చంద్రబాబుకు బాధలు చెబితే.. పునరావాస కేంద్రం నుంచి గెంటేస్తారా?

author img

By

Published : Aug 2, 2022, 7:53 AM IST

Velerupadu

Velerupadu: గోదావరి వరదల కారణంగా 20 రోజుల పాటు తాము పడిన బాధలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పుకుంటే అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడటం ఎంత వరకు సమంజసమని ఏలూరు జిల్లా వేలేరుపాడుకు చెందిన ఎర్రా వనజాకుమారి వాపోయారు.

Velerupadu: ఏలూరు జిల్లా వేలేరుపాడుకు చెందిన ఎర్రా వనజాకుమారి అనే మహిళ తన గోడును వీడియో ద్వారా వెల్లబోసుకున్నారు. ఏం చెప్పారంటే..

‘ఇటీవల వచ్చిన వరదలకు మా ఇల్లు ముంపునకు గురికావడంతో కుటుంబ సభ్యులతో సహా మండలంలోని శివకాశీపురం పునరావాస కేంద్రంలో తలదాచుకున్నాం. గత నెల 28న వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి మా బాధ చెప్పుకున్నాం. ఇందుకు కక్షగట్టారు.. వరదలో మునిగిపోయిన మా ఇళ్లు ఇంకా ఘోరంగా ఉన్నాయి. అయినా మాపై నిన్నటి నుంచి ఒత్తిడి తెచ్చి పునరావాస కేంద్రాన్ని ఖాళీ చేయించారు. ఖాళీ చేసేవరకు ఊరు కోలేదు. నిన్నటి నుంచి భోజనం పెట్టడం లేదు. పునరావాస కేంద్రంలో ఉండనివ్వండి చాలు... మా భోజనం మేమే వండుకుంటామన్నా వినలేదు. ఇల్లు బాగు చేసుకున్నాక వెళతామన్నా వినకుండా పట్టుబట్టి గెంటేశారు. కనీసం రెండు రోజులు గడువు అడిగినా ఇవ్వలేదు. మా వీడియోలు, ఫొటోల తీసి వాట్సాప్‌లో పెట్టారు. ఎమ్మార్వో పంపారంటూ వీఆర్‌వో రాంబాబు వచ్చారు. కలెక్టర్‌ నుంచి ఆదేశాలు వచ్చాయని.. ఖాళీ చేసి మీ ఇళ్లకు పోండని చెప్పారు. ఇళ్లకు వెళ్లలేకపోతే ఎక్కడైనా బరకాలు వేసుకుని ఉండండి, ఇక్కడ మాత్రం వద్దని చెప్పారు. చంద్రబాబు వచ్చినప్పుడు మా బాధలు చెప్పాను. పిల్లల చదువు కోసం పక్క ఊరికి మకాం వెళ్లామని చెప్పి, పునరావాస ప్యాకేజీలో మా పేరు తీసేశారని గోడు వెళ్లబోసుకున్నాను. అందుకే కక్షగట్టి మమ్మల్ని వెళ్లగొట్టారు.’ అని వనజాకుమారి ఆ వీడియోలో ఆవేదన వ్యక్తంచేశారు.

గోడు చెప్పుకుంటే బెదిరింపులా?: వేలేరుపాడులో వరద బాధితుల్ని పరామర్శించేందుకు తాను వెళ్లినప్పుడు... వరద సాయం అందలేదని తనతో గోడు వెళ్లబోసుకున్న మహిళల్ని వైకాపా నాయకులు, రెవెన్యూ అధికారులు బెదిరించడం, పునరావాస కేంద్రం నుంచి వెళ్లగొట్టడం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘గోదావరి వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు మానవతా హృదయంతో సాయం చేయాల్సిందిపోయి, వాళ్ల కష్టాల్ని నాతో చెప్పినందుకు బెదిరించడమేంటి? వైకాపా నాయకుల క్రూరత్వం తెలిసిందే. రెవెన్యూ ఉద్యోగులు కూడా వారికి వంత పాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మనం ఏమన్నా ఆటవిక యుగంలో ఉన్నామా? ప్రతిపక్ష నేతకు కష్టాలు చెప్పినందుకు ప్రతీకార చర్యలా?’ అని ఆయన మండిపడ్డారు. ‘ప్రజల్ని ఆదుకోకుండా తప్పు చేసింది మీరు కాదా? వైకాపా నేతల శాడిజాన్ని ఖండిస్తున్నాను’ అని ఆయన ట్విటర్‌లో ధ్వజమెత్తారు. వేలేరుపాడుకి చెందిన యర్రా వనజాకుమారి తమను పునరావాస కేంద్రం నుంచి ఎలా బయటకు గెంటేసిందీ వివరిస్తున్న వీడియోని చంద్రబాబు తన ట్వీట్‌కి జత చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.