PRC: పీఆర్‌సీ ఆమోదయోగ్యంగా లేదు.. పాత పీఆర్‌సీ అయినా ఇవ్వండి: ఉద్యోగ సంఘాలు

author img

By

Published : Jan 13, 2022, 4:36 PM IST

Updated : Jan 14, 2022, 4:49 AM IST

సచివాలయ ఉద్యోగులకూ తక్కువ హెచ్‌ఆర్‌ఏ ఇవ్వడం దారుణం

16:32 January 13

హెచ్‌ఆర్‌ఏపై మాకు స్పష్టత ఇవ్వలేదు

పీఆర్‌సీ ఆమోదయోగ్యంగా లేదు

Employee Union Leaders On PRC: ఉద్యోగులకు ప్రస్తుతం అమల్లో ఉన్న హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, 70ఏళ్లు దాటిన పింఛనుదారులకు అదనపు పింఛనువంటి సదుపాయాలను యథాతథంగా కొనసాగించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వ నిర్ణయం గురువారంకూడా వెల్లడి కాలేదు. వరుసగా నాలుగోరోజు గురువారం ఏపీ ఐకాస, ఐకాస అమరావతిల ఐక్యవేదిక ప్రతినిధులు సీఎం కార్యాలయ అధికారులతో చర్చించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు. సత్వరం సీఎం దృష్టికి తీసుకెళ్లాలని తాము పట్టుబట్టగా.. సినీనటుడు చిరంజీవితో సమావేశంలో సీఎం బిజీగా ఉన్నారని అధికారులు తెలిపారని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. అధికారులతో సమావేశం అనంతరం ఏపీ ఐకాస అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. ‘మా సమస్యలపై సీఎస్‌ వద్ద తేల్చుకోవాలని ఈనెల 7న పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌ ప్రకటించినప్పుడు ముఖ్యమంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో మేము సాధించుకున్న 4రకాల స్లాబ్‌ల హెచ్‌ఆర్‌ఏ స్థానంలో అందరికీ 8శాతం హెచ్‌ఆర్‌ఏతో జీఓ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని, ఇది తగదని చర్చలో అధికారులకు తెలిపాం. అవసరమైతే పాత పీఆర్‌సీనే ఇవ్వాలని పట్టుబట్టాం. సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. సంక్రాంతి తర్వాత న్యాయం చేస్తామని హామీనిచ్చారు. ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా సంక్రాంతి తర్వాత మా కార్యాచరణ ఉంటుంది. ఉద్యోగుల డిమాండ్లపై రాజీ లేకుండా పోరాడతాం’ అని వెల్లడించారు.

40శాతం వరకు హెచ్‌ఆర్‌ఏను నష్టపోతున్నారు
గత ప్రభుత్వంలో సాధించుకున్న హెచ్‌ఆర్‌ఏ 4రకాల స్లాబ్‌లను కొనసాగించాలని కోరామని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ‘స్లాబ్‌లను తొలగిస్తే సచివాలయం, హెచ్‌వోడీల్లోని ఉద్యోగులు 22శాతం, జిల్లాకేంద్రాల్లోని ఉద్యోగులు 12శాతం, మున్సిపాలిటీ కేంద్రాల్లోని ఉద్యోగులు 6.5శాతం, మండలకేంద్రాల్లోని ఉద్యోగులు 4శాతం చొప్పున వెరసి 40శాతం వరకు హెచ్‌ఆర్‌ఏలో ఉద్యోగులు నష్టపోతారని లెక్కలతో సహా వివరించాం’ అని చెప్పారు. ‘ఫిట్‌మెంట్‌ విషయంలో మేం రాజీ పడ్డామని, ఐఆర్‌కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ తెచ్చామని మాపైన ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులు వ్యతిరేకంగా ఉన్నారు గత ప్రభుత్వంలో సాధించుకున్న హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, అదనపు పింఛనుపై రాజీ ప్రసక్తే లేదని చెప్పాం’ అని తెలిపారు. ‘ఈ 2రోజులు ఓపిక పట్టండి. సీఎం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత సానుకూల నిర్ణయం తీసుకుందాం. అప్పటివరకు హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, అదనపు పింఛను జీవోలను నిలుపుదల చేస్తామని సీఎంఓ అధికారులు చెప్పారు’ అని తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లకు భిన్నంగా ప్రభుత్వం జీఓలు తెస్తే సమావేశం నిర్వహించుకుని మేం కూడా ఉద్యమిందుకు సిద్ధమని ప్రకటించారు.

20న జిల్లా కలెక్టరేట్ల ముట్టడి: ఫ్యాప్టో
మెరుగైన పీఆర్సీని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 20న జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముట్టడిని నిర్వహిస్తామని ఫ్యాప్టో (ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఉద్యోగ విరమణ వయసును 62ఏళ్లకు పెంచడాన్ని వ్యతిరేకించింది. ఈ కమిటీ రౌండ్‌టేబుల్‌ సమావేశం విజయవాడలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో గురువారం జరిగింది. 23% ఫిట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తూ జరిగిన ఈ సమావేశంలో 11వ పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌ను ఐఆర్‌కంటే ఎక్కువగా ప్రకటించాలని, అధికారుల కమిటీ సిఫార్సులను రద్దు చేయాలని వక్తలు డిమాండ్‌ చేశారు. ఇతర డిమాండ్ల పరిష్కారానికి ఈనెల 20న కలెక్టరేట్ల ముట్టడి, 28న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఫ్యాప్టో ఛైర్మన్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు, సెక్రటరీజనరల్‌ శరత్‌చంద్ర, కో-ఛైర్మన్ల వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు వెల్లడించారు. .అధికారుల కమిటీ రూపొందించిన పీఆర్సీ నివేదికను శుక్రవారం భోగి మంటల్లో వేసి నిరసన తెలియజేస్తామని ఫ్యాప్టో ప్రకటించింది.

ఇదీ చదవండి

సినీ పరిశ్రమ సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని భావిస్తున్నాం: చిరంజీవి

Last Updated :Jan 14, 2022, 4:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.