు జిల్లా ఆలూరులోనూ కుండపోత వర్షం కురుస్తోంది. వర్షాలకు హత్తిబెలగళ్‌ నుంచి అర్ధగేరికి వెళ్లే రహదారి తెగింది.

ఒకరు మృతి: కర్నూలు జిల్లా ఆదోని పట్టణం పరిషమల్లలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షానికి ఇల్లు కూలి ఫారిద్​ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

వైఎస్సార్‌ కడప జిల్లాలోని జమ్మలమడుగు, మైలవరం మండలాల్లో భారీ వర్షం కురిసింది. జమ్మలమడుగులో ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ కార్యాలయాలు నీటమునిగాయి. మైలవరం మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మైలవరం మండలంలోని పలు గ్రామాల్లో పత్తి, వరి, మినుము పంటలు నీటమునిగాయి.

ఇవీ చదవండి:

Last Updated :Oct 13, 2022, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.