YS VIVEKA DEATH CASE: వివేకా హత్యకేసు.. సీబీఐ అదుపులో అనుమానితుడు శివశంకర్‌రెడ్డి

author img

By

Published : Nov 17, 2021, 2:30 PM IST

Updated : Nov 18, 2021, 4:26 AM IST

1

14:29 November 17

సీబీఐ అదుపులో వివేకా హత్యకేసు అనుమానితుడు శివశంకర్‌రెడ్డి

      ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్‌, మాజీమంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసు(YS.Viveka murder case)లో సీబీఐ మరొకరిని అరెస్టు చేసింది. వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి(Shiva Shankar Reddy) ని బుధవారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుంది. ఆయన కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి(Kadapa MP Avinash Reddy)కి సన్నిహితుడు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి(Dhastagiri) ఇటీవల ఇచ్చిన వాంగ్మూలంలో శివశంకర్‌రెడ్డి ప్రస్తావన ఉంది. వివేకాను హత్యచేస్తే శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడంటూ ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి పేర్కొన్నారు. దీంతో ఈ నెల 15న కడపలో విచారణకు హాజరుకావాలని శివశంకర్‌రెడ్డికి సీబీఐ ఇటీవల సమాచారమిచ్చింది. అయితే అనారోగ్య కారణాలతో తాను హైదరాబాద్‌లో ఉన్నానని, తర్వాత వస్తానంటూ ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో సీబీఐ ప్రత్యేక బృందం బుధవారం హైదరాబాద్‌లో ఆయన్ను పట్టుకుంది. ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించింది. అనంతరం ఆయన్ను కడప తీసుకొచ్చేందుకు ట్రాన్సిట్‌ వారెంట్‌ కోసం నాంపల్లి మేజిస్ట్రేట్‌ ఎదుట ప్రవేశపెట్టింది. గురువారం ఆయన్ను పులివెందులకు తీసుకొచ్చి స్థానిక న్యాయస్థానంలో హాజరు పరచనుంది. అయితే సీబీఐ వర్గాలు అధికారికంగా వివరాలేమీ ప్రకటించలేదు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ వివేకా కుమార్తె సునీత గతంలో హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పొందుపరిచిన 15 మంది అనుమానితుల జాబితాలో శివశంకర్‌రెడ్డి ఒకరు. ఆయనపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

విచారణ 22వ తేదీకి వాయిదా

వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి తరఫున సీబీఐ వేసిన అప్రూవర్‌ పిటిషన్‌పై ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి తరఫు న్యాయవాదులు కడప సబ్‌కోర్టులో బుధవారం కౌంటరు దాఖలు చేశారు. దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కౌంటరు వేశారు. దీనిపై విచారణను న్యాయస్థానం ఈ నెల 22కు వాయిదా వేసింది.

దస్తగిరి వాంగ్మూలంలో శివశంకర్‌రెడ్డి ప్రస్తావన ఇలా! (దస్తగిరి మాటల్లోనే)

  •  ‘వై.ఎస్‌.వివేకాను చంపేయ్‌. నువ్వు ఒక్కడివే కాదు... మేమూ నీతో వస్తాం. దీని వెనుక వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, వై.ఎస్‌.మనోహర్‌రెడ్డి, వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి. డి.శివశంకర్‌రెడ్డి వంటి పెద్దవాళ్లు ఉన్నారు’ అని ఎర్ర గంగిరెడ్డి నాతో చెప్పారు.
  •  ‘వివేకాను హత్యచేస్తే శివశంకర్‌రెడ్డి మనకు రూ.40 కోట్లు ఇస్తారు. అందులో రూ.5 కోట్లు నీకు ఇస్తా’ అని ఎర్ర గంగిరెడ్డి నాతో అన్నారు.
  •  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వై.ఎస్‌.వివేకా ఓ రోజు అవినాష్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడున్న శివశంకర్‌రెడ్డిని చూసి ‘నువ్వు మా కుటుంబంలోకి వచ్చి నన్ను మోసం చేశావు. నన్ను నా కుటుంబసభ్యులకు దూరం చేశావు. నీ అంతు చూస్తా’ అని హెచ్చరించారు. తర్వాత అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డిలను చూస్తూ ‘మీ అందరి కథ చెబుతా’ అంటూ కేకలేశారు.
  •  శివశంకర్‌రెడ్డితో పాటు వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి సరిగ్గా మద్దతివ్వని కారణంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి పాలయ్యారు.
  •  వివేకా హత్య జరిగిన తర్వాత రోజు ఉదయం 5 గంటలకు ఎర్ర గంగిరెడ్డి నన్ను ఆయన ఇంటికి పిలిపించారు. ‘మీరేం భయపడొద్దు. నేను శివశంకర్‌రెడ్డి, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డితో మాట్లాడాను. వాళ్లు అంతా చూసుకుంటామన్నారు. నీకు ఇవ్వాల్సిన మిగతా డబ్బులు కూడా ఇచ్చేస్తా’ అని నాతో చెప్పారు.
  •  ఈ ఏడాది మార్చి 3న దిల్లీకి రావాలంటూ సీబీఐ అప్పట్లో నాకు నోటీసులు ఇచ్చింది. దీంతో డి.శివశంకర్‌రెడ్డి, విద్యారెడ్డి, భయపురెడ్డి నన్ను పిలిచారు. వారి పేర్లు ఎక్కడా చెప్పొద్దని నాకు డబ్బులు ఇస్తామన్నారు. నా జీవితం సెటిల్‌ చేసేస్తామన్నారు. తర్వాత దిల్లీలో * నా వద్దకు భరత్‌ యాదవ్‌ను పంపించారు. అక్కడ జరిగే విషయాలన్నీ శివశంకర్‌రెడ్డికి తెలియజేయమనేవారు.

వివేకా కుమార్తె సునీత గతంలో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో శివశంకర్‌రెడ్డిపై వ్యక్తం చేసిన అనుమానాలు

  •  వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిలతో శివశంకర్‌రెడ్డి సన్నిహితంగా పనిచేస్తారు.
  •  ఆయనకు నేరచరిత్ర ఉంది. అనేక సందర్భాల్లో వివేకా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
  •  ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాకు బదులుగా ఆయనే పోటీ చేయాలనుకున్నాడు. ఆ అవకాశం లభించకపోవటంతో వివేకా ఓటమి కోసం పనిచేశాడు. శివశంకర్‌రెడ్డి సంఘ వ్యతిరేక కార్యకలాపాలను గతంలో వివేకా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన్ను అరెస్టుచేయాలని డిమాండు చేశారు.
  •  వివేకా హత్య జరిగిన 2019 మార్చి 14న శివశంకర్‌రెడ్డిని ఎర్ర గంగిరెడ్డి పిలిపించుకున్నారు. వారు ఏం చర్చించుకున్నారు? ఈ హత్యలో వారు సహ కుట్రదారులా? కుట్ర అమలుచేసిన వారా?
  •  వివేకా జీవించి ఉన్నంతకాలం శంకర్‌రెడ్డి ఎప్పుడూ వివేకా ఇంటికి రాలేదు. హత్య తర్వాత రోజు ఉదయం మాత్రం వివేకా పడక గదిలో ఉండి.. లోపలికి ఎవర్నీ అనుమతించలేదు. అక్కడున్న రక్తాన్ని తుడిచేశారు. ఆధారాలు చెరిపేశారు.
  • పర్యవసానాలు తెలిసి కూడా ఆయన ఎందుకు అలా చేశారు?
  • వివేకా గుండెపోటుతో చనిపోయారని సాక్షి మీడియా ప్రతినిధికి మొదట చెప్పింది శివశంకర్‌రెడ్డే. ఘటన స్థలాన్ని చూసిన తర్వాత గుండెపోటు అని ఎలా చెప్పగలిగారు? ఎందుకు చెప్పారు?

ఎవరు ఏంటి?

  • ఎర్ర గంగిరెడ్డి: 40 ఏళ్లుగా వివేకాకు సన్నిహితుడు. ఆయనతో పాటే ఉండేవారు.
  • గజ్జల ఉమాశంకర్‌రెడ్డి: వివేకా వద్ద పీఏగా పనిచేసిన జగదీశ్వరరెడ్డికి సోదరుడు. పాలడెయిరీ నిర్వహిస్తుంటారు.
  • యాదటి సునీల్‌ యాదవ్‌: పులివెందుల మండలం మెట్నంతలపల్లె. జగదీశ్వరరెడ్డి ద్వారా వివేకాకు పరిచయమయ్యారు.
  •  దస్తగిరి: వివేకా వద్ద 2017, 2018 సంవత్సరాల్లో డ్రైవర్‌గా పనిచేశారు.
  • డి. శివ శంకర్‌రెడ్డి: వైకాపా రాష్ట్ర కార్యదర్శి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అనుచరుడు
  • వైఎస్‌ అవినాష్‌రెడ్డి: కడప ఎంపీ
  • వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి: వైఎస్‌ కుటుంబీకులు

ఇదీ చదవండి

new education policy in ap: నూతన విద్యావిధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి: సీఎం జగన్​

Last Updated :Nov 18, 2021, 4:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.