ETV Bharat / city

Srisailam dam: "శ్రీశైలం"లో.. రూ. కోటి బిల్లుకూ దిక్కులేదు!

author img

By

Published : Jun 2, 2022, 9:46 AM IST

Srisailam dam: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి కీలక జలాశయం అది... అందులో చేయాల్సిన పనులెన్నో... అయితే ఇప్పటివరకూ చేసిన పనులకు చేయాల్సిన చెల్లింపులు కూడా ఎన్నో... వరదల సమయంలో కుదుపులకు గురై దెబ్బతింటూనే ఉంది. పెండింగ్​ బిల్లులే ఇవ్వనప్పుడు... మిగిలిన పనులు ఎలా చేయాలని అధికారులు ఇబ్బందులు పడుతున్నారు... ఇంతకీ ఆ జలశయం ఏదో అనుకునేరు... శ్రీశైలం జలశయమే. ఇప్పుడు ఆ డ్యాం పరిస్థితి ఎలా ఉందంటే..?

Srisailam dam
శ్రీశైలం జలాశయం

Srisailam dam: 'మీరు పనులు చేయండి... డబ్బులున్నప్పుడు బిల్లులు చెల్లిస్తాం. వాటికోసం న్యాయస్థానానికి వెళ్లేందుకు వీల్లేదు. ఇందుకు ఇష్టపడేవారే ఈ పనులు చేయడానికి ముందుకు రండి' అంటూ సంచలనం సృష్టించిన జలవనరులశాఖలో ఇంకా ఇలాంటి కోణాలు ఎన్నో బయటపడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల కీలక జలాశయమైన శ్రీశైలంలో డ్యాం భద్రతా పనులు చేయించాలన్నా అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. కేవలం రూ.కోటికి పైగా చెల్లించాల్సిన రెండు బిల్లులు ఎప్పటి నుంచో పెండింగులో ఉన్నాయి. దీంతో పనులు సకాలంలో సాగడం లేదని సమాచారం. శ్రీశైలం జలాశయంలో 885 అడుగుల గరిష్ఠ నీటిమట్టం వద్ద 215 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు.

2009లో భారీ వరదలు వచ్చి ఈ జలాశయం కుదుపునకు గురైంది. ఇక్కడ స్పిల్‌ వే దిగువన ప్లంజ్‌పూల్‌ సమస్య ఇబ్బంది పెడుతోంది. కేంద్ర జలసంఘం విశ్రాంత ఛైర్మన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన డ్యాం భద్రతా కమిటీ శ్రీశైలం వద్ద గతంలోనూ సమావేశమైంది. 2022 జనవరిలో మరోసారి సమావేశమై అనేక సిఫార్సులు చేసింది. ప్లంజ్‌పూల్‌ను పూడ్చటం వల్ల ప్రయోజనం లేదన్నది ఈ కమిటీ అభిప్రాయం. శ్రీశైలంలో ఎప్పటి నుంచో రూ.వందల కోట్లతో పనులు చేయాలని ప్రతిపాదనలు ఉన్నా, వాటిపై ముందడుగు పడటం లేదు. మరోవైపు తాజాగా పాండ్యా కమిటీ సూచనల మేరకు కొన్ని పనులు ప్రపంచబ్యాంకు రుణ సాయంతో డ్రిప్‌ 2 కింద రూ.100 కోట్లతో చేపట్టేందుకు శ్రీశైలం అధికారులు ప్రతిపాదనలు కొలిక్కి తెచ్చారు.

చిన్న బిల్లులూ ఇవ్వలేదు..: కొత్త నీటి సంవత్సరం ప్రారంభమైంది. జులై నుంచి వరద కాలం మొదలవుతుంది. ఈలోపు కొన్ని ముఖ్యమైన పనులైనా శ్రీశైలం వంటి జలాశయాల్లో చేసుకోవాలి. కానీ ఇప్పటికే చేసిన పనులకు చిన్న చిన్న మొత్తాల బిల్లులు కూడా మంజూరు చేయకపోవడంతో పనులు చేయించేందుకు జలవనరులశాఖ అధికారులు ఆపసోపాలు పడుతోంది. శ్రీశైలంలో డ్రైనేజి గ్రౌటింగు పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో రివర్‌ స్లూయిస్‌ గేట్లకు మరమ్మతులు చేసి చాలా కాలమైంది. ఇక్కడ రెండు స్లూయిస్‌లు, రెండు గేట్లు ఉన్నాయి. వీటిని 40 ఏళ్లకు పైగా ఉపయోగించకపోవడంతో తుప్పుపట్టే పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం డ్యాం నిర్వహణలో భాగంగా వీటి పనులు చేయించేందుకు అధికారులు టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. సుమారు రూ.2 కోట్లకు పైగా నిధులతో రివర్‌ స్లూయిస్‌ గేట్ల మరమ్మతుల పనులు చేయిస్తున్నారు. వాటిని సరిచేసి మళ్లీ అమర్చాలి. ఈ గేటుకు అవసరమైన రోప్‌, బేరింగుల వంటి సామగ్రి కొనిపించారు. వీటికే రూ.1.25 కోట్ల వరకు ఖర్చయినట్లు చెబుతున్నారు. పనులు చేసి గేటు బిగించాలి. ఇంతవరకు కొన్న సామగ్రి, చేసిన పనికి బిల్లు సమర్పించినా ఇంతవరకూ చెల్లించలేదు. కిందటి ఆర్థిక సంవత్సరంలోనే ఈ బిల్లు పంపారు. పాత బడ్జెట్‌లో ఆమోదం పొందకపోవడంతో తిరిగి కొత్త బడ్జెట్‌లో సమర్పించాలంటూ తిరిగి వచ్చిందని సమాచారం. స్టాప్‌ లాగ్‌ గేట్లకు సంబంధించిన అంశమూ ఇలాగే ఉందని చెబుతున్నారు. డిజైన్‌, రూపకల్పనతో పాటు వీటిని ప్రత్యేకంగా డాకింగ్‌లో ఉంచాలి. ఇందుకు ప్రత్యేకమైన క్రేన్‌ అవసరమవుతోంది. ఈ పనిలోనూ కొంత బిల్లు పెండింగులో ఉండటంతో సిద్ధమైన స్టాప్‌ లాగ్‌ గేట్లను డాకింగ్‌కు చేర్చే కార్యక్రమమూ ఆగిపోయిందని చెబుతున్నారు.

రూ.100 కోట్లతో ప్రతిపాదనలు: శ్రీశైలంలో డ్రిప్‌ 2 కింద వివిధ పనులు చేపట్టేందుకు సుమారు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. గేట్లకు రంగులు వేయడం, అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం, ధ్వంసమైన ఏప్రాన్‌ పనులు చేపట్టడంతో పాటు ఇతర చిన్న చిన్న పనుల కోసం ఈ అంచనాలు సిద్ధమయ్యాయి. వీటిని రాష్ట్ర జలవనరులశాఖ ద్వారా కేంద్రానికి పంపాలి. డ్రిప్‌ 2 కార్యక్రమంలో 70% నిధులను ప్రపంచబ్యాంకు రుణసాయంతో కేంద్రం ఇస్తుంది. మరో 30% రాష్ట్రం భరించాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.