ETV Bharat / city

stick fight festival: దేవరగట్టు కర్రల సమరంలో మళ్లీ చిందిన రక్తం....

author img

By

Published : Oct 6, 2022, 7:52 AM IST

stick fight festival in Kurnool: కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవంలో ఈ ఏడాదీ హింస తప్పలేదు. కర్రల సమరంలో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఎప్పుడూ లేని విధంగా వేలాది మంది ప్రజలు బన్ని ఉత్సవాల్లో పాల్గొన్నారు. హింసను ఆపేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు పెద్దగా ఫలించకపోయినా ప్రాణ నష్టం లేకపోవడం ఊరటగా మారింది. కర్నాటకకు చెందిన ఓ బాలుడు దేవరగట్టు కర్రల సమరానికి వెళ్తూ మృతి చెందాడు.

tick fight festival
దేవరగట్టులో కర్రల సమరం

దేవరగట్టులో కర్రల సమరం
stick fight in Devaragattu: కర్నూలు జిల్లా దేవరగట్టులో ఏటా విజయ దశమి రోజు కర్రల సమరం జరగడం ఆనవాయితీగా వస్తోంది. హొళగుంద మండలం దేవరగట్టు సమీపంలో కొండపై వెలసిన మాళమ్మ, మల్లేశ్వరస్వామికి రాత్రి 12 గంటలకు కళ్యాణం జరిపించాల్సి ఉండగా.. వర్షం కారణంగా గంట ఆలస్యమైంది. జల్లులు కురుస్తున్నా.. కల్యాణం అనంతరం కర్రల సమరం నిర్వహించారు. కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాదాలగట్టు, రక్షపడ, శమీ వృక్షం, ఎదురుబసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.

ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం నెరణికి, నెరణికి తాండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఓ జట్టుగా.. ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్‌ గ్రామాల ప్రజలు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. ఈ కర్రల సమరంలో 50 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా మారింది. వారిని ఆదోని, ఆలూరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

బన్ని ఉత్సవంలో హింస జరక్కుండా ఉండేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు ఫలించలేదు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘాను పటిష్టం చేసినా.. నెల రోజుల ముందు నుంచే అవగాహన కార్యక్రమాలు చేపట్టినా స్థానికులు తమ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. మొత్తానికి దేవరగట్టు కర్రల సమరంలో ప్రాణ నష్టం లేకపోవడంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

బాలుడు మృతి.. : దేవరగట్టు కర్రల సమరానికి వెళ్తూ ఓ బాలుడు మృతి చెందాడు. కర్నాటకలోని శిరుగుప్పకు చెంది రవీంద్రనాథ్​రెడ్డి కర్రల సమరాన్ని చూసేందుకు వస్తూ మృతి చెందాడు. అతను గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.