ETV Bharat / city

బెయిల్​పై వచ్చిన 24 గంటల్లో జేసీ ప్రభాకర్​రెడ్డి అరెస్టు.. 21 వరకూ రిమాండ్​

author img

By

Published : Aug 7, 2020, 4:16 PM IST

Updated : Aug 8, 2020, 3:53 AM IST

తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్‌ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌ కేసులో అరెస్టై గురువారం విడుదలైన ఆయన్ని 24 గంటల్లోపే పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. కడప జైలు నుంచి తాడిపత్రి చేరుకునే క్రమంలో పుట్లూరు సీఐతో అనుచితంగా వ్యవహరించారంటూ ఆయనపై ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ అనంతపురం జిల్లాలో మరో మూడు కేసులు నమోదు చేశారు. అరెస్టు అన్యాయమంటూ పార్టీ శ్రేణులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

jc-prabhakar-reddy-and-asmit-reddy-arrested-again
jc-prabhakar-reddy-and-asmit-reddy-arrested-again

జేసీ ప్రభాకర్​రెడ్డిని కడప జైలుకు తరలించిన అధికారులు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో బలమైన నేతగా వెలిగిన తెదేపా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసుల వెల్లువ కొనసాగుతోంది. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ... జేసీ సోదరుల ట్రావెల్స్‌ వ్యాపారంపై ఆర్టీఏ అధికారులు పలు కేసులు నమోదు చేస్తూ వచ్చారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ రూటు బస్సులన్నీ నిలిపివేశారు. ఈ క్రమంలోనే.... బీఎస్​-3 వాహనాలను బీఎస్​-4గా మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించారని ఆర్టీఏ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అనంతపురం, తాడిపత్రి, కర్నూలు జిల్లాలో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసులు నమోదు చేశారు. ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిలను అరెస్ట్‌ చేసి కడప జైలుకు రిమాండ్‌కు పంపారు. అనంతపురం కోర్టు బెయిలు మంజూరు చేయడంతో.. 54 రోజుల రిమాండ్‌ తర్వాత గురువారం కడప జైలు నుంచి విడుదలయ్యారు.

బెయిల్​పై విడుదలైన వీరికి స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున చేరుకున్న అభిమానులు భారీ కాన్వాయ్‌తో తాడిపత్రికి బయల్దేరారు. ఈ క్రమంలో వాహనాన్ని అడ్డుకున్నారంటూ పుట్లూరు సీఐ దేవేంద్రకుమార్‌తో ప్రభాకర్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. సీఐ..... ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు ప్రభాకర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనతో సహా 31 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే వారి ఇంటి వద్ద కార్యకర్తలు బాణసంచా కాల్చినందుకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశామని తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.

హైడ్రామ నడుమ

షరతులతో కూడిన బెయిల్​పై విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో సంతకం చేసేందుకు వెళ్లారు. అయితే సంతకాలు పూర్తైనప్పటికీ వారిని పోలీస్ స్టేషన్​లో ఉంచారు అధికారులు. కొన్ని గంటల తరువాత ప్రభాకర్​ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కాసేపటికే తాడిపత్రి పట్టణంలో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించారు. సాయంత్రం దాదాపు ఆరు గంటల సమయంలో ఆయనను అరెస్టు చేశారు.

నిబంధనలు ఖాతరు చేయలేదు

కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించవద్దంటూ ముందుగానే స్పష్టం చేసినా ఖాతరు చేయకుండా భారీ కాన్వాయ్‌తో వచ్చారని పోలీసులు చెబుతున్నారు. సీఐ మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించినందునే ఆయన్ని అరెస్ట్‌ చేశామన్నారు.

కడప జైలుకు తరలింపు

జేసీ ప్రభాకర్​రెడ్డిని శుక్రవారం రాత్రి మేజిస్ట్రేట్‌ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఈనెల 21 వరకూ రిమాండు విధించారు. ఈక్రమంలో అనంతపురం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య.. తెల్లవారుజామున 1:30 గంటలకు ప్రభాకర్​రెడ్డిని కడప జైలుకు తరలించారు.

ఇదీ చదవండి..

అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే... రాజకీయాల నుంచి తప్పుకుంటా: జేసీ ప్రభాకర్​

Last Updated : Aug 8, 2020, 3:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.