ETV Bharat / city

కాకినాడ జిల్లాలో మళ్లీ పశువులపై పెద్దపులి దాడి!

author img

By

Published : Jun 2, 2022, 9:23 AM IST

Updated : Jun 2, 2022, 10:19 AM IST

tiger hunted cow
మళ్లీ పశువులపై పెద్దపులి దాడి!

09:21 June 02

tiger hunted cow
పాదముద్రలు పరిశీలిస్తున్న అటవీ అధికారులు

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో మరోసారి పశువులపై పులి దాడి చేసింది. పాండవులపాలెం-పొదురుపాక సమీపంలో ఆవును చంపింది. ఈ ఘటనతో శరభవరం, పాండవులపాలెం, పోతులూరు, ఒమ్మంగి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పులిని అడవిలోకి పంపేందుకు అటవీ శాఖ అధికారుల యత్నం కొనసాగుతూనే ఉంది. పది రోజులకు పైగా పులి సంచారంతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు.

నడకలో రాజసం.. పరుగులో పౌరుషం.. పంజా విసిరితే ప్రత్యర్థి బలవ్వాల్సిందే.. అదే పెద్దపులి.. మేలిమి బంగారంలా కనిపించే శరీరంతో.. కాటుకతో తీర్చిదిద్దినట్లుండే నల్లటి చారలతో.. చీకట్లో సైతం వెంటాడే వేటగాడిలా.. కాగడాల్లాంటి కళ్లతో అడవుల్లో సంచరించాల్సిన ఈ బెబ్బులి జనావాసాల్లోకి వచ్చేసింది.. గత పది రోజులుగా ప్రత్తిపాడు మండలంలో సంచరిస్తూ ప్రజలను కలవరపెడుతోంది.. ఒకప్పుడు టైగర్‌ కారిడార్‌గా ఉండే ప్రాంతం గనుల తవ్వకాలతో రూపు కోల్పోతుండడంతో మృగాల గమనం జనావాసాలవైపు వచ్చే పరిస్థితి నెలకొంది.

ప్రత్తిపాడు మండలంలోని పోతులూరు సమీపంలో ఊదరేవడి మెట్ట స్థావరంగా పులి సంచారం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. మెట్ట మీద బసచేసింది సాక్షాత్తూ బెంగాల్‌ రాయల్‌ టైగర్‌ అనేది అధికారుల వాదన.. కెమెరా ట్రాప్‌లలో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలనకు పంపిన అధికారులు త్వరలో దీనిపై స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. మెట్టపై బసచేసిన పెద్ద పులి రాత్రుళ్లు ఆహార అన్వేషణకు జనావాసాల్లోకి రావడంతో అటవీ శాఖ అప్రమత్తమైంది.

నిశితనిఘా..: పులి సంచరించే వీలున్న మార్గాల్లో 40 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటుచేసి నిఘా వేశారు. ఒమ్మంగి, పోతులూరు, కొడవలి మధ్య సంచరించి ఊదరేవడి మెట్టపై బస చేసిన పెద్దపులికి నాలుగైదేళ్లు వయసు ఉండొచ్చని అంచనా. 180 కేజీలకు పైనే బరువు.. ఆరున్నర అడుగుల పొడవు ఉంటుందని చెబుతున్నారు. వేటాడే క్రమంలో దారి తప్ఫి. విజయనగరం జిల్లా ఎస్‌.కోట - అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మీదుగా వందల కిమీ ప్రయాణించి ఇటు వచ్చినట్లు గుర్తించారు.

* ఒమ్మంగి సమీపంలో రెండు గేదెలను వేటాడిన పులి.. ఆహార అన్వేషణకు అనుకూలతతో ఊదరేవడి మెట్టపైనే మకాం పెట్టినట్లు భావిస్తున్నారు. మెట్టకు 6 కి.మీ. దూరంలో పాండవులపాలెం వైపు వెళ్లిందని బుధవారం కన్పించిన పాదముద్రల ఆధారంగా తెలుస్తోంది. అక్కడికి సమీపంలో అభయారణ్యం ఉండడంతో బెబ్బులి గమనం అటువైపు ఉంటుందా.. ఆహారం రుచి మరిగిన పులి వెనక్కి వస్తుందా అనే భయాందోళన నెలకొంది.

క్షణక్షణం..: పులి సంచారంతో సమీప ఆరు గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. జాతీయ జంతువు కావడంతో నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) మార్గదర్శకాల ప్రకారం కమిటీ ఏర్పాటుచేసి.. రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించాలి. కమిటీ ఏర్పాటు చేసినా.. పరిస్థితి చేయిదాటితేనే రెస్క్యూ ఆపరేషన్‌ వరకు వెళ్లే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. కెమెరా ట్రాప్‌ల ద్వారా కదలికలపై నిశిత నిఘా వేశారు. పులికి ఎలాంటి హాని కలగకుండా అడవి వైపు గమనం సాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పాండవులపాలెం సమీపంలో చెరువు వద్ద పులి పాదముద్రలు గుర్తించిన అధికారులు దాదాపు అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లేనని భావిస్తున్నామని వన్యప్రాణుల సంరక్షణ విభాగం డివిజనల్‌ అధికారి సెల్వం ‘ఈనాడు’తో చెప్పారు. మరికొద్దిరోజులు నిశిత పరిశీలన తర్వాత స్పష్టతకు వస్తామన్నారు.

మే 23: ఒమ్మంగి సమీపంలోని సరుగుడు తోటల్లో రెండు గేదెలు వేర్వేరు రోజుల్లో చనిపోయినట్లు గుర్తింపు. అడవి జంతువులు చంపేసినట్లు అనుమానంతో అటవీ అధికారులకు రైతుల ఫిర్యాదు.

మే 24: గేదెను వేటాడిన తీరు, పాదముద్రల ఆధారంగా క్రూర మృగమని అంచనా. నిఘా కెమెరాల ఏర్పాటు.

మే 25: పులి సంచారంపై చుట్టుపక్కల గ్రామాల్లో కలకలం.

మే 26: పులి సంచరించే వీలున్న మార్గాల్లో కెమెరా ట్రాప్‌ల అమరిక.

మే 27: పోతులూరు ఊదరేవడి మెట్ట వద్ద గేదెను చంపిన పులి. పర్యవేక్షణకు అటవీశాఖ ప్రత్యేక బృందాల నియామకం.

మే 28: పోతులూరు పరిసరాల్లో పెద్ద పులి సంచరిస్తున్న దృశ్యాలు నిఘా కెమెరాల్లో నిక్షిప్తం.

మే 29: డీఎఫ్‌వో రాజు, వన్యప్రాణి సంరక్షణ విభాగం డీఎఫ్‌వో సెల్వం, శిక్షణ ఐఎఫ్‌ఎస్‌ భరణి ఆధ్వర్యంలో 150 మంది సిబ్బందితో కొడవలి పంపు హౌస్‌ వద్ద బేస్‌ క్యాంపు ప్రారంభం.

మే 30: పెద్దపులి కదలికలు సీసీ కెమెరాల్లో మళ్లీ నిక్షిప్తం. ధర్మవరం సమీప పోలవరం కాలువ వరకు వెళ్లి, వెనక్కి మెట్ట దగ్గరకు వచ్చినట్లు గుర్తింపు.

మే 31: పోతులూరు ఊదరేవడిమెట్టపై మకాం వేసిన పెద్దపులి జాడ ట్రాకింగ్‌ కెమెరాల్లో కనిపించలేదు.

జూన్‌ 1: బెంగాల్‌ రాయల్‌ టైగర్‌గా గుర్తింపు. పాండవులపాలెం సమీప చెరువు వద్ద పులి పాదముద్రల గుర్తింపు. తోటపల్లి, బవురువాక రిజర్వ్‌ అటవీ ప్రాంతాలు ఉండటంతో అటు వెళ్లినట్లు అంచనా.

జూన్​ 2: పాండవులపాలెం-పొదురుపాక సమీపంలో మళ్లీ పశువులపై పులి దాడి చేసి... ఆవును చంపింది.

అడవిబాటలో: పెద్దపులి జాడలు పాండవులపాలెం వద్ద గుర్తించారు. తాజాగా పాండవులపాలెం చెరువు వద్దకు నీళ్ల కోసం వచ్చినట్లు పులి పాదముద్రలను అటవీఅధికారులు ట్రాకింగ్‌ కెమెరాల్లో గుర్తించారు. చీఫ్‌ కన్జర్వేటర్‌ శరవణన్‌, డీఎఫ్‌వో రాజు నేతృత్వంలోని బృందాలు పొదురుపాక, పాండవులపాలెం పరిసరాలు నిశితంగా పరిశీలించాయి. ఎండ కారణంగా ఎక్కడా నేల చెమ్మ లేకపోవడం వల్ల చెరువు వద్ద మాత్రమే పులి జాడ గుర్తించగలిగామని వైల్డ్‌లైఫ్‌ రేంజరు వరప్రసాద్‌ తెలిపారు. పోతులూరు ఊదరేవడి మెట్ట నుంచి 5 కి.మీ. దూరం కనిపించిన ఈ జాడలు రిజర్వుఫారెస్టుకు చేరువలోనే ఉన్నాయి. పాండవులపాలెం గ్రామానికి కిలోమీటరు దూరంలో తోటపల్లి రిజర్వుఫారెస్టు, 3 కి.మీ.ల బవురువాక రిజర్వు ఫారెస్టు ఉన్నాయి. పులి వచ్చినబాటనే వెళ్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వెనక్కి వచ్చే అవకాశం ఉండదని, గురువారం పులి జాడను బట్టి స్పష్టత వస్తుందని అన్నారు. ఫారెస్ట్‌ సబ్‌డీఎఫ్‌వో సౌజన్య నేతృత్వంలో డీఆర్‌వో రామకృష్ణ, సెక్షన్‌ ఆఫీసర్‌ రవిశంకర్‌ నాగ్‌, గోకవరం, అడ్డతీగల సిబ్బంది గ్రామాల్లో గస్తీ కాస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Jun 2, 2022, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.