ETV Bharat / city

YCP Plenary: వైకాపా జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్​ జగన్ ఎన్నిక

author img

By

Published : Jul 9, 2022, 2:25 PM IST

Updated : Jul 9, 2022, 4:05 PM IST

jagan elected as the lifetime permanent president of ysrcp
jagan elected as the lifetime permanent president of ysrcp

14:22 July 09

వైసీపీ ప్లీనరీలో తీర్మానానికి ఆమోదం

వైకాపా జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్​ జగన్ ఎన్నిక

YSRCP lifetime president ys jagan: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ(వైకాపా) జీవితకాల అధ్యక్షుడిగా సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు గుంటూరులో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో తీర్మానం చేసి ఆమోదించారు. పారదర్శక పాలన-సామాజిక సాధికారత, పరిశ్రమలు-ఎంఎస్‌ఎంఈ, వ్యవసాయంపై తదితర అంశాలపై తీర్మానాలు చేసిన వైకాపా నేతలు.. వాటిపై చర్చించారు. తీర్మానాలను ఆమోదించిన అనంతరం సీఎం జగన్‌.. ప్లీనరీ ముగింపు ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా జగన్​ మాట్లాడారు..

"నాపై ఆప్యాయత చూపిస్తున్నారు.. అనురాగం పంచుతున్నారు. ఈ ప్లీనరీ ఆత్మీయుల సునామీలా కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. దశాబ్దం పాటు కష్టాలను భరించి, అవమానాలు తట్టుకొని త్యాగాలు చేసిన నా సైన్యం ఇక్కడ ఉంది. మన పార్టీ భావాలు, విధానాలు, బాధ్యతలను ఎంతో అభిమానంతో మీ భుజాలపై మోస్తున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు నిండు మనసుతో సెల్యూట్‌ చేస్తున్నా. నా కష్టంతో పాటు మీ త్యాగాలు, శ్రమ వల్లే ఈ ప్రభుత్వం ఏర్పాటైంది. మూడేళ్ల పాలనలో ఆర్థిక, సామాజిక, రాజకీయ, వైద్యం, వ్యవసాయం.. ఇలా అనేక రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. బాధ్యత కలిగిన పార్టీగా మన భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చాం" అని జగన్​ అన్నారు.

దేవుడు స్క్రిప్ట్‌ గొప్పగా రాస్తాడు..: "అప్పట్లో కాంగ్రెస్, తెదేపా కలిసి నాపై కేసులు పెట్టాయి. ఓదార్పు యాత్ర మానుకోవాలని ఒత్తిడి చేశాయి. శక్తిమంతమైన వ్యవస్థలతో దాడి చేయించారు. మనకు అన్యాయం చేసిన పార్టీల ప్రస్తుత పరిస్థితి ఏంటి? మనకు అన్యాయం చేసిన పార్టీలకు రాష్ట్రంలో నామరూపాలు లేవు. 2014లో ఓడినా నాపై కుట్రలు, కుతంత్రాలు ఆపలేదు. 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొన్నారు. మన పార్టీ ఉండకూడదని కుయుక్తులు పన్నారు. మా వద్ద ఎన్ని కొన్నారో వాళ్లకు అన్ని సీట్లే వచ్చాయి. దేవుడు స్క్రిప్ట్‌ రాస్తే గొప్పగా రాస్తాడు.. ఎప్పటికైనా మంచే గెలుస్తుంది. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి విషయం నెరవేరుస్తున్నాం. ఈ మూడేళ్లలో మంచి పాలన అందించడంపైనే దృష్టిపెట్టాను. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను లాక్కోవడంపై దృష్టి పెట్టలేదు. నాయకుడిని, పార్టీని నడిపించేవి.. క్యారెక్టర్‌, క్రెడిబులిటీ మాత్రమే. ప్రజల గుండెల్లో ముద్ర వేసేందుకు ఎంతో తాపత్రయ పడ్డాం.

ప్రజలకు మంచి చేసే ఆలోచన.. గుండెలో ఉండాలి.. "గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసేందుకే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన తెదేపా నేతలకు ఎప్పుడైనా వచ్చిందా? ప్రజలకు మంచి చేసే చిప్‌.. గుండెలో ఉండాలి. చంద్రబాబుకు ఎప్పుడూ పదవిపై వ్యామోహం మాత్రమే ఉంది. కుప్పం రెవెన్యూ డివిజన్ ఇవ్వాలని చంద్రబాబు అర్జీ పెట్టుకున్నారు. దోచుకోవాలి.. పంచుకోవాలి.. ఇదీ వాళ్లకు తెలిసిన రాజకీయం.. కానీ, కుప్పం ప్రజల బాగు కోసం రెవెన్యూ డివిజన్‌ ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ పెత్తందార్ల పార్టీ.. ఆయన పార్టీ సిద్ధాంతం.. వెన్నుపోటు మాత్రమే.. రెండు సిద్ధాంతాలు, భావాల మధ్య ఇవాళ యుద్ధం జరుగుతోంది" అని జగన్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: YSRCP Plenary: కోలాహలంగా వైకాపా ప్లీనరీ.. ఉత్సాహంలో కార్యకర్తలు

Last Updated :Jul 9, 2022, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.