ETV Bharat / city

నకిలీ పత్రాలతో వంద ఎకరాలు భూంఫట్‌.. బద్వేలులో బయటపడ్డ మరో అక్రమం

author img

By

Published : Aug 11, 2022, 8:11 AM IST

Fake documents
నకిలీ పత్రాలతో వంద ఎకరాలు

Fake documents: వైఎస్​ఆర్​ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో భూకుంభకోణాలు వరుసగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా అధికార పార్టీ పేరు చెప్పి వందెకరాలు ప్రభుత్వ భూమిని కాజేసిన వైనం అందరిని ఆశ్యర్యానికి గురిచేస్తోంది. అసలేం జరిగిందంటే..?

Fake documents: వైఎస్​ఆర్​ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఇది వరకే పలు భూకుంభకోణాలు వెలుగులోకి రాగా... తాజాగా మరొకటి బయటపడింది. అధికారపార్టీ పేరు చెప్పుకొని ఓ సాధారణ వ్యక్తి సైతం సుమారు వంద ఎకరాల ప్రభుత్వ భూములను తన కుటుంబ సభ్యుల పేరిట అక్రమంగా నమోదు చేయించుకున్నారు. అందులో కొంత విక్రయించేశారు. స్థానికంగా అనుమానం తలెత్తకుండా తెలంగాణలోని బంధువుల పేరిట కూడా భూముల్ని నమోదు చేయించారు. భవిష్యత్తులో ఎలాంటి ఆటంకం కలగకుండా వివిధ రూపాల్లో నకిలీ పత్రాలను సృష్టించి పలువురి పేర్ల ద్వారా బదలాయించినట్లుగా రిజిస్ట్రేషన్‌ ద్వారా సైతం సొంతం చేసుకున్నారు.

కాశినాయన మండలం ఇటికులపాడు గ్రామానికి చెందిన సర్వే నంబరు 154, 272/1, 272/3, 279/1, 279/5, 301/2, 388లో సుమారు వంద ఎకరాల సర్కారు భూములను అనువంశికం పేరిట సక్రమించినట్లుగా కుటుంబ సభ్యుల పేరిట అక్రమంగా బదలాయించుకున్నారు. ఇందుకు రెవెన్యూ యంత్రాంగం సహాయ సహకారాలు అందించడంతో వ్యవహారం అంతా సక్రమమైపోయింది. నాయునిపల్లె గ్రామంలోని సర్వే నంబరు 204/2 కింద 24.28 సెంట్ల ప్రభుత్వ భూమిని అక్రమ రికార్డుల పరంగా కాజేశారు.

పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామంలో సర్వే నంబరు 156/1లో 0.21 సెంట్ల భూమిని నకిలీ పత్రాలతో ఒక్కో సెంటును రూ.6 లక్షల చొప్పున విక్రయించారు. కాజేసిన ప్రభుత్వ భూములపై స్థానికంగా ఉన్న నరసాపురం పీఏసీఎస్‌లో రూ.11.12 లక్షలు, ఇటుకులపాడు గ్రామంలోని ఓ బ్యాంకులో ఇద్దరు కుటుంబ సభ్యుల పేరిట రూ.2.50 లక్షల వరకు రుణం తీసుకున్నారు. ఈ అక్రమాలపై స్థానికులు కొందరు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదులు వివిధ రూపాల్లో పంపారు. కలెక్టరుకు స్పందనలో ఫిర్యాదు చేయగా... స్థానిక రెవెన్యూ అధికారులు తమ ప్రమేయం ఉండడంతో తూతూమంత్రంగా విచారణ నిర్వహించి ఇందులో వాస్తవంలేదంటూ ముగించారు. బినామీ పేరుతో మీ- సేవా కేంద్రాన్ని నడుపుతూ అక్రమాల తంతును నడిపిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై కాశినాయన తహసీల్దారు రామచంద్రుడును వివరణ కోరగా తాను బాధ్యతలు స్వీకరించి నెలరోజులే అయిందని, ఈ వ్యవహారం అంతా తన హయాంలో జరిగినది కాదన్నారు. అక్రమాలు జరిగుంటే విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.