ETV Bharat / city

బన్నీ ఉత్సవాలకు సిద్ధమైన దేవరగట్టు.. పోలీసుల భారీ బందోబస్తు

author img

By

Published : Oct 4, 2022, 3:26 PM IST

Updated : Oct 5, 2022, 6:51 AM IST

BUNNY FESTIVAL IN DEVARAGATTU : కర్నూలు జిల్లా దేవరగట్టు.. మరోసారి కర్రల సమరం బన్నీ ఉత్సవాలకు సిద్ధమైంది. అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగించేందుకు.. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బన్నీ ఉత్సవాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీ.. అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

KARRALA SMARAM
KARRALA SMARAM

Devaragattu Bunny festival : దసర పండుగ రాత్రి కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. ఈసారి కర్రల సమరం జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేసినా.. చుట్టుపక్కల గ్రామాల ప్రజల మాత్రం సంప్రదాయం ప్రకారమే పండుగ నిర్వహిస్తామని తేల్చి చెబుతున్నారు. హింసకు తావులేకుండా బన్ని ఉత్సవాన్ని నిర్వహించాలని అధికారులు సూచిస్తున్నారు.

దేవుడిని తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు పోటీపడుతూ నిర్వహించే కర్రల సమరానికి సమయం ఆసన్నమైంది. కర్నూలు జిల్లా దేవరగట్టులో వందల ఏళ్లుగా ఈ సంబరాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలూరు సమీపంలోని దేవరగట్టుపై ఉన్న మాల మల్లేశ్వరస్వామికి దసరా పర్వదినాన అర్థరాత్రి కల్యాణం నిర్వహిస్తారు. అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురు బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో విగ్రహాలను ఊరేగిస్తారు. ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం.. నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఓ వర్గంగా.. ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి ఉత్సవ విగ్రహాల ముందు కర్రలతో తలపడతారు. దీనినే బన్ని ఉత్సవంగా పిలుస్తారు. ఈ సమరాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు.

కర్రల సమరం సందర్భంగా ఏటా పదుల సంఖ్యలో భక్తులు గాయపడుతుంటారు. తీవ్రంగా రక్తమోడుతూ ఒక్కోసారి పరిస్థితి విషమించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని కొనసాగించి తీరతామని సమీప గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఇది సంబరమే గానీ సమరం కాదంటున్నారు.
హింసకు తావులేకుండా ఉత్సవాన్ని నిర్వహించుకోవాలని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు. ప్రత్యేకంగా వెయ్యిమందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. బన్ని ఉత్సవం సందర్భంగా ఏటా పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడుతూనే ఉన్నారు.

ఉత్సవాలకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఎస్పీ అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవాల రోజున వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఉత్సవాల ప్రాధాన్యం : దేవరగట్టులో కొలువైన మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో పూర్వం మనీ మళ్లాసుర అనే రాక్షసులు.. మునులు చేసే తపస్సు, యజ్ఞయాగాలకు విఘాతం కలిగించే వారు. అప్పుడు ఆ మునులు స్వామివారిని వేడుకొనగా.. ఆయన ప్రత్యక్షమై ఆ రాక్షసులను సంహరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారని ప్రాశస్త్యం. ఆ సమయంలో మని మల్లాసుర అనే రాక్షసులు స్వామివారి నుంచి ఒక వరం కోరారని.. ఏటా విజయదశమి బన్నీ జరిగే రోజున ఒక నరబలి కావాలని కోరగా అందుకు స్వామి వారు గురవయ్యని స్వామి ఏట ఒక పిడికెడు రక్తం దానం చేస్తారని చెప్పడంతో అందుకు రాక్షసులు అంగీకరిస్తారనేది నమ్మకం.

ఇవీ చదవండి:

Last Updated : Oct 5, 2022, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.