ETV Bharat / city

'కొరింగ' రక్షణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

author img

By

Published : Jan 18, 2020, 8:01 AM IST

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం రక్షణకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. అరుదైన వన్యప్రాణులు సంచరించే ఈ ప్రాంతాన్ని పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటించింది. ఈ ప్రాంతంలో కాలుష్యకారక పరిశ్రమల ఏర్పాటును నిషేధించింది. అలాగే త్వరలోనే మాస్టర్​ ప్లాన్ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

conringa Wildlife sanctuary became an eco-sensitive zone
conringa Wildlife sanctuary became an eco-sensitive zone

conringa Wildlife sanctuary became an eco-sensitive zone
కేంద్రం ప్రకటించిన పర్యావరణ సున్నిత ప్రాంతం ఇదే
conringa Wildlife sanctuary became an eco-sensitive zone
కేంద్రం ప్రకటించిన పర్యావరణ సున్నిత ప్రాంతం ఇదే

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని గోదావరి తీరంలో ఉన్న కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని పర్యావరణ సున్నిత ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 235.70 చదరపు కిలోమీటర్ల మేర కోరింగ వన్యప్రాణి కేంద్రం విస్తరించి ఉంది. సరిహద్దు నుంచి 11.5 కిలోమీటర్ల వరకు ఉన్న 187.14 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణపరంగా సున్నిత ప్రాంతం(ఎకోసెన్సిటివ్‌ జోన్‌)గా కేంద్రం ప్రకటించింది. ఇక్కడికి రాకపోకలు సాగించే సముద్ర క్షీరదాలు, డాల్ఫిన్లు, ఫిషింగ్‌ క్యాట్స్‌, నక్కలు, అరుదైన కోతి జాతులు, ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లు, 234 జాతుల సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ, పర్యవరణ శాఖలు వెల్లడించింది. సమీప గ్రామీణులకు చేపల వేట ప్రధాన జీవనోపాధి కావటంతో.. సముద్రానికి తూర్పువైపు భాగాన్ని మినహాయించి కాకినాడ నగరం వైపు ప్రాంతాన్ని సున్నిత ప్రాంతంగా ప్రకటించింది.

కేంద్రం విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్​పై రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం.... స్థానికులతో సంప్రదించి ఎకోసెన్సిటివ్‌ జోన్‌ మాస్టర్‌ ప్లాన్ రూపొందించాల్సి ఉంటుందని కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించింది. పర్యావరణ, అటవీ, వన్యప్రాణి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, పోర్టులు, మత్స్య, పరిశ్రమలు, ఏపీ ట్రాన్స్‌కో సహా అన్ని శాఖలతో సంప్రదించి పర్యావరణ అంశాలను పరిగణలోకి తీసుకుని మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నిర్దేశించింది. సున్నిత మండలంగా ప్రకటించిన ప్రాంతంలో ఎటువంటి మైనింగ్‌ కార్యకలాపాలు, స్టోన్‌ క్వారీ, క్రషింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధమని, జల, వాయు, నేల, శబ్ద కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటు, భారీ జల విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం, ప్రమాదకర వస్తువుల వినియోగం, ఉత్పత్తిని నిషేధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతానికి కిలోమీటరు పరిధిలో ఎటువంటి హోటళ్లు, రిసార్టులు ఏర్పాటు చేయడాన్ని కూడా నిషేధిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రజావసరాలు మినహా ఎటువంటి రోడ్ల నిర్మాణ పనులు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం ప్రాంతంపై హెలీకాఫ్టర్​లు వెళ్లడం, హాట్‌ బెలూన్లు, డ్రోన్లు ఎగరేయడం నిబంధనలకు లోబడి మాత్రమే ఉండాలని కూడా స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా 15మంది సభ్యులతో ఈ ప్రాంత సంరక్షణకు ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి:క్రికెట్ బంతి తగిలి బాలుడు మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.