ETV Bharat / city

విద్యార్థిని నగ్న చిత్రాల కేసులో పోలీసు దంపతుల కుమారుడు?

author img

By

Published : Jun 29, 2020, 4:41 AM IST

eenadu gnt case
విద్యార్థిని నగ్న చిత్రాల కేసులో పోలీసు దంపతుల కుమారుడు?

గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థినిని.. అభ్యంతరకర చిత్రాలతో బెదిరించిన కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వరుణ్ పోలీసుశాఖలోని కీలక పదవుల్లో ఉన్న దంపతుల కుమారుడని సమాచారం. ఈ కేసు నుంచి కుమారుడిని బయటపడేసేందుకు ఆధారాలు తారుమారు చేసినట్లు తెలుస్తోంది.

గుంటూరులో యువతిని అభ్యంతర చిత్రాలతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన కేసు విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ కేసులోని ఇద్దరు నిందితుల్లో ఒకడైన వరుణ్ తల్లిదండ్రులు పోలీసుశాఖలో కీలకమైన పదవుల్లో ఉన్నవారిగా తెలుస్తోంది. వారికి చెందిన పోలీసు అనే స్టిక్కర్ కలిగిన వాహనంలోనే వరుణ్‌ చక్కర్లు కొడుతూ యువతులను ఆకట్టుకోవడంతో పాటు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడ్డాడని సమాచారం. ఈ వ్యవహారం తెలుసుకున్న వరుణ్ తల్లిదండ్రులు..కుమారుడిని కేసు నుంచి బయటపడేసేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. యువతికి చెందిన అభ్యంతరకర చిత్రాలకు సంబంధించిన ఆధారాలను తమ సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటర్‌నెట్‌ నుంచి పోలీస్ దంపతులు తొలగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరో యువకుడి కోసం గాలింపు...

ఇప్పటికే అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులతోపాటు..యువతికి చెందిన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌, ఫోర్న్‌ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసిన మరో యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీడియోలు ఇంటర్‌నెట్‌లో పెట్టడమే గాక...బాధితురాలికి ఫోన్‌ చేసి డబ్బులు ఇవ్వాల్సిందిగా అతను డిమాండ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మూడో వ్యక్తితోపాటు...మరో ఇద్దరు యువతులు కూడా వరణ్‌, కౌశిక్‌కు సహకరించినట్లు సమాచారం. వరణ్‌ స్నేహితురాలి ద్వారానే ఆ వీడియోలు కౌశిక్‌ సోదరికి చేరాయని తెలిసింది. ఈ ఇద్దరు యువతులను సైతం పోలీసులు విచారించే అవకాశం ఉంది.

ఈ కేసుపై ప్రత్యేక దృష్టిసారించిన గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి..దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అందరినీ అరెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఐటీ నిపుణుల సాయంతో మూడో వ్యక్తి జాడ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవీ చూడండి-గుంటూరులో విద్యార్థినిపై లైంగికదాడిలో కొత్తకోణం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.