ETV Bharat / city

SUNIL YADAV BAIL: సునీల్ యాదవ్​ బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసిన కోర్టు

author img

By

Published : Dec 10, 2021, 5:28 AM IST

Updated : Dec 10, 2021, 7:24 AM IST

ys viveka murder case: వివేకా హత్యకేసు నిందితుడు సునీల్ యాదవ్​ బెయిల్​ పిటిషన్​ను కోర్టు కొట్టేసింది. విచారణను కడప కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది.

SUNIL YADAV BAIL
SUNIL YADAV BAIL


SUNIL YADAV BAIL: ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు సునీల్ యాదవ్​ బెయిల్‌ పిటిషన్‌ని న్యాయస్థానం కొట్టివేసింది. ఈ మేరకు బెయిల్‌ని కొట్టివేస్తూ.. కడప కోర్టు నాలుగో అదనపు కోర్టు ఆదేశాలిచ్చింది.

కేసులో కీలక నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్​ బెయిల్‌ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతారని.. సీబీఐ తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. సునీల్‌ యాదవ్‌ బెయిల్ పిటిషన్‌ని రద్దు చేసింది. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌ రెడ్డి కూడా మరోసారి బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిద్దరి బెయిల్ పిటిషన్‌పై విచారణను.. కడప కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది.

సీబీఐ అభియోగపత్రంలో..

ys viveka murder case: వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యలో ఎర్ర గంగిరెడ్డి, యాదటి సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరి పాత్ర ఉందని సీబీఐ తేల్చింది. ఆ నలుగురి ప్రమేయంపై మంగళవారం పులివెందుల న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేసింది. ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిల నేపథ్యం, ఈ హత్య కేసులో వారి ప్రమేయానికి సంబంధించి సీబీఐ దర్యాప్తులో గుర్తించిన అంశాలు ఇలా ఉన్నాయి.

అంతమొందించేందుకు ప్రణాళిక

గజ్జల ఉమాశంకర్‌రెడ్డి: వివేకా వద్ద పీఏగా పనిచేసిన జగదీశ్వరరెడ్డి సోదరుడు ఉమాశంకర్‌రెడ్డి. ఈయనది కడప జిల్లా సుంకేశుల. పాల డెయిరీ నిర్వహిస్తుంటారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్‌ యాదవ్‌ను వివేకాకు పరిచయం చేసింది ఈయనే.

సీబీఐ ఏం తేల్చిందంటే: వివేకాను అంతమొందించేందుకు సునీల్‌తో కలిసి ప్రణాళిక రూపొందించారు. ఇంటి వద్ద ఉండే కుక్కను ఉమాశంకర్‌రెడ్డి కారుతో గుద్దించి చంపేశారు. సేకరించిన శాస్త్రీయ ఆధారాలను గుజరాత్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ డైరెక్టరేట్‌తోపాటు మరికొన్ని ప్రయోగశాలల్లో విశ్లేషించగా... ఈ హత్యలో ఉమాశంకర్‌రెడ్డి పాత్ర తేటతెల్లమైంది. హత్యలో శంకర్‌రెడ్డి ప్రమేయం ఉందంటూ సునీల్‌ యాదవ్‌, దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు.

గొడ్డలిని బైక్‌ సైడ్‌ బ్యాగ్‌లో దాచిపెట్టి

యాదటి సునీల్‌ యాదవ్‌: ఈయనది పులివెందుల మండలం మోట్నూంతలపల్లె. వివేకా హత్యకు కొన్ని రోజుల ముందే ఆయనకు పరిచయమయ్యారు.

సీబీఐ దర్యాప్తు ఏం తేల్చిందంటే: ఉమాశంకర్‌రెడ్డితో కలిసి ప్రణాళిక రూపొందించారు. వివేకాను హత్య చేసిన రోజు రాత్రి ఆయన ఇంటికి చేరుకునేందుకు ఉమాశంకర్‌రెడ్డికి చెందిన పల్సర్‌ బైక్‌నే సునీల్‌ వినియోగించారు. గొడ్డలిని బైక్‌ సైడ్‌ బ్యాగ్‌లో దాచిపెట్టి, దానిపైనే అక్కడి నుంచి తప్పించుకున్నారు. వివేకా ఇంటివద్ద వాచ్‌మన్‌గా పనిచేసిన రంగన్న న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలోనూ హత్యలో సునీల్‌ ప్రమేయం గురించి వెల్లడించారు. హత్యకు వినియోగించిన ఆయుధాలు, ఇతర నిందితుల ప్రమేయం గురించి సునీల్‌కు తెలుసు.

ఆధారాలను తుడిచేశారని...

తూమలపల్లి గంగిరెడ్డి అలియాస్‌ ఎర్ర గంగిరెడ్డి: 40 ఏళ్లుగా వివేకాకు సన్నిహితుడు. సీబీఐ విచారణ కోరుతూ వివేకా కుమార్తె సునీత హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్న అనుమానితుల జాబితాలో ఈయన పేరు రెండోది.

ఆరోపణలు, అభియోగాలు: ‘‘వివేకా హత్య కేసు విషయంలో ఎవరికైనా నా పేరు చెబితే నిన్ను నరికేస్తా’’ అంటూ ఎర్ర గంగిరెడ్డి తనను బెదిరించారంటూ వివేకా వద్ద వాచ్‌మన్‌గా పనిచేసిన రంగన్న ఈ ఏడాది జులైలో ఆరోపించారు. ‘‘వివేకా హత్య తర్వాత ఘటనా స్థలంలోని రక్తపు మరకలు, ఇతర ఆధారాలన్నింటినీ తుడిచేశారు. మనోహర్‌రెడ్డి చెబితేనే ఆధారాల్ని తుడిచేశానని ఆయన గతంలో కస్టడీలో ఉన్నప్పుడు చెప్పారు. వివేకా మరణించారనే విషయం మా తల్లికి, నాకు కానీ ఫోన్‌ చేసి చెప్పలేదు. మేము లేకుండానే అంత్యక్రియలు జరిపించేందుకు ప్రయత్నించారు. గాయాల ఆనవాళ్లు కనిపించినప్పటికీ గుండెపోటుతో మరణించారంటూ చిత్రీకరించి నమ్మించేందుకు యత్నించారు.’’ అంటూ వివేకా కుమార్తె సునీత ఈయనపై అనుమానాలు వ్యక్తంచేశారు.

దిల్లీలో రెండు నెలలపాటు విచారణ

షేక్‌ దస్తగిరి: వివేకా వద్ద 2017, 2018ల్లో డ్రైవర్‌గా పనిచేశారు. హత్యకు 6నెలల ముందు మానేశారు. ఇతని ప్రమేయానికి సంబంధించి వాచ్‌మన్‌ రంగన్న వాంగ్మూలం ఇవ్వగా... ఉమాశంకర్‌రెడ్డిప్రమేయంపై ఈయన సీబీఐకు వాంగ్మూలం ఇచ్చారు. 2 నెలలపాటు ఆయన్ను సీబీఐ అధికారులు దిల్లీలో విచారించారు.

ఇదీ చదవండి:

Tulasi Reddy: ఏపీపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది: తులసిరెడ్డి

Last Updated :Dec 10, 2021, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.