CHANDRABABU : జగన్ జాగ్రత్త.. పిన్నెల్లీ ఖబడ్దార్:వైకాపా నాయకులకు చంద్రబాబు హెచ్చరిక

author img

By

Published : Jan 13, 2022, 6:28 PM IST

Updated : Jan 14, 2022, 4:37 AM IST

తెదేపా అధినేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు ()

18:22 January 13

వెల్దుర్తి మండలం గుండ్లపాడులో చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు

‘మా పార్టీ నాయకులు, కార్యకర్తల జోలికొస్తే ఊరుకోం. జగన్‌ జాగ్రత్త.. పిన్నెల్లీ ఖబడ్దార్‌. ఇకపై ఇలాగే వ్యవహరిస్తే జరిగే పరిణామాలకు బాధ్యత ప్రభుత్వమే వహించాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో హత్యకు గురైన తెదేపా నేత తోట చంద్రయ్య పార్థివదేహాన్ని చంద్రబాబు సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి నంగనాచి కబుర్లు చెబుతున్నారు. ఖబడ్దార్‌ పిన్నెల్లీ.. నీలాంటి వాళ్లను చాలామందిని చూశా, జాగ్రత్తగా ఉండు. మాచర్ల ఏమన్నా నీ జాగీరనుకున్నావా, పల్నాడు నీ సొత్తు అనుకున్నావా? నీ ఉపన్యాసాలు ఎవరికీ అక్కర్లేదు. మాచర్లకు బొండా ఉమా, బుద్దా వెంకన్న వస్తే హత్యాయత్నం చేయిస్తావా? దాడిచేసిన వారికి పురపాలక సంఘం ఛైర్మన్‌ పదవి ఇస్తావా? నేను రౌడీయిజం అణచాలనుకుంటే ఒక్క నిమిషం పట్టదు. తెదేపా అధికారంలో ఉన్నకాలంలో మీలాగే చేసి ఉంటే, వైకాపా నాయకులు ఒక్కరు మిగిలేవారా? ప్రజల తిరుగుబాటు జరిగితే మీ రౌడీయిజం ఎంతోకాలం సాగదు. ఇదే నియోజకవర్గం దుర్గి మండలం ఆత్మకూరుకు రావాలని చలో ఆత్మకూరుకు పిలుపునిస్తే నా తలుపులకు తాళ్లు కట్టి రాకుండా అడ్డుకుంటారా? తీవ్రవాదం, ఫ్యాక్షన్‌ ముఠాలను అదుపు చేశాను. మతతత్వవాదులను అణిచివేసి, సామరస్యం నెలకొల్పాను. ప్రస్తుతం రాష్ట్రంలో నేరస్థులు పాలిస్తున్నారు. అప్పట్లో వివేకానందరెడ్డి హత్యను గుండెపోటుగా చిత్రీకరించారు. జగన్‌కు దమ్ముంటే హత్యలపై సమాధానం చెప్పాలి. తన చెంచాలతో మాట్లాడించడం కాదు, సీఎం నేరుగా ఇక్కడకు వచ్చి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ఇప్పటివరకు తెదేపా నాయకులు, కార్యకర్తలు 33 మందిని వైకాపా మూకలు చంపేశాయి. ఇందులో 20 మంది బీసీలు, ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు, ఇద్దరు మైనార్టీలు, ఆరుగురు అగ్రవర్ణాలవారు ఉన్నారు. పోలీసు వ్యవస్థకు సవాల్‌ విసురుతున్నా... జరుగుతున్న హత్యలను డీజీపీ చూడాలి. మా కార్యకర్తలను వైకాపా వాళ్లు చంపుతున్నారు, అయినా పోలీసు వ్యవస్థ కట్టడి చేయడం లేదు. ఇక్కడ పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు పోటీ చేయకుండా అడ్డుకున్నారు. మాచర్ల ప్రజలు మీకు ఊడిగం చేయాలా?’ అంటూ చంద్రబాబు నిలదీశారు.

మాచర్లలో ఏ ఘటన జరిగినా టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాచర్లలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీ వేధింపులు తట్టుకోలేక కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. గుండ్లపాడులో చంద్రయ్య హత్య గురువారం ఉదయం జరిగిందని, బుధవారం రాత్రి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇదే గ్రామానికి వచ్చి వెళ్లినట్లు తనకు సమాచారం ఉందన్నారు. చంద్రయ్యకు ఇక్కడ వేరే గొడవలు లేవని, రాజకీయంగా ప్రత్యర్థిగా ఉండటమే ఆయన హత్యకు దారితీసిందన్నారు. చంద్రయ్య ప్రజాస్వామ్యం కోసం పోరాడితే హత్య చేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు తనను గతంలో చంద్రయ్య ఆహ్వానించారని, కానీ ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు రావాల్సి వస్తుందనుకోలేదన్నారు. చంద్రయ్య ఆత్మకు శాంతి చేకూరాలంటే చంపిన వారికి శిక్షపడాలన్నారు. మాచర్లలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. బ్రహ్మారెడ్డికి మాచర్ల తెదేపా ఇన్‌ఛార్జి ఇవ్వగానే రామకృష్ణారెడ్డి కాళ్ల కింద భూమి కంపిస్తుందన్నారు. బ్రహ్మారెడ్డి గట్టిగా నిలబడతాడనే ఆయనపై ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారన్నారు. రెండేళ్ల తర్వాత వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. హత్యా రాజకీయాలకు పాల్పడేవారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు.

కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థికసాయం
తోట చంద్రయ్య కుటుంబానికి పార్టీ తరఫున రూ.25 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. గురువారం రాత్రి చంద్రయ్య కుటుంబసభ్యులతో మాట్లాడిన చంద్రబాబు.. ఆ కుటుంబానికి పార్టీ అండదండలు ఉంటాయన్నారు. తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. అనంతరం రాత్రి 8.45 గంటల వరకు సాగిన చంద్రయ్య అంతిమయాత్రలో చంద్రబాబు పాల్గొన్నారు. పార్థివదేహాన్ని తీసుకెళ్లే ట్రాక్టర్‌ ట్రాలీలో నిలబడ్డారు. శ్మశానం వరకు వెళ్లి చితి మీద కర్ర పేర్చి నివాళులు అర్పించారు.

పాడె మోసిన చంద్రబాబు
తోట చంద్రయ్య(42) మృతదేహాన్ని చూసి చలించిన చంద్రబాబు స్వయంగా పాడెనుమోశారు. అంతకుముందు చంద్రయ్య భార్య కోటమ్మ, కుమారుడు వీరాంజనేయులతో మాట్లాడారు.

ప్రశ్నించేవారిని అంతమొందించాలని చూస్తున్నారు: లోకేశ్‌
వైకాపా అవినీతిని ప్రశ్నించేవారిపై దాడులు చేయడం, ప్రజల పక్షాన పోరాడేవారిని అంతమొందించడం సీఎం జగన్‌రెడ్డికి అలవాటుగా మారిందని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. హత్యా రాజకీయాలకు వారసుడు జగన్‌రెడ్డి అని గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. ‘వైకాపా పాలనలో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోతోంది. గుండ్లపాడులో వైకాపా గూండాలు తోట చంద్రయ్యను దారుణంగా హత్య చేయడం ఘోరం. ఈ హత్యకు కారకులను కఠినంగా శిక్షించాలి. చంద్రయ్య కుటుంబానికి తెదేపా అండగా ఉంటుంది’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

హత్యా రాజకీయాలను సహించం: అచ్చెన్నాయుడు
వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకత్వం, హత్యా రాజకీయాలు పెరిగిపోయాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఇకనుంచి అలాంటి చర్యలను సహించబోమని ఓ ప్రకటనలో హెచ్చరించారు. ‘పల్నాడులో వైకాపా నేతలు రోజురోజుకు పేట్రేగిపోతున్నారు. రెండున్నరేళ్లలో చాలామంది తెదేపా కార్యకర్తలను బలి తీసుకున్నారు. చంద్రయ్య కుటుంబానికి తెదేపా అండగా ఉంటుంది. చంద్రయ్య హత్యకు కారకులను కఠినంగా శిక్షించాలి’ అని డిమాండు చేశారు.

ఇవీచదవండి.

Last Updated :Jan 14, 2022, 4:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.