ETV Bharat / city

పోలీసులకే ఆదేశాలు ఇచ్చి.. అడ్డంగా దొరికిపోయిన ఫేక్​ ఐఏఎస్

author img

By

Published : Apr 9, 2022, 10:53 PM IST

Updated : Apr 10, 2022, 7:33 AM IST

Fake IAS Arrested in Guntur District
Fake IAS Arrested in Guntur District

Fake IAS Arrested in Guntur District: గుంటూరు జిల్లాలో నకిలీ ఐఏఎస్ అధికారి గుట్టురట్టు చేశారు నల్లపాడు పోలీసులు. ఓ అమ్మాయి వివాహం ఆపాలంటూ.. పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో నకిలీ అధికారి బాగోతం బయటపడింది.

గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు.. నకిలీ ఐఏఎస్ అధికారి గుట్టురట్టు చేశారు. ఐఏఎస్ అధికారిగా చెప్పుకుంటున్న వెంకటలక్ష్మీ నరసింహా.. అతనికి సహాయకుడిగా వ్యవహరిస్తున్న వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ఓ అమ్మాయి పెళ్లిని తక్షణమే ఆపాలంటూ పోలీసులకు ఈ నకిలీ ఐఏఎస్ అధికారి ఆదేశాలు జారీ చేశాడు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన పోలీసులు.. తీగలాగితే డొంకంతా కదిలింది. ఐఏఎస్‌ అధికారినంటూ పోలీసులను బురిడీ కొట్టించడమే కాదు.. ప్రధాని, ముఖ్యమంత్రి కార్యాలయాల్లో ఓఎస్‌డీ వంటి అత్యున్నత ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి రూ.కోట్లలో సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

గుంటూరుకు చెందిన తెలదేవులపల్లి వెంకట లక్ష్మీ నరసింహమూర్తి పీజీ చదివాడు. మోసాలనే వ్యాపకంగా మార్చుకున్నాడు. ఈయన పీఏగా చెప్పుకుంటున్న గన్నవరపు వెంకటేశ్వరరావు శుక్రవారం రాత్రి ఖరీదైన కారులో నల్లపాడు స్టేషన్‌కు వెళ్లి.. మా సార్‌ నరసింహమూర్తి మాట్లాడతారని ఎస్సై ఆరోగ్యరాజ్‌కు ఫోన్‌ ఇచ్చారు. తాను డీజీపీ, ఎస్పీతో మాట్లాడినట్లు ఫోన్‌లో నరసింహమూర్తి చెప్పారు. ఒక మహిళా కానిస్టేబుల్‌, ఇద్దరు కానిస్టేబుళ్లను తన వద్దకు పంపాలని సూచించగా అందుకు ఎస్సై ఏదైనా రాతపూర్వకంగా అడగాలని చెప్పారు. తాను బస చేసిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులోని హోటల్‌కు రమ్మన్నారు. ఆమేరకు ఎస్సై వెళ్లగా ల్యాప్‌టాప్‌లో ముందుగా సిద్ధం చేసుకుని ఉంచిన ఓ లేఖ ప్రింటు తీసి అందజేశారు. ఆ లేఖను అనుమానించిన ఎస్సై దాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నరసింహమూర్తికి డీఎస్పీ ప్రశాంతి ఫోన్‌ చేయగా.. అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌తో మాట్లాడినట్లు చెప్పారు. గుంటూరు వికాస్‌ నగర్‌లో ఓ యువతికి తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని, తనతో పోలీసు ఫోర్స్‌ పంపాలని, ఆ అమ్మాయిని రక్షించాలని చెప్పాడు. అనుమానించిన డీఎస్పీ అసలు ఇతను ఎవరో నిగ్గు తేల్చాలని రెండు పోలీసు బృందాలను అతను బసచేసిన హోటల్‌కు పంపగా, అప్పటికే అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో డీఎస్పీ ఇతను మోసగాడని, నకిలీ ఐఏఎస్‌ పేరుతో హడావుడి చేస్తున్నాడని ఒక అంచనాకు వచ్చి ఉన్నతాధికారుల ఆదేశాలతో అతని చరవాణి టవర్‌ లొకేషన్‌ తీసుకుని విజయవాడకు మార్గ మధ్యలో ఉండగా అదుపులోకి తీసుకుని గుంటూరు తరలించారు. నిందితుడు నుంచి ల్యాప్‌ టాప్‌, 3 చరవాణిలు, నకిలీ లెటర్‌ హెడ్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకోవడంలో ప్రతిభ కనబర్చిన నల్లపాడు ఎస్సైలు కిషోర్‌, ఆరోగ్యరాజు, కానిస్టేబుళ్లను ఎస్పీ, డీఎస్పీ అభినందించారు.

పదుల సంఖ్యలో బాధితులు.. నిందితుడు లక్ష్మీనరసింహమూర్తి ఐఏఎస్‌ అధికారిని, కేఎల్‌ వర్సిటీ సీఈవో అని పరిచయం చేసుకుని ఇప్పటివరకు పదుల సంఖ్యలో నిరుద్యోగులను మోసగించినట్లు వెల్లడైంది. వీరి నుంచి రూ.కోట్లలో నగదు కాజేసినట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం ఐబీ వారు గత ఆరు నెలలుగా గాలిస్తున్నారని చెప్పారు. ఇతనిపై గుంటూరు, విజయవాడల్లోని పలు స్టేషన్లలో కేసులు ఉన్నట్లు చెప్పారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలియగానే పలువురు బాధితులు నల్లపాడు స్టేషన్‌కు చేరుకున్నారు. వీరిలో ఒకరు రూ.2 కోట్లు, మరొకరు రూ.1.35 కోట్లు ముట్టజెప్పినట్లు ఫిర్యాదు చేశారు. ఇతని ఉచ్చులో పలువురు ప్రభుత్వ, విశ్రాంత అధికారులు ఉన్నారని తెలిసింది. నరసింహమూర్తిని, వెంకటేశ్వరరావులను స్టేషన్‌లో ఉంచి ఆరా తీస్తుండగానే హైకోర్టు న్యాయవాది ఒకరు స్టేషన్‌కు వచ్చి వారిని స్టేషన్‌ బెయిల్‌ మీద తీసుకెళ్లాలని ప్రయత్నించారని పోలీసు వర్గాలు తెలిపాయి.

యువతిపై కన్నేసి: వెంకటలక్ష్మీ నరసింహాది గుంటూరు వికాస్‌నగర్‌. తన ఇంటికి సమీపాన ఉండే ఓ యువతిపై కన్నేశాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించగా యువతితో పాటు తల్లిదండ్రుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఈనెల 24న ఆ యువతి వేరొకరిని వివాహం చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటుండగా దానిని చెడగొట్టాలని ఇలా కుట్ర పూరితంగా వ్యవహరించినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని డీఎస్పీ ప్రశాంతి తెలిపారు.

ఇదీ చదవండి:
ఆడపిల్ల పుట్టిందని.. ఓ తల్లి ఏం చేసిందంటే?

Last Updated :Apr 10, 2022, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.