సొంతానికి సంతర్పణ.. వైకాపా కార్యాలయాలకు కోట్ల విలువైన భూముల కేటాయింపు

author img

By

Published : Jun 19, 2022, 4:28 AM IST

Updated : Jun 19, 2022, 3:58 PM IST

Allocation of land worth crores to YCP Party offices

వైకాపా జిల్లా కార్యాలయాల కోసం ఎక్కడపడితే అక్కడ ప్రభుత్వ స్థలాలు కేటాయించేస్తున్నారు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవాలని వైకాపా పెద్దలకు ఆలోచన వచ్చిందే తడవుగా చకచకా పావులు కదులుతున్నాయి. స్థలం చూడటం.. విజ్ఞప్తి పంపడం వరకే నాయకుల వంతు. ఆ వెంటనే జిల్లా యంత్రాంగం ఆగమేఘాల మీద కదులుతోంది. దస్త్రాలు పరుగులు పెడుతున్నాయి.

వైకాపా జిల్లా కార్యాలయాల కోసం కొన్నిచోట్ల భూముల కేటాయింపులు జరిగిపోతున్నాయి. మరి కొన్నిచోట్ల ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. నగరాల నడిబొడ్డున వివిధ ప్రజోపయోగ కార్యక్రమాల కోసం గతంలో కేటాయించిన స్థలాలూ వాటిలో ఉంటున్నాయి. ఎకరానికి ఏడాదికి వెయ్యిరూపాయల నామమాత్ర రుసుముతో 33 ఏళ్లకు లీజుకు ఇస్తున్నారు. ఆ గడువు ముగిశాక అదే లీజును 99 ఏళ్లకు పెంచుకునే అవకాశమూ ఉంది. ఈ విషయంలో కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరిలో స్వాతంత్య్రానికి ముందునుంచీ పోలీసుశాఖ అధీనంలో ఉన్న భూమిని, రాజమహేంద్రవరంలో కేంద్ర కారాగారానికి చెందిన భూమిని, కాకినాడలో నన్నయ వర్సిటీ స్టడీసెంటర్‌ భూమిని పార్టీ కార్యాలయాలకు కేటాయిస్తున్నారు. తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నా పట్టించుకోవడం లేదు. వైకాపా కోరుతున్న భూమి నగరపాలక సంస్థకు చెందినదైతే... గుట్టు చప్పుడు కాకుండా పాలకవర్గ సమావేశాల్లో ఆమోదించేస్తున్నారు. గుంటూరులో కౌన్సిల్‌ సమావేశం కూడా ఏర్పాటుచేయకుండా... మేయర్‌ అనుమతితో స్థాయీసంఘంలోనే తీర్మానించి జిల్లా యంత్రాంగానికి ప్రతిపాదన పంపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పార్టీల కార్యాలయాలకు స్థలాలు కేటాయించవచ్చు. కానీ వాటికి నగరం నడిబొడ్డున, అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోనే, రూ.కోట్ల విలువైన భూముల్ని సంతర్పణ చేయడమే వివాదాస్పదమవుతోంది.

పార్టీ నాయకులు, కార్యకర్తలకు తప్ప.. సాధారణ ప్రజలకు పార్టీ కార్యాలయంతో ఎలాంటి పనీ ఉండదు. అత్యంత విలువైన, కీలక ప్రదేశాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల్ని భవిష్యత్తు అవసరాల కోసం ఉంచకుండా, రాజకీయ పార్టీ కార్యాలయాలకు కేటాయించడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వైకాపా కార్యాలయాల ఏర్పాటుకు కొన్ని జిల్లాకేంద్రాల్లో భూములు కేటాయిస్తూ ప్రభుత్వం మే నెలలో జీవోలు జారీచేసింది. ఇంకా కొన్ని ప్రతిపాదన దశలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్‌డీసీ ద్వారా వివిధ బ్యాంకులు, ఆర్థికసంస్థల నుంచి రూ.25వేల కోట్ల రుణం పొందేందుకు విశాఖలో ప్రభుత్వ శాఖలకు చెందిన విలువైన భూముల్ని తాకట్టు పెట్టింది. దాంతో పాటు విశాఖ, గుంటూరుల్లో ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూముల్ని విక్రయించే ప్రయత్నాలు చేసింది. సంబంధిత జీవోను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలవడంతో, సర్కారు ప్రయత్నానికి అడ్డుకట్ట పడింది. ఒకపక్క ఇలా విలువైన భూముల్ని అమ్మకానికి పెడుతూ.. మరోపక్క నగరాలు, పట్టణాల్లో అత్యంత ఖరీదైన భూముల్ని నామమాత్రపు లీజుకు తమకు తామే కట్టబెట్టుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

.

జిల్లాలవారీగా వైకాపా కార్యాలయాలకు జరిగిన భూ కేటాయింపులు, ప్రతిపాదనలు ఇలా...

.

ప్రాంతం: విశాఖపట్నంలోని ఎండాడలో పనోరమా హిల్స్‌
కేటాయించిన స్థలం: 2 ఎకరాలు
విలువ: అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ధర చ.గజం రూ.24 వేలు. బహిరంగ మార్కెట్‌లో రూ.60 వేల వరకు ఉంది. బహిరంగ మార్కెట్‌ ధర ప్రకారం చూస్తే దాని విలువ రూ.58 కోట్లు.

రాష్ట్రానికి వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖలో ఇప్పటికే ప్రభుత్వ స్థలాల కొరత ఉంది. భవిష్యత్తులో నగరం మరింత విస్తరించేకొద్దీ నివాస, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు, ఆస్పత్రుల వంటి మౌలిక వసతులకు పెద్ద ఎత్తున భూములు కావాలి. అలాంటి విశాఖలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ.. నివాస, వాణిజ్య ప్రాజెక్టులకు కేంద్రంగా మారుతున్న ఎండాడ 175/4 సర్వే నంబరులో అత్యంత విలువైన రెండెకరాల భూమిని వైకాపా కార్యాలయం నిర్మాణానికి 33 ఏళ్లపాటు ప్రభుత్వం ఇచ్చేసింది. జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఆ ప్రాంతంలో రాబోయేరోజుల్లో పర్యాటక ప్రాజెక్టులు అభివృద్ధి చేయవచ్చు. స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల తరహాలో నివాస అవసరాలకూ వాడుకోవచ్చు.

.

ప్రాంతం: కాకినాడ అర్బన్‌ మండలం రమణయ్యపేట

కేటాయించిన స్థలం: 2 ఎకరాలు
విలువ: బహిరంగ మార్కెట్‌లో చ.గజం సుమారు రూ.80 వేలు. ఆ లెక్కన మొత్తం భూమి విలువ సుమారు రూ.77 కోట్లు.

కాకినాడ గ్రామీణ మండలం పరిధిలోని తిమ్మాపురం సర్వేనంబరు 110లో రెండెకరాల భూమిని పార్టీ కార్యాలయానికి కేటాయించాలని అప్పటి జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ను వైకాపా కోరింది. వైకాపా కోరిన స్థలాన్ని ‘ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం-మల్లాడి సత్యలింగ నాయకర్‌ పీజీ సెంటర్‌’లో గ్రీన్‌బెల్ట్‌ అభివృద్ధికి 2000లో అప్పటి కలెక్టర్‌ కేటాయించారు. వైకాపా కార్యాలయం కోసం ఆ స్థలాన్ని వెనక్కివ్వాలని యూనివర్సిటీని రెవెన్యూ అధికారులు ఆదేశించారు. విషయం బయకు వచ్చి విద్యా, ప్రజాసంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేయడంతో అధికారులు వెనక్కి తగ్గారు. దానికి బదులు రమణయ్యపేట సర్వే నంబరు 155/2-7బిలో రెండెకరాల భూమిని కేటాయించాలని కాకినాడ నగరపాలక సంస్థ 2022 మే 26న తీర్మానం చేసింది. రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఆ భూమిని 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన కేటాయించారు.

.

ప్రాంతం: అమరావతి రోడ్డు పక్కనే, వైద్యకళాశాల బాలుర హాస్టల్‌ ఎదురుగా
ప్రతిపాదించిన స్థలం: 97 సెంట్లు
విలువ: అక్కడ చ.గజం రూ.50-60 వేలు ఉంది. 97 సెంట్ల విలువ సుమారు రూ.28 కోట్లు

గుంటూరులో ఇప్పుడు వైకాపా కార్యాలయానికి ప్రతిపాదించిన స్థలాన్ని... ప్రజల తాగునీటి అవసరాల కోసం రిజర్వాయర్‌ (వాటర్‌ ట్యాంక్‌) నిర్మించేందుకు నగరపాలక సంస్థ భూసేకరణ ద్వారా తీసుకుంది గానీ, ఇంకా కట్టలేదు. వైకాపా నేతలు ఆ భూమి కావాలని అడగ్గానే జీఎంసీ స్థాయీసంఘం తీర్మానం చేసి, ప్రభుత్వానికి ప్రతిపాదన పంపేసింది. ప్రతిపాదిత స్థలానికి ఎదురుగా ప్రభుత్వ వైద్యకళాశాల బాలుర వసతిగృహం, కొద్దిదూరంలో జ్వరాల ఆస్పత్రి ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రిలో వార్డుల విస్తరణకు స్థలం లేదు. ఇప్పుడు వైకాపా కార్యాలయానికి ప్రతిపాదించిన స్థలాన్ని... ఆస్పత్రి విస్తరణకో, వాటర్‌ట్యాంక్‌ నిర్మాణానికో వాడుకోకుండా, పార్టీ కార్యాలయానికి ఇవ్వాలనడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

అన్నమయ్య

ప్రాంతం: జిల్లా కేంద్రం రాయచోటిలో రింగురోడ్డు పక్కన
కేటాయించిన స్థలం: 1.60 ఎకరాలు
విలువ: ప్రస్తుతం అక్కడి మార్కెట్‌ రేటు ప్రకారం విలువ రూ.10 కోట్ల పైనే.

కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో వరిగెపల్లెకి వెళ్లే మార్గంలో అత్యంత విలువైన 1.60 ఎకరాల భూమిని వైకాపా కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. ఆ స్థలం జాతీయ రహదారికి దగ్గర్లో ఉంది. కొత్తగా ఏర్పడ్డ జిల్లా కావడంతో, జిల్లా కేంద్రంలో వసతుల కల్పనకు చాలా భూమి అవసరమవుతుంది. అలాంటిచోట వైకాపా కార్యాలయానికి అత్యంత ఖరీదైన ప్రాంతంలో 1.60 ఎకరాల భూమి కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి.

.

ప్రాంతం: పెద్దపాడు వద్ద జాతీయరహదారి పక్కనే
కేటాయించిన స్థలం: 1.50 ఎకరాలు
విలువ: సెంటు విలువ సుమారు రూ.6 లక్షలు. ఆ లెక్కన 1.50 ఎకరాల విలువ సుమారు రూ.9 కోట్లు.

శ్రీకాకుళం నగరపాలక సంస్థలో ఇటీవలే విలీనమైన పెద్దపాడులో జాతీయ రహదారి పక్కనే వైకాపా కార్యాలయం ఏర్పాటుకు 1.50 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించారు. గతంలో అక్కడ జగనన్న కాలనీ ఏర్పాటు చేయాలనుకున్నారు. దాన్ని పార్టీ కార్యాలయానికి కేటాయించాలని నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సూచించడంతో.. తాజాగా ఆ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

* నరసన్నపేట నియోజకవర్గంలో 30 సెంట్ల భూమి కావాలని వైకాపా నాయకులు జిల్లా యంత్రాంగాన్ని కోరారు. అక్కడ ఖాళీగా ఉన్న 23 సెంట్ల ప్రభుత్వ భూమిని వైకాపా కార్యాలయానికి కేటాయించే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఆ భూమి విలువ రూ.4.6 కోట్లు.

* విజయనగరం జిల్లా నెల్లిమర్ల దగ్గర వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి చెందిన మూడెకరాల స్థలాన్ని వైకాపా కార్యాలయం ఏర్పాటుకు పరిశీలించారు. కానీ అది దూరంగా ఉంటుందని.. విజయనగరంలోనే చూసే ఉద్దేశంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు.

తూర్పుగోదావరి

ప్రాంతం: రాజమహేంద్రవరంలో కేంద్ర కారాగారానికి చెందిన స్థలం కేటాయించాలని ప్రతిపాదన
విలువ: అక్కడ చ.గజం విలువ రూ.50 వేలు. వైకాపా కార్యాలయానికి ప్రతిపాదించిన రెండెకరాల విలువ సుమారు రూ.48 కోట్లు.

రాజమహేంద్రవరంలో కేంద్ర కారాగారానికి చెందిన ఖాళీ స్థలంపై వైకాపా నాయకుల కన్ను పడింది. దానిలో రెండెకరాలు పార్టీ కార్యాలయానికి కేటాయించాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా రెవెన్యూ అధికారుల్ని కోరారు. ఆ భూమిని అప్పగించాలన్న జిల్లా అధికారుల ప్రతిపాదనకు జైళ్లశాఖ అభ్యంతరం తెలిపింది. వివిధ వర్గాల నుంచీ తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దాంతో అధికారులు కాస్త వెనక్కి తగ్గారు. ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టారు. అయితే.. స్థలం కేటాయింపు ప్రతిపాదనను పూర్తిగా విరమించుకున్నారా? ప్రత్యామ్నాయం ఏంటన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు.

కోనసీమ

ప్రాంతం: సమనస
ప్రతిపాదిత స్థలం: 30 సెంట్లు
విలువ: అక్కడ ఎకరం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.5 కోట్లు. వైకాపా కార్యాలయానికి ప్రతిపాదించిన స్థలం విలువ సుమారు రూ.1.5 కోట్లు.

కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో పార్టీ కార్యాలయానికి రెండెకరాలు కేటాయించాలని వైకాపా కోరింది. పట్టణంలో ఒకేచోట అంత స్థలం లేకపోవడంతో అమలాపురం గ్రామీణ మండలంలోని సమనస వద్ద 30 సెంట్ల భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఆ భూమిని వైకాపాకి కేటాయించేందుకు నెలన్నర క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

తిరుపతి

ప్రాంతం: చంద్రగిరి
కేటాయించిన స్థలం: రెండు ఎకరాలు
విలువ: రెండెకరాలు రూ.16 కోట్లు.

చంద్రగిరిలో సుమారు 3 ఎకరాల భూమిని పోలీస్‌లైన్‌ పోరంబోకు కింద 1930లో మార్చారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఆ భూమి కావాలని వైకాపా నేతలు అడగ్గానే చంద్రగిరి తహసీల్దారు నుంచి ఆర్డీవోకి, అక్కడి నుంచి కలెక్టరుకు ప్రతిపాదన వెళ్లింది. ఇందులో రెండెకరాలు వైకాపాకి కేటాయిస్తూ జీవో విడుదలైంది. దానికి ప్రత్యామ్నాయంగా పోలీసు శాఖకు మంగళం గ్రామ పరిధిలోని 1/7 సర్వే నంబరులో 1.80 ఎకరాలు కేటాయించారు.

* చిత్తూరులో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారికి సమీపంలో రూ.కోట్ల విలువచేసే రెండెకరాల ప్రభుత్వ భూమిని వైకాపా కార్యాలయానికి కేటాయించేందుకు దస్త్రం సిద్ధమైనట్టు సమాచారం. ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

కడప

ప్రాంతం: అక్కాయపల్లె
ప్రతిపాదించిన విస్తీర్ణం: 67 సెంట్లు

విలువ: అక్కడ ప్రస్తుతం సెంటు రూ.20 లక్షల వరకు ఉంది. ఆ లెక్కన ప్రతిపాదిత స్థలం విలువ సుమారు రూ.13 కోట్లు.
తాజా పరిస్థితి: వివిధ వర్గాల నుంచి విమర్శలు రావడంతో ప్రతిపాదన విరమించుకున్నారు.

కడప అక్కాయపల్లె ప్రాంతంలో పౌరసరఫరాల సంస్థకు చెందిన 67 సెంట్ల భూమిని తమకు కేటాయించాలని వైకాపా కోరగానే నగరపాలక సంస్థ ఒక తీర్మానం ఆమోదించింది. ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పాలని రెవెన్యూశాఖ 2022 జనవరి 24న ఎ-1 నోటీసు జారీచేసింది. ఆ భూమి కేటాయింపునకు కలెక్టర్‌కు ప్రతిపాదన వెళ్లింది. దీనిపై వివిధ వర్గాల నుంచి నిరసనలు రావడంతో ప్రభుత్వం ఆ ప్రతిపాదన విరమించుకున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:

Last Updated :Jun 19, 2022, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.